
MLC Kavitha vs ED : లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత విచారణకు హాజరయ్యారు. సోమవారం ఉదయం 10:30 నిమిషాలకు ఢిల్లీలోని ఈడీ ఆఫీస్ కు ఆమె చేరుకున్నారు. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులో కెసిఆర్ ఇంటి నుంచి ఆమె బయలుదేరారు. బయలు దేరే సమయంలో కవిత వెంట భర్త అనిల్ కుమార్, మంత్రులు, ఇతర భారత రాష్ట్ర సమితి కీలక నేతలు ఉన్నారు. వారందరినీ లోపలికి వెళ్ళనీయకుండా ఈడీ సెక్యూరిటీ గార్డులు గేటు వద్ద అడ్డుకున్నారు. కవిత భర్త లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆయనను బయటకు లాగేశారు. చివరికి కవిత న్యాయవాదిని కూడా లోపలికి అనుమతించలేదు. కేవలం కవిత మాత్రమే కార్యాలయం లోపలికి వెళ్లారు.
దీంతో ఢిల్లీ ఈ డి ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. కవితను అరెస్టు చేస్తారని ఊహాగానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి నాయకులు అలజడి సృష్టిస్తారనే నెపంతో ఢిల్లీ పోలీసులు అక్కడ 144 సెక్షన్ విధించారు. మీడియాను కూడా లోపలికి అనుమతించడం లేదు. ఈడి ఉద్యోగులను కూడా ఒకటికి రెండుసార్లు పరిశీలించిన తర్వాతనే లోపలికి పంపిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా కేంద్ర బలగాలు అక్కడ పహారా కాస్తున్నాయి. ఇప్పటికే కొంతమంది భారత రాష్ట్ర సమితి నాయకులను అదుపులోకి తీసుకున్నాయి.
ఈడి విచారణ ను సవాల్ చేస్తూ ఇప్పటికే కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పెండింగ్లో ఉన్నది. ఆ సమయంలోనే మార్చి 16న ఆమె విచారణకు హాజరు కాలేదు. 20వ తేదీన మళ్లీ హాజరుకావాలని ఈడి నోటీసులు జారీ చేసింది. ఈ ఆదేశాలతోనే కవిత విచారణకు హాజరయ్యారు. కవిత విచారణకు వెళ్తారా లేదా అనే సందేహాలు సోమవారం ఉదయం దాకా ఉండేవి. అంతేకాదు ఆమె విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక న్యాయవాదితో సంప్రదింపులు జరిపారు. ఆయన సూచనతోనే ఆమె విచారణకు హాజరయినట్టు తెలిసింది. మరో వైపు తాను బినామీ అని చెప్పిన అరుణ్ రామచంద్ర తో కలిలి కవితను ఈడి అధికారులు విచారించనునట్లు తెలుస్తోంది.