MLC Elections: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీల ఎన్నికలు ముగిశాయి. ఇందులో ఆరుగురు రెండు రోజుల క్రితమే పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇప్పుడు స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. నిన్నటితో నామినేషన్ల స్వీకరణ గడవు కూడా ముగిసింది. అయితే ఇందులో దాదాపు టీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించిన అభ్యర్థులే గెలిచేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఎన్నికలు ప్రత్యక్ష పద్దతిలో జరగవు. సాధారణ ప్రజలు ఎన్నికున్న స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేస్తారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ నుంచే ఎక్కువగా స్థానిక సంస్థల సభ్యులు ఉన్నారు. కాబట్టి ఆ పార్టీ వారు సహజంగానే ఎమ్మెల్సీలుగా ఎన్నిక కానున్నారు.
Also Read: కేసీఆర్.. నిరుద్యోగుల నమ్మకాన్ని కోల్పోయారా?
కొన్ని చోట్ల ఏకగ్రీవం.. మరి కొన్ని చోట్ల ఎన్నికలు..
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకే స్థానిక సంస్థల సభ్యుల బలం ఎక్కువగా ఉంది. సాధారణంగా ఆ పార్టీ వారే ఎమ్మెల్సీలుగా ఎన్నికవుతారు. అయితే కొన్ని చోట్ల బలం తమకు బలం లేకున్నా కాంగ్రెస్ పోటీ చేస్తోంది. అలాగే టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ టికెట్ ఆశించి భంగపడ్డ ఆ పార్టీ నాయకులు కూడా ఇండిపెండెంట్ నామినేషన్ దాఖలు చేశారు. మరి కొన్ని చోట్ల టీఆర్ఎస్ నుంచే ఇద్దరు సభ్యులు నామినేషన్లు వేశారు. ఇన్ని రోజులు టీఆర్ఎస్‌లో ఉండి.. టీఆర్ఎస్ పై కోపంతో రెబల్‌గా కూడా నామినేషన్లు వేసినవారున్నారు. దీంతో అక్కడ ఎన్నికలు అనివార్యం కానున్నాయి. అయితే కేవలం టీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన చోట మాత్రం ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అలాగే జరిగింది. ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు కేవలం ఆరుగురు అభ్యర్థులు మాత్రమే నామినేషన్ వేయడంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైందని అధికారులు ప్రకటించారు.
ఎక్కడి నుంచి ఎంత మంది ?
ప్రస్తుతం ఉమ్మడి జిల్లాల వారీగా ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో ఉమ్మడి జిల్లాలు 10 ఉన్నాయి. అయితే హైదరాబాద్‌లో స్థానిక సంస్థల సభ్యులు ఉండే అవకాశం లేదు కాబట్టి.. ఉమ్మడి 9 జిల్లాల పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ తొమ్మిది జిల్లాల పరధిలో 12 స్థానాలకు ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కవిత ఇక్కడి నుంచి నామినేషన్ వేసింది. అయితే అక్కడ నుంచి టీఆర్ఎస్ నాయకుడు కోటగిరి శ్రీనివాస్ రావు నామినేషన్ వేశారు. ఆయనను బుజ్జగించేందుకు పార్టీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. మహబూబ్ నగర్ నుంచి దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి నామినేషన్లు వేశారు. కరీంనగర్ నుంచి రెండు స్థానాలు ఖాళీగా ఉంటే భాను ప్రసాద్, ఎల్.రమణ నామినేషన్లు వేశారు. ఇందులో ఎల్. రమణ హుజూరాబాద్ ఎన్నికలకు ముందే టీఆర్ఎస్‌లోకి చేరిన విషయం తెలిసింది. ఆయన అంతకు ముందు టీడీపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్నాడు. అయితే కరీంనగర్ నుంచి రెబల్ అభ్యర్థిగా మాజీ మేయర్ రవీందర్ సింగ్ నామినేషన్ వేశారు. నల్గొండ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డి, 10 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఆదిలాబాద్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా దాండె విఠ్ఠల్ నామినేషన్ వేశారు. ఆయన పార్టీలో ఎక్కువ మందికి తెలియదు. కాగజ్‌నగర్ పట్టణానికి చెందిన విఠ్ఠల్ మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అమెరికాలో ఉన్నత విద్య చదువుకున్నారు. 2000 సంవత్సరంలో సాఫ్ట్‌వేర్ కంపెనీ ప్రారంభించాడు. మంచి బిజినెస్ మ్యాన్‌గా పేరుంది. ఖమ్మంలో టీఆర్ఎస్ నుంచి తాత మధు నామినేషన్ వేశారు. కాంగ్రెస్ నుంచి రాయల నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు.
వరంగల్ లో టీఆర్ఎస్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి నామినేషన్ వేశారు. అలాగే మరో 11 మంది ఇండిపెండెంట్‌గా నామినేషన్లు వేశారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడవు నేటితో ముగిసిపోతుంది. డిసెంబర్ 10వ తేదిన ఎన్నికలు నిర్వహిస్తారు. అనంతరం ఫలితాలు ప్రకటిస్తారు.
Also Read: వరి ఎఫెక్ట్: ఢిల్లీలో కేసీఆర్ కు షాకుల మీద షాకులు