
AP MLC Elections- TDP And Janasena: కర్ణుడు చావుకు సవాలక్ష కారణాలంటారు.ప్రస్తుతం ఏపీలో వైసీపీ సర్కారుకు ప్రతికూల పవనాలు కూడా చాలా కారణాలున్నాయి. ఏ వర్గ ప్రయోజనానికి పెద్దపీట వేయకపోడం, ప్రభుత్వ బాధితవర్గాలు పెరగడం, పొలిటికల్ పొలరైజేషన్.కావడం, పాలనా వైఫల్యం, అభివృద్ధి లేకపోవడం, సమతూకమైన పాలన సాగించకపోవడం, రాజకీయ వేధింపులు.. ఇలా విశ్లేషించుకుంటే చాలానే ఉన్నాయి. అంతులేని విజయం నుంచి అంతులేని ఓటమి వరకూ కర్త, కర్మ, క్రియ అన్నింటికీ వైసీపీయే కారణం. ఎవరో చెడగొట్టారు అనేదానికంటే తనకు తానుగా చెడగొట్టుకొని ఓటమి అంచున నిలబడడానికి జగన్ చర్యలే ముమ్మాటికీ కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు పొలిటికల్ హీట్ పుట్టించాయి. మార్పునకు సంకేతాలు పంపించాయి. ఉత్తరాంధ్రతో పాటు తూర్పు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానాలు దాదాపు 108 నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్నాయి. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, విద్యావంతుల మూడ్ ను తెలియజెప్పే ఈ ఎన్నికలు దాదాపు వైసీపీకి గట్టి దెబ్బనే చూపాయి. గత ఎన్నికల్లో దాదాపు స్వీప్ చేసిన గ్రేటర్ రాయలసీమలో వైసీపీ దారుణాతి దారుణంగా దెబ్బతింది. సీమ ప్రజలు వైసీపీకి గట్టి హెచ్చరికలే పంపారు. రాయలసీమ మేధావులు, విద్యావంతులు పనిగట్టుకొని మరీ వైసీపీని ఓడించారు. ఉపాధ్యాయ స్థానాల్లో ప్రజల మూడ్ తెలిపేందుకు ప్రమాణికంగా తీసుకోవడం కుదరదు. కానీ పట్టభద్రుల్లో మాత్రం అన్నివర్గాల వారు ఉంటారు. వారి మూడ్ తెలుసుకునేందుకు ఇదో సరైన ప్రమాణికం. కానీ అందులోనే వైసీపీ దెబ్బ తగలడం ఏపీలో ఒకరకమైన మార్పునకు సంకేతం.
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఫలితం కూడా వైసీపీకి ఒకరకమైన కనువిప్పే. ఉత్తరాంధ్ర అభివృద్ధికి విశాఖను రాజధాని చేస్తామన్న వైసీపీ మాటలను ప్రజలు నమ్మలేదు. దాంట్లో హేతుబద్ధత లేదన్న విషయాన్నే పట్టభద్రులు, మేధావులు నమ్మారు. తమ ప్రాంతానికి రాజధాని వస్తుందన్న మాటను కనీసం ఆహ్వానించలేదు. అది చిత్తశుద్ధి అయిన నిర్ణయం కాదని.. రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని మెజార్టీ పట్టభద్రులు గ్రహించారు. అందుకే వైసీపీకి కనివనీ ఎరుగని ఓటమిని కట్టబెట్టారు. వైసీపీ చర్యలను అసహ్యించుకున్నారు. రాజకీయ ప్రత్యర్థి అయిన టీడీపీని ఆదరించారు. అంతులేని మెజార్టీని కట్టబెట్టారు.

అయితే ఈ ఎన్నికల్లో ప్రభావం చూపింది మాత్రం మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాలే. వీరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పనిలేదు. అభివృద్ధి, స్వేచ్ఛగా జీవించడం, మౌలిక వసతుల కల్పన వంటి వాటికే ప్రాధాన్యమిస్తారు. అమ్మఒడి, రైతుభరోసా, వాహనమిత్ర వంటి పథకాలను పట్టించుకోరు. మీటనొక్కుడు, బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ అయ్యిందా? లేదా? అని ఆరాతీసే పని కూడా వీరికి ఉండదు. కానీ గత నాలుగేళ్లుగా వీరు పరిగణలోకి తీసుకుంది రాష్ట్ర అభివృద్ధి. అది లేకపోయేసరికి పనిగట్టుకొని ముందుకొచ్చి మరీ వైసీపీకి వ్యతిరేకంగా ఓటువేశారు. ఒక విధంగా చెప్పాలంటే బహిరంగ శిక్ష విధించారు.
అదే సమయంలో అలజడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటర్లు పోలరైజ్ అయ్యారు. రోజు ఏదో ఒక అలజడి రాష్ట్రాన్ని వెంటాడేది. అర్ధరాత్రి కాకీలకు పనిచెప్పడం, విపక్ష నేతలను అరెస్ట్ చేయడం, ప్రజాసంఘాలపై ఉక్కుపాదం మోపడం, ప్రజాస్వామ్యయుతంగా పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులను కవ్వించడం.. ఇలా ఏదో ఒకదానితో ఏదో ఒక వర్గానికి ఇబ్బందులు పెట్టడాన్ని కూడా ప్రజలు సహించలేకపోయారు. ముఖ్యంగా ప్రశాంత జీవనానికి అలవాటుపడే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. వైసీపీ ప్రభుత్వ విధానాలపై విసిగి వేశారిపోయారు. ఇటువంటి తరుణంలో వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికలను చెంపపెట్టుగా తీసుకున్నారు.

జగన్ సర్కారు ఏ వర్గ ప్రయోజనాలకు పెద్దపీట వేయలేదు. తెలిసిందంతా బటన్ నొక్కుడు. అందులో ఏ వర్గానికి ఎంత ప్రయోజనాలు సమకూరిందో గణాంకాలతో చెప్పుడు.. నాలుగేళ్లుగా ఇదే జరుగుతోంది. గుంతల రహదారులను బాగుచేసేదెప్పుడు అంటే.. గత ప్రభుత్వం పై నెపం పెట్టడం.. పలానా రోజుకు పూర్తిచేస్తామని చెప్పి గడువులు పెట్టడం.. అనక వాటి గురించి మరిపోవడం రివాజుగా మారింది. ఉపాధ్యాయుల, ఉద్యోగులు వేతన బకాయిలు, పీఆర్పీ అమలుచేయాలని కోరితే గొంతునొక్కడం.. మీకు జీతాలే దండగ అన్నట్టు నెలలో మూడో వారం దాటితే కానీ ఇవ్వకపోవడం.. ఏటా జనవరిలో ప్రకటిస్తామన్న జాబ్ కేలండర్ జాడలేకపోవడం…ఇటువంటి కారణాలన్నింటికీ వైసీపీ సర్కారు మూల్యం చెల్లించుకుంది.
పొలిటికల్ పోలరైజేషన్ లో వైసీపీ దోషిగా నిలబడింది. గత ఎన్నికల తరువాత ఎన్నిరకాల ప్రయత్నాలు చేసినా ప్రజలు మాత్రం టీడీపీని నమ్మలేదు. ఎన్నిరకాల ఎన్నికలు వచ్చినా సరైన విజయం దక్కలేదు. ఈ సమయంలో వైసీపీ చర్యలు టీడీపీ నెత్తిన పాలుపోశాయి. ఆ పార్టీపై సానుభూతి పవనాలు వీయడానికి కారణాలయ్యాయి. పవన్ అనే సమ్మోహన అస్త్రం టీడీపీకి వర్కవుట్ అయ్యింది. వైసీపీకి తప్ప ఎవరికైనా ఓటు వెయ్యండన్న పిలుపుతో ప్రజలు ప్రత్యామ్నాయాలను అన్వేషించారు. అందులో టీడీపీయే బెటర్ అన్న భావనకు వచ్చారు. అందుకే ఆ పార్టీ వైపు మొగ్గుచూపారు. నాలుగేళ్ల వైసీపీ పాలనా వైఫల్యాలతో విసిగివేశారిపోయిన ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీ గొడుగు కిందకు చేర్చడంలో జగన్ సర్కారే ఇతోధికంగా సాయమందించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జగన్ సర్కారు తప్పిదాలు ఒక కారణమైతే.. అంతకు మించి పవన్ కళ్యాణ్ పిలుపు కూడా టీడీపీకి ఒక ప్రధాన కారణమని విశ్లేషిస్తున్నారు. ఇదే కంటిన్యూ అయితే మాత్రం వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గడ్డు పరిస్థితులు దాపురించినట్టేనన్న భావన ఏపీలో బలంగా నాటుకుంటోంది.