CM Jagan: జగన్ ను కలిస్తే మీ సీటు గోవిందా?

గత రెండు,మూడు రోజుల నుంచి రోజుకు కనీసం పదిమంది ఎమ్మెల్యేలకు సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి పిలుపు వస్తోంది. దీంతో ఇలా పిలుపు అందుకుంటున్న వారు తెగ ఆందోళన చెందుతున్నారు.

Written By: Dharma, Updated On : August 2, 2023 2:56 pm

CM Jagan

Follow us on

CM Jagan: వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం జగన్ ఎప్పటినుంచో కసరత్తు ప్రారంభించారు. ఎమ్మెల్యేల పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఐప్యాక్ సర్వే తో పాటు.. ప్రభుత్వ నిఘా వర్గాల నుంచి సమాచారం తెచ్చుకుంటున్నారు. వాటిని ప్రాతిపదికగా తీసుకుని ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులను హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పనితీరులో వెనుకబడిన వారిపై వేటు తప్పదని హెచ్చరికలు పంపుతున్నారు. ఇప్పటివరకు మూడు వర్క్ షాపులు నిర్వహించి మరి హితోపదేశం చేశారు. ఇప్పుడు ఎన్నికలు సమీపించడంతో అసలు గుట్టు విప్పేస్తున్నారు.

గత రెండు,మూడు రోజుల నుంచి రోజుకు కనీసం పదిమంది ఎమ్మెల్యేలకు సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి పిలుపు వస్తోంది. దీంతో ఇలా పిలుపు అందుకుంటున్న వారు తెగ ఆందోళన చెందుతున్నారు. ఈ జాబితాలో తాజా, మాజీ మంత్రులు సైతం ఉన్నారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేష్, కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబు, మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్,ఆళ్ళ నాని, పేర్ని నాని, ఎంపీ గోరంట్ల మాధవ్, తోట త్రిమూర్తులు, ఒక అమంచి కృష్ణమోహన్ తదితరులు ఇటీవల సీఎం జగన్ ను కలిశారు. అప్పటినుంచి జగన్ క్యాంప్ ఆఫీసు నుండి కాల్స్ అందుకుంటున్న ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు.

అయితే వీరంతా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వెనుకబడిన జాబితాలో ఉన్నవారే. దీంతో వీరికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు దక్కడం కష్టమే అన్న ప్రచారం జరుగుతోంది. సర్వేలో బాగుంటే టిక్కెట్లు ఇస్తా..లేకుంటే ఎవరికీ ఛాన్స్ ఇవ్వనని ఇప్పటివరకు జగన్ చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఎన్నికలు సమీపించడంతో కుండ బద్దలు కొట్టేస్తున్నారు.

అయితే ఈ లెక్కన బొత్స సత్యనారాయణ వంటి వారికి కూడా టిక్కెట్లు నిరాకరించాలి. అంతటి సాహసం జగన్ చేయగలరా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మంత్రి పదవి మార్పు విషయంలోనే బొత్సకి మినహాయింపు ఇచ్చారు. అటువంటిది టికెట్ ను నిరాకరించగలరా? అన్నది ప్రశ్నర్ధకమే.ఒక్క బొత్స కాదు.. చాలామంది నేతల విషయంలో రాజీ పడక తప్పదు. లేకుంటే ఎన్నికల్లో వారి నుంచి నష్టం తప్పదు. అందుకే జగన్ సైతం ఆచితూచి అడుగులు వేస్తారని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. అయితే సీఎం జగన్ ప్రత్యేకంగా కలిసిన నేతలకు టిక్కెట్లు దక్కవన్న ప్రచారం వైసీపీలో రోజురోజుకీ పెరుగుతోంది.