ములుగు ఎమ్మెల్యే ధనుసరి అనసూయ అలియాస్ సీతక్కను పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వం అన్నదాతల సమస్యలను పట్టించుకోవడం లేదంటూ ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ కిసాన్ విభాగం ప్రగతి భవన్ ముట్టడికి యత్నించింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొని ప్రగతి భవన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
Also Read: అక్రమాలపై గురి.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు షాకిచ్చిన కేటీఆర్?
రైతుల సమస్యలపై ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ టీఆర్ఎస్ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో ప్రభుత్వం రైతు సమస్యలపై చర్చించకపోవడం బాధకరమన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు భారీ నష్టపోయారని ఆమె అన్నారు. ప్రభుత్వం వెంటనే నష్టపోయిన పంటలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. అసెంబ్లీలో రైతు సమస్యలపై సీఎం ప్రస్తావించకపోవడం దారుణమని మండిపడ్డారు.
అనంతరం పోలీసులు ఎమ్మెల్యే సీతక్కతోపాటు ఆందోళనకారులను అరెస్టు చేసేందుకు యత్నించారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలకు.. పోలీసులకు మధ్య కొంతసేపు తోపులాట జరిగింది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపే హక్కు లేదా? అంటూ సీతక్క పోలీసులపై మండిపడ్డారు. కాగా ఎమ్మెల్యే కారుదిగిన సమయంలో ఓ మహిళా పోలీసు తనపై చేయివేయడంతో ఆమెను సీతక్క హెచ్చరించారు. చేయి ఎందుకు వేస్తారంటూ మండిపడ్డారు. ఈ ఆందోళనలో ఎమ్మెల్యే సీతక్కతోపాటు కాంగ్రెస్ కిసాన్ సెల్ నేతలు అన్వేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read: కాంగ్రెస్, టీఆర్ఎస్ దాగుడుమూతలు!
నేటి ప్రగతి భవన్ ముట్టడి రణరంగంగా మారింది. ఇటీవల కాలంలో కాంగ్రెస్ నేతలు ప్రభుత్వంపై పెద్దఎత్తున నిరసన చేస్తున్నారు. నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరిస్తూనే ప్రభుత్వంపై పోరాటాలకు సిద్ధమవుతుండటం గమనార్హం. కాంగ్రెస్ ఈ పరిణామం ఆ పార్టీ నేతల్లో జోష్ నింపుతున్నట్లు కన్పిస్తోంది.