MLA Roja: అతిగా ఆశపడటం కూడా కొన్ని సార్లు బాధపెడుతుంది. ఇప్పుడు ఈ సామెత ఎందుకంటారా.. మరేం లేదండి వైసీపీ ఫైర్ బ్రాండ్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చే మహిళా లీడర్.. ఇప్పుడు తెగ బాధపడిపోతున్నారంట. ఇంతకీ ఆమె ఎవరో మీకు గుర్తుకొచ్చే ఉంటుంది. ఆమెనే నగరి ఎమ్మెల్యే రోజా. వాస్తవానికి సీఎం మొదటిసారి కేబినెట్ లోనే ఆమెకు ఛాన్స్ ఇస్తారని అంతా అనుకున్నారు. ఆమె అయితే తన అనుచరులతో పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేయించుకుంది. కానీ చివరకు సీన్ రివర్స్ అయింది.

దీంతో ఆమె అలక బూనింది. జగన్ కొంతమంది పార్టీ పెద్దలతో ఆమెను బుజ్జిగించి ఏఐసీసీ చైర్మన్ పదవి ఇచ్చి సంతృప్తిచెందేలా చేశారు. కానీ ఆమెకు ఆ పదవితో పూర్తి సంతృప్తి కలగలేదు. అందుకే దాన్ని ఆమె పెద్ద పదవిగా భావించలేదు. అందుకేనేమో ఆ పదవిలో కూడా ఎక్కువ కాలం ఇమడలేకపోయింది. అయితే తన అంతిమ లక్ష్యం అయిన మంత్రి పదవి రాకపోతుందా అని ఆశగా ఎదరు చూసింది.
ఇప్పుడు మంత్రుల మార్పు ప్రకటించగానే ఆమెలో మళ్లీ ఆశలు చెలరేగాయి. మొదటి దఫాలోనే ఉన్న ఫైర్ బ్రాండ్ నేతలు అందరూ అయిపోయారు కాబట్టి.. రెండోసారి కచ్చితంగా తనకు పదవి దక్కుతుందని బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. ఇక మీడియా కూడా ఆమెకే పదవి ఖాయం అంటూ వార్తలు ప్రచురించడంతో ఎగిరి గంతేసింది.
కానీ వాస్తవ పరిస్థితులు చూస్తుంటే మాత్రం తేడా కొట్టినట్టు సమాచారం. ఎందుకంటే జగన్ రెండోసారి మంత్రి పదవుల మార్పులో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఈసారి ఎక్కువగ బీసీ, ఎస్సీ, ఎస్టీ వారికి పెద్ద పీట వేస్తున్నారంట. సొంత రెడ్డి సామాజిక వర్గానికి ఈ సారి మంత్రి పదవుల్లో కోత తప్పదని తేల్చి చెప్పారంట.

దీంతో రోజా పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలైపోయాయి. దీంతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆమెతో చర్చలు జరుపుతున్నారు. మంత్రి పదవి కాకుండా మరో పదవి ఇచ్చి బుజ్జగించే ప్రయత్నం చేయాలని జగన్ సూచించారంట. మరి ఆమె రెండోసారి కూడా నిరాశను తట్టుకుంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
రెండోసారి కూడా తన అనుచరుల దగ్గర చిన్నబోవడంతో ఆమె తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు సమాచారం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎదురుతిరగడం మంచిది కాదని.. మరోసారి ఛాన్స్ కోసం వెయిట్ చేయాలని ఆమె సన్నిహితులు చెప్పడంతో సైలెంట్ అయిపోయింది. మరి ఆమెకు ఎలాంటి పదవి ఇస్తారో వేచి చూడాలి.