
Raghunandan Rao- KTR: తెలంగాణ అసెంబ్లీలో అన్నీ తానై వ్యవహరిస్తున్న ముఖ్యమైన మంత్రి కేటీఆర్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. విదేశాల్లో చదువుకున్నాడు.. విజ్ఞత తెలిసినవాడు అనుకున్న ప్రతిపక్ష నేతలను తండ్రి కేసీఆర్ కంటే చులకనగా చూడడం ద్వారా తన వారసత్వాన్ని నిరూపించుకున్నాడు. అసెంబ్లీ వేదికగా విపక్షాల గొంతు నొక్కడం.. స్పీక్ మైక్ ఇచ్చినా గంటలు గంటలు వారికి ఎలా ఇస్తారని సభాపతినే ప్రశ్నించడం.. ఇక బీజేపీ, కాంగ్రెస్ నేతలను పేరుపెట్టి మరీ విమర్శిచడం.. వారికి సమాధానం చెప్పే అవకాశం ఇవ్వకుండా చేయడం ద్వారా తాను కేసీఆర్ సుపుత్రుడనే అని నిరూపించుకున్నారు. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై వ్యంగాస్త్రాలు సంధించిన కేటీఆర్.. వాటి గురించి మాట్లాడేందుకు మాత్రం మైక్ ఇవ్వలేదు. కేటీఆర్ కంటే తెలివిగా, విజ్ఞతగా, అసభ్య పదజాలం లేకుండా కౌంటర్ ఇవ్వడంలో రఘునందన్ దిట్ట. ఆ విషయం ముఖ్యమైన మంత్రికి బాగా తెలుసు. అందుకే తాను ఏకపాత్రాభినయం చేసి, రఘునందన్‌కు మైక్ ఇవ్వకుండా చేసి అసెంబ్లీలో తానే గెలిచాననిపించుకున్నారు. కానీ, మీడియా సాక్షిగా కేటీఆర్ గువ్వ గుయ్‌మనే కౌంటర్ ఇచ్చాడు రఘునందర్.
నాడు కేటీఆర్ ఎక్కడున్నాడు గుర్తుచేస్తూ..
తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో నాడు టీఆర్‌ఎస్‌లో ఉన్న రఘునందర్ కొట్లాడిన తీరును మీడియా ముఖంగా కేటీఆర్‌కు గుర్తు చేశారు. తాము జై తెలంగాణ అన్న రోజు.. భార్యా పిల్లలను వదిలి రోడ్లపైకి వచ్చిన రోజు.. కేటీఆర్ అమెరికాలే లక్షల రూపాయల జీతం తీసుకుంటూ ఉద్యమాన్ని చూసి ముసిముసి నవ్వులు నవ్వాడని ఎద్దేవా చేశాడు. తాను ఉద్యమకారుడినని, నీలాగా తండ్రిపేరు, చెల్లి పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి రాలేదని సూటిగా సమాధానం చెప్పారు. తమ రాజకీయం కేటీఆర్‌లా వడ్డించిన విస్తరి కాదని స్పష్టం చేశాడు.
యస్.. వాకీల్‌సాబ్‌నే..
అసెంబ్లీలో వకీల్‌సాబ్ కేంద్రం తరఫున వకాలత్ పుచ్చుకున్నారంటూ వ్యంగ్యంగా మాట్లాడిన కేటీఆర్‌కు అంతేస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. రఘునందన్. తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీసులు కేసులు పెడుతుంటే నల్లకోట్ వేసుకుని కులం, మతం, పార్టీ అనే తేడా చూపకుండా సాటి ఉద్యకారుడిగా వందల మందని జైళ్ల నుంచి బయటకు తెచ్చానని తెలిపాడు. తాను నల్లకోట్ వేసుకుంటేనే నేడు టీఆర్‌ఎస్‌లో ఉన్న చాలామంది కేసుల బయటపడ్డారని గుర్తుచేశాడు. తన వృత్తిపట్ల తనకు ఎంతో గౌరవం ఉందన్నారు.
వసుదైక కుటుంబంలో వాళ్లకు చోటు లేదా..
తమది కుటుంబ పార్టీ అని, తెలంగాణ ప్రజలంతా తమ కుటుంబమే అని, తెలంగాణ ఒక వసుదైక కుటుంబం అని అసెంబ్లీ వేదికగా గొప్పగా వర్ణించిన కేటీఆర్ మాటలపై రఘునందన్ ఉద్వేగంగా ప్రశ్నించారు. వసుదైక కుటుంబంలో తెలంగాణ ఉద్యమకారులు ఎందుకే లేరని నిలదీశారు. నాడు మీ అధికార పత్రిక నమస్తే తెలంగాణలో రాసిన 1200 మంది తెలంగాణ అమర వీరుల కుటుంబాలు ఇప్పుడు ఎలా ఉన్నాయో ఒక్కసారైనా చూశారా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో నీ బావ ఒంటిపై పెట్రోల్ పోసుకుని అగ్గిపెట్టె లేదని యాక్షన్ చేశాడని, కానీ నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు శ్రీకాంతాచారి ఒంటికి నిప్పంటించుకుని తెలంగాణ కోసం ఆత్మాహుతి చేసుకున్నాడని తెలిపారు. కానీ నేడు శ్రీకాంతాచారి తల్లి వసుదైక కుటుంబంలో ఎందుకు సభ్యురాలు కాలేదని నిలదీశాడు. పోలీస్ కిష్టయ్య కుటుంబం, డీఎసీ పదవిని గడ్డిపోచలా వదిలేసిన నళిని ఎందుకు మీ కుటుంబ సభ్యులు కాదని ప్రశ్నించారు. మీ కుటుంబ సభ్యులైతే సంతోష్‌రావు స్థానంలో శ్రీకాంతాచారి తల్లి రాజ్యసభలో ఉండేదని, నళిని ఎమ్మెల్సీగా శాసన మండలిలో ఉండేదన్నారు. వసుదైక కుటుంబంలో 1200 మంది అమర వీరుల కుటుంబాల్లో ఎంతమందికి ఆర్థికసాయం ఇచ్చారని నిలదీశారు.

అసెంబ్లీలో మైక్ ఇస్తే…
కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత నిజమైన నాయకుడిగా రఘునందన్‌కు మైక్ ఇచ్చి ఉండాల్సింది. కానీ, ఇవన్నీ అసెంబ్లీ వేదికగా అడిగితే రికార్డుల్లో నమోదైతే.. తన పరువు పోతుందని భావించిన కేటీఆర్.. మైక్ ఇవ్వకుండా తాను పైచేయి సాధించానని గర్వంగా ఫీల్ అయ్యాడు. కానీ మీడియా సాక్షిగా రఘునందన్ వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం కేటీఆర్‌కు ఉందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.