
తెలంగాణలో ప్రకటిస్తున్న కరోనా లెక్కల విషయంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఆది, సోమ వారాల్లో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించిన కరోనా లెక్కల్లో తప్పులు దొర్లుతున్నాయి. తెలంగాణలో ఆదివారం,సోమవారం విడుదలైన హెల్త్ బులెటిన్లను పరిశీలిస్తే పూర్తిగా తప్పుడు లెక్కలు ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఆదివారం నాటికి తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 1001. సోమవారం 2 కేసులు మాత్రమే నమోదయ్యాయని హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు. అంటే 1003. ఈ 2 కేసులు కూడా హైదరాబాద్ లో అని తెలిపారు. దీని ప్రకారం హైదరాబాద్ జిల్లాలో రెండు కేసులు పెరగాలి. మిగతా జిల్లాల లెక్కలన్నీ యధావిధిగా ఉండాలి. కానీ అలా లేవు.
హైదరాబాద్ తో పాటు మేడ్చల్, రంగారెడ్డి, నల్గొండ కేసులలో తేడాలు ఉన్నాయి. ఆదివారం నాటికి హైదరాబాద్ లో కరోనా కేసులు 540. సోమవారం రెండు పెరిగితే దాని సంఖ్య 542కు చేరాలి. కానీ సోమవారం ప్రకటించిన లెక్కలల్లో 556గా తెలిపారు. అంటే 16 పెరిగినట్టు. ప్రభుత్వం మాత్రం 2 పెరిగాయని తెలిపింది. ఇక ఆదివారం మేడ్చల్‌లో 22 కేసులు చూపించగా సోమవారం 12 మాత్రమే చూపించారు. రంగారెడ్డిలో ఆదివారం 33 చూపించగా సోమవారం 31 చూపించారు. నల్గొండలో ఆదివారం 17 కేసులుండగా సోమవారం 15 ఉన్నాయి. ఎవరైనా డిశ్చార్జ్ అయితే డిశ్చార్జ్ అయిన సంఖ్య పెరగాలి, యాక్టివ్ కేసులు తగ్గాలి. కానీ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గకూడదు. తెలంగాణ సర్కార్ విడుదల చేస్తున్న లెక్కల పై విమర్శలు వస్తున్నాయి. సర్కార్ కేసుల సంఖ్య పెరుగుతున్నా తప్పుడు లెక్కలు విడుదల చేస్తుందని ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు. ఆది,సోమవారాలు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్లు పరిశీలిస్తే చాలా స్పష్టంగా తప్పులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా సరైన వివరాలు వెల్లడించాలని పలువురు కోరుతున్నారు.