BJP: తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నామంగా బీజేపీ అవతరించింది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ను వెనక్కినెట్టి బీజేపీ ఆ స్థానాన్ని ఎప్పుడో కైవసం చేసుకుంది. ఇక టీఆర్ఎస్ ను గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇటీవల జరిగిన వరుస ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గట్టి షాకులిస్తున్న బీజేపీ మిషన్-2023 దిశగా అడుగులు వేస్తూ పార్టీని తెలంగాణలో మరింత విస్తరించే ప్రయత్నం చేస్తోంది.
ఇందులో భాగంగానే రాష్ట్రంలోని ఉద్యమ నేతలు, తమతో కలిసి వచ్చే నేతలకు బీజేపీ కాషాయ కండువాలను కప్పుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ కు చెందిన పలువురు కీలక నేతలు బీజేపీలో చేరిపోయారు. సినీ నటి విజయశాంతి, మాజీ మంత్రి డీకే అరుణ లాంటి కీలక నేతలు బీజేపీలో చేరి పార్టీ బలోపేతానికి తమవంతు కృషి చేస్తున్నారు.
ఇటీవల టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ బీజేపీ బలోపేతానికి తనవంతు సహకారం అందిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ జిల్లావాసే కావడంతో వీరివురు పార్టీని అక్కడ మరింత బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. హుజూరాబాద్లో టీఆర్ఎస్ షాకిచ్చిన ఈటల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ సత్తాచాటేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
ఇదే సమయంలో టీఆర్ఎస్ కు దూరంగా ఉన్న ఉద్యమకారులను ఏకం చేసే పనిలో బీజేపీ పడింది. ఉద్యమ సమయంలో కీలక పని చేసిన ఉద్యోగ సంఘాల నేతలను పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాన్ని బీజేపీ నేతలు చేస్తున్నారు. గతంలో టీఆర్ఎస్ లో కీలకంగా పని చేసిన టీఎన్జీవో అధ్యక్షుడు స్వామిగౌడ్ ఏడాది క్రితమే బీజేపీలో చేరారు. తాజాగా మరో ఉద్యోగ సంఘం నేత విఠల్ సైతం బీజేపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు.
ఉద్యమ సమయంలో కీలకంగా స్వామిగౌడ్, విఠల్, శ్రీనివాస్ గౌడ్ లు రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ చేరారు. అయితే వీరిలో స్వామిగౌడ్ ఇప్పటికే బీజేపీలో చేరగా విఠల్ నేడు ఢిల్లీలో బీజేపీ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధమైంది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో విఠల్ టీఎస్పీఎస్సీ కమిషన్ సభ్యుడిగా ఉన్నారు. కొద్దినెలల క్రితమే ఆయన పదవీ కాలం ముగిసింది.
విఠల్ ఉద్యమ సమయంలో జేఏసీ ప్రధాన కార్యదర్శి, కో చైర్మన్ గా కీలక పాత్ర పోషించారు. ఆయనకు ఉద్యమకారులు, ఉద్యోగ సంఘాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో బీజేపీ కీలక నేతలు రంగంలోకి ఆయన్ని బీజేపీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. విఠల్ సైతం బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపడంతో అధిష్టానం అతడి చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు నిన్ననే ఢిల్లీ వెళ్లిన విఠల్ ఈరోజు కషాయ కండువా కప్పుకోవడం ఖాయంగా కన్పిస్తుంది.
Also Read: బీజేపీలోకి తీన్మార్ మల్లన్న! ఇక కేసీఆర్‌కు దబిడిదిబిడే!!
అలాగే రేపు తీన్మార్ మల్లన్న సైతం బీజేపీలో చేరనున్నారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రావుకు గట్టి పోటీ ఇచ్చారు. వృత్తిరీత్య జర్నలిస్టు అయిన తీన్మార్ మల్లన్నకు రాష్ట్ర వ్యాప్తంగా ఓ ప్రత్యేక టీమ్ ఉంది. దీంతో ఆయన చేరిక కూడా బీజేపీకి కలి రానుంది.
మొత్తంగా బీజేపీ 2023 ఎన్నికలే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు దూసుకెళుతుండటంతో పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ స్పీడు చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో అధికారం చేపట్టడం ఖాయమనే టాక్ విన్పిస్తోంది.
Also Read: ఉద్యోగుల సంఘం నేత విఠల్ చేరికతో బీజేపీకి కొత్త ఊపు వచ్చేనా?