https://oktelugu.com/

AP New Cabinet: వైసీపీలో తప్పిన క్రమశిక్షణ.. సీఎం జగన్ లో కలవరం

AP New Cabinet: వైసీపీలో క్రమశిక్షణ కట్టు తప్పుతుందా? సీఎం జగన్ ను కంటిమీద కునుకు లేకుండా చేస్తుందా? అనవసరంగా మంత్రివర్గ విస్తరణ పేరిట తేనె తుట్టను కదిలించానని అనుకుంటున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇన్నాళ్లు నోరుమెదపని నాయకులకు, అసమ్మతి మాటే అన్నది ఎరుగని ఆయన మంత్రి పదవులు దక్కలేదన్న అలకలు, అసంత్రుప్తులు, నేతల వ్యవహార శైలి చూసి నివ్వెరపోతున్నట్టు తెలుస్తోంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సెగ ఆయనకు గట్టిగా తాకినట్లు కనిపిస్తోంది. పదవులు రానివారి అలకలు, […]

Written By:
  • Admin
  • , Updated On : April 12, 2022 / 08:12 AM IST
    Follow us on

    AP New Cabinet: వైసీపీలో క్రమశిక్షణ కట్టు తప్పుతుందా? సీఎం జగన్ ను కంటిమీద కునుకు లేకుండా చేస్తుందా? అనవసరంగా మంత్రివర్గ విస్తరణ పేరిట తేనె తుట్టను కదిలించానని అనుకుంటున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇన్నాళ్లు నోరుమెదపని నాయకులకు, అసమ్మతి మాటే అన్నది ఎరుగని ఆయన మంత్రి పదవులు దక్కలేదన్న అలకలు, అసంత్రుప్తులు, నేతల వ్యవహార శైలి చూసి నివ్వెరపోతున్నట్టు తెలుస్తోంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సెగ ఆయనకు గట్టిగా తాకినట్లు కనిపిస్తోంది. పదవులు రానివారి అలకలు, విమర్శలు.. అనుచరుల ఆందోళనలు, రాజీనామాలపై సీఎం అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. నాయకత్వాన్ని ధిక్కరించేంతగా అసమ్మతి రేగుతుందని ఆయన ఊహించనేలేదు. విధేయులుగా ఉన్నవారే తిరగబడడం విస్మయం కలిగిస్తోంది.

    YCP

    ముఖ్యంగా తన సొంత కుటుంబానికి చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డ్డి రాజీనామా హెచ్చరిక చేయడం జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రాయబారాలు ఫలించకపోవడంతో నేరు గా జగనే రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. బాలినేని చివరకు మెత్తబడినా.. ఈ వ్యవహారంతో పార్టీ ప్రతిష్ఠ దెబ్బతిన్నదని వైసీపీ వర్గాలే అంటున్నాయి. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యే మేకతోటి సుచరితకు హోంమంత్రి పదవి ఇచ్చామని ముఖ్యమంత్రి పదేపదే చెప్పుకొనేవారు. ఈ దఫా కూడా ఎస్సీ ఎమ్మెల్యే తానేటి వనితకు ఆ పదవి కట్టబెట్టినా.. తనను అత్యంత అవమానకరమైన రీతిలో పదవి నుంచి తొలగించారని సుచరిత ఆవేదన వ్యక్తంచేయడం, ఏకంగా శాసనసభ్యత్వానికే రాజీనామా చేయడం పార్టీలో చర్చనీయాంశమైంది. పైగా స్పీకర్‌ ఫార్మాట్‌లో తన రాజీనామా లేఖను ఆమె ఎంపీ మోపిదేవి ద్వారా సీఎంకు పంపారు.

    Also Read: Minister Roja: రోజా సహా కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా చేసిన నటీనటులు వీరే..

    అన్యమనస్కంగా అధినేత
    ఒక వైపు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరుగుతుండగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఒక విధంగా చెప్పాలంటే అనూహ్య ఘటనల నడుమే మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఇది జరుగుతున్నంత సేపూ జగన్‌ అన్యమనస్కంగానే ఉన్నారు. ముఖంలో చిరునవ్వు కనిపించలేదు. ఇంటి మనిషి బాలినేనిపై పెట్టిన శ్రద్ధ ఇతర అసంతృప్త నేతలపై ఆయన పెట్టలేదు. సామినేని ఉదయభాను, మేకతోటి సుచరిత, కొలుసు పార్థసారథిలను బుజ్జగించే బాధ్యతను ఆయన రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావుకు అప్పగించారు. ఆయన ప్రయత్నాలు ఫలించకపోవడం జగన్‌ను అసహనానికి గురిచేసిందని అంటున్నారు.

    CM Jagan

    అన్నిటికీ మించి తొలిసారి జగన్ ను లక్ష్యంగా చేసుకుని ఎమ్మెల్యేలు బాహాటంగా మాట్లాడే స్థాయికి చేరుకోవడంతో.. పరిస్థితి అదుపు తప్పిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతర్గతంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి ఒక్కసారిగా జ్వాలగా ఎగసిపడడంతో.. సీఎం స్వయంగా జోక్యం చేసుకున్నారు. మంత్రి పదవి ఖాయమనుకున్న కోన రఘుపతికి.. ఉన్న డిప్యూటీ స్పీకర్‌ పదవి కూడా తీసేసిన సంగతి తెలిసిందే. జగన్‌ నేరుగా ఆయనతో మాట్లాడారు. పదవిని ఎందుకు తీసేయాల్సి వచ్చిందో వివరించారు. పార్టీ కోసం పనిచేయాలని కోరడంతో రఘుపతి శాంతించినట్లు తెలిసింది.అసంతుష్టులైన సీనియర్‌ నేతలందరితోనూ మాట్లాడాలని.. రోజూ కొంతమందిని ఫోన్లో పలుకరించాలన్న యోచనలో సీఎం ఉన్నారని సీఎంవో వర్గాలు తెలిపాయి.

    తాజా మాజీలు డల్
    అటు తాజా మాజీల్లో సైతం ఓకింత అసహనం, అసంత్రుప్తి కనిపించింది. ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన తాజా మాజీ మంత్రులు పేర్ని నాని, ధర్మాన కృష్ణదాస్‌, ఆళ్ల నాని, కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావు, శంకరనారాయణ, కురసాల కన్నబాబులు డల్ గా కనిపించారు. అంటీముట్టనట్టుగా వ్యవహరించారు. కొత్తగా ఎంపికైన మంత్రులు కుటుంబాలతో రాగా.. తాజా మాజీలు మాత్రం ఏదో పొడిపొడిగా కనిపించి వెళ్లిపోయారు.

    Perni Nani

    అసలు మేము చేసిన తప్పేమిటని.. అసమర్థలమన్నముద్ర వేసి పక్కన పడేశారని వారు అనుచరుల వద్ద తెగ బాధపడుతున్నారు. సుచరిత, బాలినేని శ్రీనివాసరెడ్డి, శ్రీరంగనాథరాజు, పి.అనిల్‌కుమార్‌ గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యేల హాజరు కూడా బాగా తక్కువగా ఉండడం.. కొత్త మంత్రుల అనుచరుల సందడి పెద్దగా లేకపోవడంతో.. కార్యక్రమం చప్పగా సాగింది. మంత్రివర్గ విస్తరణ పుణ్యమా అని అంతర్గతంగా ఉన్న విభేదాలను జగన్ కోరి కెలికి బయటకు తెచ్చినట్టయ్యింది.

    Also Read:AP New Cabinet: ఏపీ మంత్రుల రాజకీయ ప్రస్థానమిలా..

    Tags