YCP Ministers : :మొన్నటివరకూ ఏపీకి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉండేది. ప్రపంచంలో మారుమూల ప్రాంతానికి వెళ్లినా గుర్తించేటంతగా ప్రత్యేకత సొంతం చేసుకున్న తెలుగు రాష్ట్రం ఇప్పుడు పలుచన అవుతోంది. పాలకుల తీరతో నవ్వులపాలవుతోంది. వైసీపీ ప్రభుత్వ వ్యవహార శైలి, మంత్రులు ప్రదర్శిస్తున్న తెలివితేటలు రాష్ట్ర చరిత్రను మసకబారుస్తున్నాయి. ఇమేజ్ ను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నట్టు అనుమానాలున్నాయి. కట్టడి చేయాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. కదా అతిగా వ్యవహరిస్తోంది. అన్నివిధాలుగా పాలనను అపహాస్యం చేస్తూ ఏపీని చులకన చేస్తున్నారు. దేశంలో ఏపీ అంటేనే అసహ్యించుకునేలా ప్రవర్తిస్తున్నారు.
ఆ మధ్యన దావోస్ వాణిజ్య సదస్సుకు ఎందుకు వెళ్లలేదంటే.. ఐటీ మంత్రి అమర్నాథ్ ఒక వింతైన సమాధానం చెప్పారు. అక్కడ విపరీతంగా చలి ఉంటుంది. అక్కడికి వచ్చే పారిశ్రామికవేత్తలు స్నానం చేయరు. అందుకు వెళ్లలేదంటూ చాలా తెలివిగా సమాధానమిచ్చారు. మనం ఎందుకు దావోస్ వెళ్లడం? మన దగ్గరకే దావోస్ వస్తుందని తుంటరి జవాబిచ్చారు. ఏపీ పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకునేలా మంత్రి వ్యాఖ్యానాలు సాగాయి. ఇటువంటి మాటలతో పారిశ్రామిక ప్రపంచం ఏపీని గౌరవిస్తుందా? అన్న అనుమానం ప్రతిఒక్కరికీ కలుగక మానదు. అయితే మేం చేసేదే చట్టం.. మేం అన్నదే మాట అని తాము పట్టిన కుందేలు.. వంద కాళ్లు అన్నరీతిలో పాలకులు వ్యవహరిస్తుంటే రాష్ట్రానికి ఇదేం ఖర్మ అని నిట్టూర్చడమే కానీ ఎవరూ ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితి మనది.
అప్పు.. ఈ మాట అంటే ప్రతిఒక్కరికీ భయం. కానీ ఏపీ ప్రభుత్వానికి అప్పు అనేది ఒక వరం. చివరకు తాను వద్దంటుకున్న అమరావతి రాజధానిపై అప్పు తెచ్చిన గడసరి నేర్పరి జగన్ సర్కారు. అమరావతి గొంతు నొక్కడమే కాదు..దాని పేరిట అప్పులు తెచ్చి జాతీయ సమాజంలో మరింత నవ్వులపాలుచేయడం దేనికి సంకేతం. అమరావతిని అభివృద్ధి చేస్తానని చెప్పిన జగన్ సర్కారు రూ.3 వేల కోట్లు అప్పు తీసుకుంది. ఆ అప్పు కట్టకపోగా.. వడ్డీ సైతం చెల్లించడం లేదు. బ్యాంకర్లు అడుగుతుంటే ముఖం చాటేస్తున్నారు. రేపోమాపో బ్యాంకులు సీఆర్డీఏను దివాళాగా ప్రకటించవచ్చు. జగన్ సర్కారుకు కూడా కావాల్సింది అదే. అమరావతి రాజధాని పేరిట చేసిన అప్పులు మళ్లించి ఎంచక్కా హాయిగా ఉన్న జగన్ సర్కారు చర్యలు ఇప్పుడు వారికి ఇంపుగా ఉండొచ్చు కానీ.. అవగాహన ఉన్న వారికి కంపే..
విశాఖలో అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సును కనివినీ ఎరుగని రీతిలో చేస్తామని ప్రకటించారు. ఇందుకు రూ.50 కోట్లు కేటాయించారు. ప్రపంచ నలుమూలల నుంచి పారిశ్రామిక వేత్తలు, దిగ్గజ కంపెనీలు వస్తాయని నమ్మించారు. ఇప్పుడు తీరుబాటుగా దేశీయ పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానాలు పలుకుతున్నారు. ఐటీ మంత్రి , ఒక ఐఏఎస్ అధికారిని వెంటబెట్టుకొని పెళ్లి శుభలేఖలు ఇస్తున్నట్టుగా సదస్సుకు పిలుపులందిస్తున్నారు. ఈ వీడియోలు చూసిన వారికి ఇట్టే మైండ్ బ్లాక్ అవుతోంది. ఏ మాత్రం ఫ్రొఫెషనిజం చూపకుండా డ్రెస్ సెన్స్ లేకుండా పారిశ్రామికవేత్తలను డీల్ చేసిన తీరు మాత్రం జుగుప్సాకరంగా ఉంది. అంత పెద్ద పారిశ్రామికవేత్తలను ఆహ్వానించే సమయంలో చెప్పులేసుకొని వెళతారా? కనీసం షూ వేసుకొని వెళ్లరా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కార్పొరేట్ రంగంలో చిన్న ఉద్యోగానికి ఎటువంటి ప్రమాణాలు ఉంటాయో తెలియంది కాదు. కానీ పనితనం రాదు.. పని చేతకాదు అన్నట్టు వ్యవహరించి ఏపీ పరువును తీస్తున్నారు. అయితే ఇక్కడ పరువు పోతోంది ఏపీది కానీ.. సీఎం జగన్.. మంత్రులది కాదు. అందుకే కాబోలు వారు ఇలా వ్యవహరిస్తున్నారు.