Minister RK Roja: ఆర్ కే రోజా.. పరిచయం అక్కర్లేని పేరు. వెండితెర, బుల్లితెరపై వెలుగు వెలిగిన నటి. రాజకీయ యవనికపై ఫైర్ బ్రాండ్. విపక్షాలపై మాటల తూటాలు, హవభావాలతో విరుకుపడగల నేర్పరి. తెలుగుదేశం పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసి సుదీర్ఘ కాలం పనిచేశారు. అటు తరువాత జగన్ గూటికి చేరారు. 2014 ఎన్నికల్లో నగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో ఎమ్మెల్యేగానే మిగిలిపోయారు. కానీ తన దూకుడు తగ్గించలేదు. అప్పట్లో అధికార పక్షంపై వీరలెవల్లో విరుచుకుపడేవారు. పార్టీ అధినేతపై ఈగ వాలనిచ్చేవారు కాదు. అప్పట్లో అసెంబ్లీలో అధికార పార్టీతో కలబడ్డారు. అసెంబ్లీ సమావేశాల్లో శాశ్వత వేటుకు దూరమయ్యారు.
అయినా తన మాటల దాడిని తగ్గించలేదు. అదే మాట అదే బాట అన్నట్టు సాగింది రోజా శైలి. 2019 ఎన్నికల్లో మరోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలుపొందారు. ఐరన్ లెగ్ అన్న అపవాదు నుంచి బయటపడ్డారు. వైసీపీ అఖండ విజయంతో మురిసిపోయారు. మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కుతుందని ఆశించారు. కానీ తొలి కేబినెట్ లో బెర్తు దొరకలేదు. అదే సమయంలో సొంత పార్టీలో సైతం అసమ్మతిని ఎదుర్కొన్నారు. అప్పటి నుంచి సైలెంట్ అయిపోయారు. మూడేళ్లుగా దూకుడు తగ్గించారు. అటు విపక్షం, ఇటు స్వపక్షంలో విపక్షం సైతం రోజా పని అయిపోయిందని తెగ ప్రచారం చేశారు. అటు రోజా కూడా నిర్వేదంలోకి వెళ్లిపోయారు. తాజా మంత్రివర్గ విస్తరణలో జగన్ తీసుకోవడంతో ఫైర్ బ్రాండ్ ఈజ్ బ్యాక్ అని వైసీపీ శ్రేణుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
Also Read: Prashant kishor- YCP: పీకే సేవలు వైసీపీకి అక్కర్లేదా? ఈ వ్యూహం వెనుక మర్మమేమిటి?
దీటైన కౌంటర్లు
మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కొద్దిరోజులకే రోజా దూకుడు పెంచారు. ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు. నేతల కామెంట్లకు.. కౌంటర్లు ఇస్తున్నారు. అధినేత ఊహించి ఇచ్చిన టాస్కును పూర్తిచేస్తున్నారు. గతంలో ప్రభుత్వంపైన కానీ.. అధినేత జగన్ పైన కానీ చిన్నపాటి కామెంట్ చేసినా కొడాలి నాని, పేర్ని నాని ద్వయం తెగ రెచ్చిపోయేది. అనిల్ కుమార్ యాదవ్ అయితే రంకెలు వేసేవారు. వారందర్నీ తప్పించి నమ్మకంతో తనకు పదవి కట్టబెట్టి మరీ చెప్పడంతో ఇప్పుడు రోజా పదును పెంచుతున్నారు. నోటీకి పని చెబుతున్నారు. తిరుపతి రుయా అస్పత్రి ఘటనపై విపక్షాలన్నీ ఎదురుదాడికి దిగుతుండడంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది.
దీనిపై రోజా దీటుగా స్పందించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కాల్ మనీ సెక్స్ రాకెట్ ద్వారా ఎంతమంది మహిళలను ఏ రకంగా వేధించారో తెలుసునని చంద్రబాబు, లోకేష్ ను ఇరుకున పెట్టేలా కామెంట్స్ చేశారు. ఎక్కడ చిన్నపాటి తప్పిదాలు బయటపడినా అక్కడకు తండ్రీ కొడుకులు వెళ్లి రాజకీయాలు చేస్తున్నారని.. మీ మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని కౌంటర్ ఇచ్చారు. అంతటితో ఆగకుండా ప్రభుత్వ తరుపున తీసుకున్న చర్యలు గురించి కూడా మీడియాకు వివరించారు. రుయాసంఘటన దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. డెడ్ బాడీకి ఇవ్వాల్సిన మహాప్రస్థానం వాహనం ఇవ్వలేదని తెలిసిందని.. ఇది సూపరింటెండెంట్, సీఎస్‌ఆర్‌ఎంవో బాధ్యత అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వెంటనే జిల్లా అధికారులను పంపించి నివేదిక ఇవ్వమని చెప్పినట్లు మంత్రి రోజా తెలిపారు. ఈ ఘటనలో సీఎస్‌ఆర్‌ఎంవోను సస్పెండ్ చేశామని.. ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు షోకాజ్ నోటీసు ఇచ్చామని పేర్కొన్నారు.ఒక పనికి మాలిన వాడు చేసిన పనికి ప్రభుత్వాన్ని తప్పుపట్టడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించడం ద్వారా తన దూకుడుతో పాటు పరిణితిని పెంచుకున్నారు రోజా.
ఆ ప్రస్టేషన్ వెనుక..
అయితే మంత్రి రోజా ప్రస్టేషన్ వెనుక సొంత పార్టీలో అసమ్మతి కూడా ఒక కారణంగా తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో అత్తెసరు మెజార్టీతో రోజా దివంగత గాలి ముద్దు క్రిష్ణంనాయుడుపై గెలుపొందారు. అప్పట్లోనే తనను సొంత పార్టీ వారు వెన్నుపోటు పొడిచారని రోజా తెగ బాధపడిపోయారు. 2019 ఎన్నికల్లో జగన్ మేనియాతో గెలుపొందిన రోజాకు అక్కడి స్థానిక నేతలతో విభేదాలు కొనసాగాయి. ఎంతలా అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం సొంత పార్టీ వ్యతిరేకులు రోజాతో విభేదించి పనిచేసేదాక వెళ్లారు. దీని వెనుక అదే జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఉన్నారన్న టాక్ నడిచింది. ఇదే విషయమై చాలాసార్లు రోజా హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. అధినేత ముందు కన్నీటి పర్యంతమయ్యారు. కానీ ఎటువంటి ఫలితం లేకపోయింది. చివరకు వచ్చే ఎన్నికల్లో అసలు రోజాకు వైసీపీ టిక్కెట్ దక్కదని వ్యతిరేక వర్గం ప్రచారం చేసింది. దీంతో రాజకీయాలంటే రోజాకు ఆసక్తి తగ్గింది. అందుకే నియోజకవర్గానికి దూరంగా.. బుల్లితెర ప్రొగ్రాంలు, ఈవెంట్లపై ద్రుష్టిపెట్టారు. దాదాపు రాజకీయాలకు దూరమవుతారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా మంత్రి పదవి దక్కడంతో మళ్లీ యాక్టివ్ అయ్యారు. విపక్షాలతో పాటు తన వ్యతిరేక వర్గంపై దూకుడు పెంచారు.
Also Read:Pawan Kalyan: ఏపీ వైద్య దుస్థితిపై పవన్ ఆవేదన, ఆగ్రహం