Homeజాతీయ వార్తలుMinister Ponnam Prabhakar: నాలుక మడత పెట్టి.. మీడియాను బెదిరించిన కాంగ్రెస్ మంత్రి!

Minister Ponnam Prabhakar: నాలుక మడత పెట్టి.. మీడియాను బెదిరించిన కాంగ్రెస్ మంత్రి!

Minister Ponnam Prabhakar: ప్రజా ప్రతినిధులు అన్నాకా కొన్ని విషయాల్లో సమయమనం పాటించాలి. విలేకరులు అడిగే తలతిక్క ప్రశ్నలకు అలాగే సమాధానం చెప్పాలి. అంతేకానీ కెసిఆర్ స్టైల్ లో ఎదురుదాడికి దిగితే లేక కోపాన్ని ప్రదర్శిస్తే ఖచ్చితంగా సామాజిక మాధ్యమాలలో ట్రోల్ కు గురికావడం తథ్యం. అంతే కాదు దాని తాలూకు వీడియో ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన సోషల్ మీడియా గ్రూపులలో పడితే ఇక అంతే సంగతులు. సందు దొరికితే చాలు ఆడేసుకుంటారు. ఆ వీడియోతో నానా బీభత్సం సృష్టిస్తారు. సో అందుకే విలేకరులతో మాట్లాడుతున్నప్పుడు ప్రజాప్రతినిధులు కొంతమేర ఓపికతో ఉండాలి. ఇష్టం లేకపోయినప్పటికీ సహనాన్ని ప్రదర్శించాలి.

అయితే ఈ సహనాన్ని కోల్పోయిన తెలంగాణ మంత్రి ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో గురవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీనియర్ నాయకుడు, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ కు మంత్రి పదవి దక్కింది. తెలంగాణ ఉద్యమంలో ఈయన పోషించిన పాత్రను గుర్తించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పొన్నం ప్రభాకర్ కు మంత్రి పదవి తో గౌరవించింది. అయితే ఆయన తనకు కేటాయించిన శాఖకు సంబంధించి ఇటీవల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి పలువురు విలేకరులు కూడా వచ్చారు. అయితే అందులో ఒక విలేకరి తన వ్యవహార శైలితో పొన్నం ప్రభాకర్ ను పదే పదే ఇబ్బంది పెట్టాడు. అప్పటిదాకా అతడు చేస్తున్న చేష్టలను ఓర్పుగానే భరించిన పొన్నం ప్రభాకర్.. ఒక్కసారి ఆగ్రహోదగ్దుడయ్యాడు. ఒక్కసారిగా నాలుక మడత పెట్టి ఆ విలేకరిని బెదిరించాడు. పక్కనే ఉన్న గన్మెన్ కూడా ఆ విలేకరిని వారించే ప్రయత్నం చేశాడు.

ఈ దృశ్యాన్ని వీడియో తీసిన కొందరు విలేకరులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక మొన్నటిదాకా అధికార పార్టీగా.. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్న భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా విభాగం ఈ వీడియోను ట్రోల్ చేయడం మొదలుపెట్టింది. సామాజిక మాధ్యమ వేదికల్లో పోస్ట్ చేసింది. ఈ వీడియోని చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇటీవల గుంటూరు కారు సినిమా నుంచి కుర్చీ మడతపెట్టి అనే పాటను.. ప్రభాకర్ నాలుక మడత పెట్టిన తీరుకు ఆపాదిస్తూ ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అంతేకాదు వెంకీ సినిమాలో బ్రహ్మానందం కోపంతో రవితేజ మీదకు వెళ్లే మీమ్ ను దీనికి జత చేయడంతో.. నవ్వులు పూయిస్తోంది. అందుకే రాజకీయ నాయకులు సమయమనంతో ఉండాలి అనేది. విలేకరులు ఎంత రెచ్చగొట్టినా కూడా ఒకింత ఓర్పును ప్రదర్శించాలి. అప్పుడే ఆ నాయకుడి అసలు లక్షణం బయటి ప్రపంచానికి తెలుస్తుంది. సమావేశం అనంతరం ఆ విలేఖరిని పిలిచి చివాట్లు పెడితే పొన్నం ప్రభాకర్ కు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆ విలేఖరి ఎలాంటి ప్రశ్నలు అడిగాడు, ఎలా వ్యవహరించాడు అనేది ఈ సమాజం చూడదు. కేవలం ప్రభాకర్ హావభావాలను మాత్రమే చూస్తుంది. పాపం మంత్రి గారు దీన్ని అంచనా వేయడంలో విఫలం కావడం వల్లే ఈ పరిస్థితి దాపురించింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version