తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక నేపథ్యంలో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. తిరుపతి ఉప ఎన్నికకు ఏపీ ప్రత్యేక హోదాతో ముడిపెడుతూ రాజీనామాలకు సిద్ధమని టీడీపీ చీఫ్ చంద్రబాబు సవాలు విసరగా, వైసీపీ సీనియర్ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ సవాలును స్వీకరించారు. తిరుపతిలో గురుమూర్తి గనుక ఓడిపోతే, వైసీపీకి చెందిన 22 మంది ఎంపీలు రాజీనామా చేస్తారని మంత్రి తెలిపారు. ఆదివారం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు అనూహ్య ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వినిపించిన రాజీనామా అస్త్రాన్ని సంధించారు.25మంది ఎంపీలను గెలిపిస్తే.. కేంద్రం మెడలు వంచి ఏపీకి ప్రత్యేక హోదా తీసుకువస్తామని అన్న విషయాన్ని గుర్తు చేశారు. అందుకే ప్రజలు వైసీపీని నమ్మారని.. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఒక్కసారైనా ఆ ప్రస్తావన తెచ్చారా అని చంద్రబాబు ప్రశ్నించారు. టీడీపీ చీఫ్ సవాలు చేసిన కొద్ది గంటలకే మంత్రి పెద్దిరెడ్డి రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు సవాలును స్వీకరించారు.
ఉప ఎన్నిక నేపథ్యంలో ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని ముడిపెడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు విసిరిన రెఫరెండం సవాల్‌ను మంత్రి పెద్దిరెడ్డి స్వీకరించారు. ఆదివారం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి.. వైసీపీ ఓడిపోతే 22 మంది ఎంపీలు రాజీనామా చేస్తారని చెప్పారు. టీడీపీ ఓడితే ముగ్గురు ఎంపీలతో పాటు రఘురామరాజుతో రాజీనామా చేయిస్తారా? అని ప్రశ్నించారు. టీడీపీకి ఉన్నది ముగ్గురు ఎంపీలే అయినా, రఘురామకృష్ణంరాజు కూడా అనుంగ అనుచరుడిగా వ్యవహరిస్తున్నాడని, కాబట్టి మొత్తం నలుగురు ఎంపీలూ రాజీనామాకు సిద్ధం కావాలని సవాలు విసురుతున్నామన్నారు.
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండటం, తాజాగా కొత్త కేసులు మూడు వేల మార్కును దాటిన నేపథ్యంలో జాగ్రత్త చర్యల్లో భాగంగానే ముఖ్యమంత్రి జగన్ తిరుపతి బహిరంగ సభను రద్దు చేసుకున్నారని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. గడిచిన 20 నెలల్లో సీఎం జగన్ చేసిన ప్రజాహిత కార్యక్రమాలే తిరుపతి ఎన్నికలో తమకు ఆయుధాలని మంత్రి చెప్పారు. ఇక.. పవన్ ఓ పొలిటికల్ పెయిడ్ ఆర్టిస్ట్ తిరుపతి ఎన్నికల్లో ప్రజలను ధైర్యంగా ఓటు అడిగే హక్కు బీజేపీకి లేదని, విభజన హామీలను నెరవేర్చకుండా ప్రజలను బీజేపీ మోసం చేస్తోందని మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు.