
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి మరోసారి వార్తల్లోకెక్కారు. తాజాగా ఆయన సోదరుడు నర్సింహారెడ్డి పేకాట ఆడుతూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు పేకాట శిబిరంపై దాడి నిర్వహించగా కొందరు పట్టుబడ్డారు. వారిలో మంత్రి సోదరుడు ఉండడం గమనార్హం. కాగా ఇందులో మొత్తం 11 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
గత కొంతకాలంగా పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బోయినిపల్లిలోని మల్లారెడ్డి గార్డెన్స్ ప్రాంతంలోని ఓ ఫంక్షన్ హాల్లో కొందరు పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు నార్త్ జోజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అప్రమత్తమయ్యారు. చాకచక్యంగా ఆ ఫంక్షన్ హాల్ పై దాడి చేయడంతో 11 మంది రెడ్ హ్యాండెడ్ గా దొరికారు.
పట్టుబడిన వారిలో మంత్రి సోదరుడు నర్సింహారెడ్డితో సహా భాస్కర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, జనార్ధన్ రెడ్డి, శ్రీనివాసరాజు, వెంగళ్ రెడ్డి, నర్సిరెడ్డి, శ్రీనివాసరాజు, కృష్ణ, కౌడి సాయిలు, నర్సింహారావు, హనుమంతు, సుదర్శన్ రెడ్డి, మోహన్ రెడ్డి ఉన్నారు.
వీరి వద్ద నుంచి రూ.1.40 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వారిని బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. అయితే దీనిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. కాగా భూ కబ్జాలపై మంత్రి మల్లారెడ్డిపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ఆయన సోదరుడు పేకాడ ఆడుతుండగా పట్టుబడడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.