Minister KTR Foreign Tour: తెలంగాణ ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పుకుంటున్న నేతలు అంతే స్థాయిలో ఖర్చులు కూడా పెడుతున్నారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గత నెలలో చేసిన విదేశీ పర్యటనకు రూ. 13 కోట్లు ఖర్చు చేయడం విమర్శలకు తావిస్తోంది. అసలే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు దొరకక ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉంటే తాను మాత్రం దర్జాగా విదేశాలు చుట్టొస్తున్నారు. ఊరంతా కంపు కంపు ఊరి బయట ఊరేగింపు అన్నట్లుగా రాష్ట్రమే దివాలా తీస్తుంటే మంత్రి మాత్రం తన సోకులు చూపించుకునేందుకు రూ. కోట్లు కుమ్మరిస్తుండటంపై ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నాయి. ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేయడం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి.

రాజుల సొమ్ము రాళ్లపాటు అన్నట్లుగా ఉంది పరిస్థితి. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నదట గురివింద. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే మంత్రి మాత్రం తన డాబు దర్పం చూపించుకునేందుకు విదేశీ పర్యటనలు చేస్తున్నారు. తన సొమ్మేమన్నా పోతుందా ప్రజాధనమే కదా అని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారనడానికి వారు చేసిన ఖర్చులే నిదర్శనం. మొదట ప్రభుత్వం వారి పర్యటనకు రూ. రెండు కోట్లు కేటాయించగా తరువాత మళ్లీ కావాలని అడగడంతో మరోసారి రూ. 7 కోట్లు, మరోమారు రూ. 3 కోట్లు కేటాయించారు. దీంతో రూ.13 కోట్లు ఖర్చు చేసి వారికి వారే సాటి అని నిరూపించుకుంటున్నారు.
Also Read: TDP BJP Alliance: మోడీని టెంప్ట్ చేసే ఆఫర్ ఇచ్చిన చంద్రబాబు..? జనసేన పరిస్థితేంటి?
మే 22 నుంచి 26 వరకు స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగిన ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు మంత్రి కేటీఆర్, ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ తో పాటు మరో 8 మంది అధికారులు తరలి వెళ్లారు. నాలుగు రోజులు అక్కడే ఉన్నారు. అంతకుముందు యూకేలో పర్యటించారు. దీంతో వారి ఖర్చు మాత్రం తడిసిమోపెడయింది. ఏకంగా రూ. 13 కోట్లు ఖర్చు చేయడం విమర్శలకు తావిస్తోంది. ఇంత మొత్తంలో ఖర్చు చేసి వారు సాధించిందేమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. ప్రజాధనాన్ని లూటీ చేయడం తప్ప వారు సాధించింది శూన్యమే. దీనికి ఎందుకంత హంగు ఆర్భాటాలని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోతోంది. ఉద్యోగులకు సరైన సమయంలో జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటి సందర్భంలో మంత్రి విదేశీ పర్యటనల పేరుతో ఎంజాయ్ చేయడం ఎంతవరకు సమంజసం. నానాటికి దిగజారిపోతున్న స్థితికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది. ఓ పక్క అప్పు పుట్టక సతమతమవుతున్న సందర్భంలో మంత్రి పర్యటనలు అవసరమా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. మొత్తానికి కేటీఆర్ పర్యటనతో రూ.13 కోట్లు కుమ్మరించడంపై సందేహాలు వస్తున్నాయి. ఇంత మొత్తంలో డబ్బు ఖర్చు చేసి వారు తెచ్చిందేమిటని అడుగుతున్నారు. ప్రతిపక్షాల గోలను పట్టించుకోకుండా వారి పని మాత్రం వారు కానిస్తున్నారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
Also Read:Jaya Prada: ఏపీ రాజకీయాల్లోకి జయప్రద రీ ఎంట్రీ? ఆ వ్యాఖ్యలు వెనుక కారణం అదేనా?