
తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. మానవత్వం ఉన్న మనిషి అని అనిపించుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తులను తన కాన్వాయ్ లో ఆస్పత్రికి పంపించి బాధితులకు చికిత్సను అందేలా చేశారు.
ఓవైపు కొంతమంది పోలీసులు ప్రొటోకాల్ అంటూ ఎమర్జెన్సీ టైం అంటూ కేటీఆర్ ను ఆపినా సరే అవన్నీ పక్కనపెట్టి మంత్రి కేటీఆర్ చూపించిన మానవత్వంపై అందరి నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
సిద్దిపేట ఔటర్ బైపాస్ పైన.. మెడికల్ కాలేజీ దగ్గరలో ఒక బైక్ ప్రమాదం తాజాగా జరిగింది. బైక్ పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తూ డివైడర్ ను ఢీకొట్టి కిందపడ్డారు. వీరు సిద్దిపేట కాళ్లకుంట కాలనీకి చెందిన ఇద్దరు ముస్లిం వ్యక్తులుగా గుర్తించారు.
అదే సమయంలో ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి మంత్రి కేటీఆర్ కాన్వాయ్ వెళుతోంది.ఈ ప్రమాదాన్ని చూసి వెంటనే మంత్రి కేటీఆర్ స్పందించారు. కారు దిగి తన కాన్వాయ్ లోని కార్లలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు క్షతగాత్రులను ఎక్కించారు. సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తన పీఏ మహేందర్ రెడ్డిని, ఎస్కార్ట్ పోలీసులను ఇచ్చి పంపించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఫోన్ చేసి మరీ కేటీఆర్ వైద్యులకు సూచించారు.
ఇలా ఆపదలో ఆదుకున్న కేటీఆర్ తీరుపై స్థానికులు, వాహనదారులు, క్షతగాత్రుల బంధువులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
https://twitter.com/revathitweets/status/1419722972172996614?s=20