Minister Karumuri Nageswara Rao: నవ్విపోదరుగాక నాకేటి అన్న చందంగా మారింది ఏపీలోని కొందరు మంత్రులది. తామ చేతిలో పవర్ ఉంది కదా..ఏదిపడితే అది అనేయవచ్చని భావిస్తున్నట్టున్నారు. అందుకే ప్రజలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. తిరిగి ఘాటైన కామెంట్స్ కు సరికొత్త నిర్వచనలు ఇస్తున్నారు.తాజాగా పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు రైతును ఉద్దేశించి ‘వెర్రిపప్ప’ అని సంబోధించారు. అయితే అది అనుచిత పదం కాదని.. అస్సలు తిట్టు కానేకాదని.. దాని అర్థం ‘బుజ్జినాన్న’ అని చెప్పుకొచ్చారు. దిద్దుబాటు చర్యల్లో భాగంగా తన వ్యాఖ్యలపై క్షమాపణ కోరకుండా సరికొత్త నిర్వచనం చెప్పడం విమర్శలకు తావిస్తోంది.
జరిగింది ఇది..
చేతికొచ్చిన పంట నీటి పాలవ్వడంతో నష్ట పరిహారం ఇప్పంచాలని ఓ రైతు మంత్రిని కోరడమే తప్పయ్యింది. తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో అకాల వర్షం పంట నష్టం పరిశీలనకు మంత్రి వెళ్లారు. సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇంతలో అక్కడే ఓ రైతు అకాల వర్షాలకు పంట తడిసి మొలకలు వచ్చాయని…రైతుల నుండి పంట కొని ఆదుకోవాలని కోరాడు. అంతమంది మధ్యలో ఆ రైతు అలా అనేసరికి మంత్రి కారుమూరికి పట్టరాని కోపం వచ్చేసింది. ‘‘వెర్రిపప్పా.. వరదలొస్తే నేనేం చేసది’’ అంటూ ఆగ్రహంతో ఊగిపోతూ తిట్ల దండకాన్ని ఎత్తుకున్నారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆరుగాలం శ్రమించి పంటను కాపాడుకునేందుకు నానా కష్టాలు పడుతున్న రైతులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని పలువురు మండిపడుతున్నారు. రైతులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం ముందుందని చెప్పే బదులు వరదలొస్తే నేనేం చేసేది అని అనడం ఒక మంత్రిగా ఆయన బాధ్యాతారహిత్యం పరాకాష్ట అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
బుజ్జినాన్న అంటూ కొత్త నిర్వచనం..
ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతోపాటు సోషల్ మీడియాలో ఆయనపై ట్రోలింగ్స్ ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ఓ టీవీ చానల్‌లో మాట్లాడిన కారుమూరి.. తాను చేసిన ‘ఎర్రిపప్ప’ వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. తాను రైతులను దుర్బాషలాడలేదని అంటూనే.. ‘ఎర్రిపప్ప అంటే బుజ్జినాన్న’ అని అర్థమని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై కూడా సోషల్ మీడియా ట్రోల్స్ చేస్తున్నారు. ‘అయితే నిన్ను కూడా ఎర్రిపప్ప అనొచ్చు కదా.. కారుమూరి బుజ్జి నాన్న’ అని ఒకరంటే.. ‘151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు బుజ్జినాన్నలేనన్నమాట’ అని మరొకరు కామెంట్ చేశారు. ఇవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.