
Minister Dharmana Prasada Rao: ఎందుకో ఈ మధ్య సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట తూలుతోంది. వయసు ప్రభావమో.. లేకుంటే అధికార వ్యామోహమో తెలియదు కానీ.. ఆయన ప్రజలపై రుసరుసలాడుతున్నారు. చివరకు మహిళలని కూడా చూడడం లేదు. గుబ మీద కొట్టండని కూడా సెలవిస్తున్నారు. ప్రభుత్వం ఆసరా పథకంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో మహిళతో సమావేశాలు ఏర్పాటుచేస్తోంది. వైసీపీ ప్రజాప్రతినిధులు వైసీపీ ప్రభుత్వానికి, జగన్ కు అనుకూల నినాదాలు చేయించడానికి ప్రయత్నించి భంగపడుతున్నారు. బలవంతంగా డ్వాక్రా మహిళలను సమీకరిస్తుండగా.. ఇలా ప్రజాప్రతినిధులు ప్రసంగించే సమయానికి వారు పరుగులుపెడుతున్నారు. ఈ క్రమంలో ధర్మానలాంటి వారు మాట తూలుతున్నారు. మహిళలు అని చూడకుండా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.
సంస్కారం అంటూ పెద్దపెద్ద మాటలు…
అయితే ఇటీవల ధర్మాన వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలే చేస్తున్నారు. గతంలో ఆయన ఇటువంటి వ్యాఖ్యలు ఎప్పుడూ చేయలేదు. చాలా హుందాగా, లాజిక్ గా మాట్లాడేవారు. కానీ ఇప్పుడు మాట తూలుతున్నారు. ఎక్కడికి వెళ్లినా ఒకటే మాదిరిగా కామెంట్స్ చేస్తున్నారు. సోమవారం సొంత నియోజకవర్గం శ్రీకాకుళంలో రెండుచోట్ల ఆసరా సమావేశాలు నిర్వహించారు. పెద్దఎత్తున మహిళలను సమీకరించారు. ఓ చోట మంత్రి ధర్మాన మాట్లాడుతూ ‘మొన్న ఆసరా సమావేశానికి హాజరైన ఓ మహిళ తిరుగు వెళుతూ జగన్ ఊరకనే ఇస్తున్నాడా? తన ఇంట్లో నగదును ఏమైనా ఇస్తున్నాడా? అని వ్యాఖ్యానించిందని.. తిన్నది తిరగబోసుకోవడం అంటే ఇదేనని…సంస్కారం లేకపోతే ఎలా? ఏం మనుషులో ఏమో..పద్దుకు మాలిన వ్యక్తులు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ధరలు పెరుగుతున్నాయని ప్రభుత్వంపై నెడుతున్నారని.. దానికి జగన్ కు సంబంధం లేదంటూ లాజిక్ గా మాట్లాడారు.
మహిళల నుంచి ప్రతిఘటన..
కానీ మంత్రి ధర్మాన తాను ఏదో తెలివితేటలుగా మాట్లాడుతున్నానని భావించారు. కానీ మహిళలకు అవి బోరు కొట్టినట్టు కనిపించాయి. వెంటనే వారు లేచి అక్కడ నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారు. దీంతో మంత్రి కంగారు పడిపోయారు. ‘ఐదు నిమిషాల్లో వెళ్లిపోదురు. ఏయ్ తల్లీ ఆగండి.. ఒరేయ్ ఆటోలు స్టార్ట్ చేయకండి.. మరో ఐదు నిమిషాలు ఆగండి’ అంటూ ప్రాధేయపడినా మహిళలు వినలేదు. ఇక మరో సమావేశంలో అయితే ఓ పాఠశాలకు ఉన్న గేటు ఊచలను తొలగించి మరీ మహిళలు పారిపోయారు. అధికారులకు శాపనార్థాలు పెట్టిన వారూ ఉన్నారు. అయితే ఈ విషయంలో కూడా మంత్రి ధర్మాన అసహనం వ్యక్తం చేశారు, చూడండి రేపు పలానా మీడియాలో ఇదే హైప్ చేస్తారంటూ చెప్పుకోవడం గమనార్హం.

అభద్రతాభావంతోనే…
సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల అయినదానికి కానిదానికి తెగ బాధపడుతున్నారు. లోలోపల ఎందుకో కంగారు పడుతున్నారు. దీనిపై సొంత పార్టీ నేతలే తలోరకం చర్చించుకుంటున్నారు. ఇటీవల ధర్మాన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. తరచూ హైలెట్ గా మారుతున్నాయి. మూడు రాజధానులకు మద్దతుగా ఎవరూ చేయనన్ని వ్యాఖ్యలను ధర్మాన చేశారు. మూడు రాజధానులకు మద్దతు తెలపకుంటే చచ్చిన శవంతో సమానమని పేర్కొన్నారు. ఈ విషయంలో సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ శ్రేణులతో జైకొట్టించలేకపోయారు. ఇప్పుడు వైసీపీకి ఓటు వేయకుంటే బుల్లెట్ దిగుతుందంటూ మహిళలను బెదిరించారు. అక్కడితో ఆగకుండా పురుషులు పోరంబోకులుగా అభివర్ణించారు. శ్రీకాకుళం నుంచి మంత్రిగా ఉన్న ఆయన తమ ప్రజల్ని కించ పర్చడానికి బెదిరించడానికి కూడా వెనుకాడటం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విశాఖ రాజధాని కాకపోతే ఉత్తరాంధ్ర రాష్ట్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ ఆయన మాటల్ని ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా ఒకేలా కామెంట్స్ చేస్తుండడం విమర్శలకు తావిస్తోంది.