China covid : కోవిడ్ మహమ్మారి నుంచి ప్రపంచ దేశాలన్నీ దాదాపుగా బయటపడగా… వైరస్ వెలుగు చూసిన చైనాను మాత్రం పట్టిపీడిస్తోంది.. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ఆ దేశం జీరో కోవిడ్ విధానాన్ని అనుసరిస్తున్నది. ఇవే కాకుండా అనేక విధానాలు అవలంబిస్తున్నది.. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోతున్నది.. నెలల తరబడి లాక్ డౌన్ విధిస్తుండడంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తమవుతున్నది. దీంతో జీరో కోవిడ్ విధానాన్ని సడలించేందుకు చైనా ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే పూర్తిస్థాయి ఆంక్షలు ఎత్తేస్తే పరిస్థితి చేయి దాటి పోతుందనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.. భారీ మరణాలు సంభవిస్తాయనే హెచ్చరికలు ఆ దేశాన్ని వణికిస్తున్నాయి. ప్రజల్లో వ్యాధి నిరోధక తక్కువ ఉండటం వల్ల వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటున్నదని చైనా దేశపు పరిశోధకులు అంటున్నారు. శుక్రవారం నాటికి చైనా దేశంలో ఐదువేల పైచిలుకు కోవిడ్ సంబంధిత మరణాలు నమోదు అయ్యాయి.. మూడు లక్షలకు పైగా ప్రజల్లో కోవిడ్ లక్షణాలు కనిపించాయి..

ఎందుకు ఇలా
ప్రపంచం మొత్తం కోవిడ్ కి సంబంధించి తిరోగమనంలో ఉంటే.. చైనాలో మాత్రం పరిస్థితి మరో విధంగా ఉంది.. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందంజలో ఉన్న దేశం జనాభాకు తగ్గట్టుగా వ్యాక్సిన్ ఇవ్వలేకపోతోంది.. దీనివల్ల ఆ దేశ ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. చైనా ఇతర దేశాలను కబలించేందుకు పెట్టే శ్రద్ధలో కొంచెమైనా తమపై పెడితే బాగుంటుందని అక్కడి ప్రజలు వాపోతున్నారు.. ఇటీవల చైనాలోని ఓ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుని పదుల సంఖ్యలో ప్రజలు అగ్నికి ఆహుతి అయ్యారు. ప్రభుత్వం లాక్ డౌన్ పేరుతో ఇళ్లకు తాళాలు వేయడంతో వారు బయటకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది.. ఫలితంగా మంటల్లో పడి వారు సజీవ దహనమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు నిరసన వ్యక్తం చేశారు.. తెల్ల పేపర్లతో ఆందోళన వ్యక్తం చేశారు.
ఎలా సాధ్యమవుతుంది
హాంకాంగ్ తరహాలో పూర్తిగా కోవిడ్ ఆంక్షలు సదలిస్తే మెయిన్ ల్యాండ్ చైనాలో దాదాపు 20 లక్షల మరణాలు సంభవించే అవకాశం ఉందని గ్యాంగ్జి ప్రాంతంలో ఉన్న సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ హెడ్ జియో టాంగ్ అంచనా వేశారు. గత నెలలో షాంగై లో ని ఓ జర్నల్ లో ప్రచురితమైన పరిశోధన పత్రంలో ఈ విషయాన్ని ఆయన పేర్కొన్నారు.. అలాగే కోవిడ్ కేసులు 23 కోట్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేశారు.. చైనా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయకుండా, ఆరోగ్యం మౌలిక సదుపాయాలు మెరుగుపరచకుండా జీరో కోవిడ్ పాలసీ నుంచి పూర్తిగా వైదొలిగితే 15 లక్షల మరణాల సంభవించే అవకాశం ఉందని అమెరికన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.. కోవిడ్ దశ కీలక స్థాయికి చేరినప్పుడు ఇన్సెంటివ్ కేర్ లకు డిమాండ్ 15 రెట్లు ఎక్కువ ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.. వ్యాక్సినేషన్, బూస్టర్ రేట్ తక్కువగా ఉండటం, హైబ్రిడ్ ఇమ్యూనిటీ లేకపోవడం వంటి కారణాలవల్ల భారీగా మరణాలు సంభవించే అవకాశం ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.. హాంకాంగ్ లో ఫిబ్రవరిలో సంభవించిన బి ఏ 1 వేవ్ ను పరిగణలోకి తీసుకుని పలువురు శాస్త్రవేత్తలు ఈ అంచనాలు రూపొందించారు. ఒకవేళ చైనా ప్రభుత్వం లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేస్తే డ్రాగన్ మృత్యు దిబ్బగా మారడం ఖాయం.