Michaung Cyclone: ఆంధ్రప్రదేశ్ కోలుకుంటోంది. మిచాంగ్ తుఫాను నేపథ్యంలో భారీ వర్షాలకు చాలా జిల్లాల్లో పంటలకు అపార నష్టం కలిగింది. ముఖ్యంగా వరి పంటకు కోలుకోలేని దెబ్బ తగిలింది. అయితే అటు వాతావరణం సాధారణ స్థితికి రావడం, ఇటు ప్రభుత్వ చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. క్రమేపి పంట పొలాల్లో వరద నీరు తగ్గుముఖం పడుతోంది.ఇది రైతులకు ఉపశమనం కలిగించే విషయం.
రాష్ట్రవ్యాప్తంగా వరద బాధిత ప్రాంతాలలో పొలాల నుంచి వరద నీరును బయటకు పంపే కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. 30 ప్రాంతాల్లో డ్రైన్లలో పూడికతీత చేపట్టారు. ఇందుకుగాను 16 యంత్రాలను వినియోగించారు. అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పుణ్యమా అని పనులు చురుగ్గా జరుగుతున్నాయి. అదే సమయంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా తడిచిన పంటను కాపాడుకోవడం పై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. బాధిత జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటగా బెంగాల్ గ్రామ్ ను నాటుకోవడానికి సబ్సిడీపై విత్తనాలు అందించడానికి నిర్ణయించారు. పదివేల మెట్రిక్ టన్నులు అవసరమని గుర్తించారు.
వరద బాధిత ప్రాంతాల్లో ప్రభుత్వ ముందస్తు చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. ఎక్కడికక్కడే పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. వందలాదిమందిని ఆ శిబిరాలకు చేర్చారు. వరద తగ్గుముఖం పట్టడంతో వారిని స్వస్థలాలకు పంపిస్తున్నారు. వీరందరికీ 25 కిలోల బియ్యం, కేజీ నూనె, కేజీ బంగాళదుంపలు, కేజీ ఉల్లిపాయలు పంపిణీ చేశారు. లక్షలాది కుటుంబాలకు రూ.2500 చొప్పున అందించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా తుఫాను పంట నష్టం అంచనాల్లో అధికారులు, సిబ్బంది నిమగ్నమయ్యారు. మొత్తానికైతే బాధితులకు కోలుకోలేని నష్టం జరిగినా.. ప్రభుత్వపరంగా అందించిన చేయూత అభినందనలు అందుకుంటుంది.