Khammam BRS Meeting: కొండపోచమ్మ సాగర్ నుంచి కొర్రమేనులు వచ్చాయి.. సిద్దిపేట నుంచి గొర్రెపోతులు… వనపర్తి కృష్ణా జలాల నుంచి రొయ్యలు..ఇంకా పీతలు, బచ్చలి కూర, ఇలా మొత్తం 69 రకాల కూరలతో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభకు మెనూ సిద్ధమైంది.. ఈ బాధ్యతను ఖమ్మం రెస్ట్ ఇన్ హోటల్ దక్కించుకుంది.. అంటే ఈ మెనూ ను వచ్చిన ప్రజల కోసం పెడతారు అనుకుంటే పొరబాటే… కేవలం కెసిఆర్ భజన చేసే ఆ ముగ్గురు ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రి కి మాత్రమే కొసరి కొసరి వడ్డిస్తారు. ఈ వంటలు చేసేందుకు కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడైన వ్యక్తికి సంబంధించిన హోటల్ నుంచి చెఫ్ లు ఖమ్మం చేరుకున్నారు.. మంగళవారం సాయంత్రానికి కొర్రమీనులు, రొయ్యలు, పీతలు, గొర్రెపోతుల మాంసం ఖమ్మానికి వచ్చింది.

భారీగా ఏర్పాట్లు
ఖమ్మం సమీకృత కలెక్టరేట్ ప్రాంగణంలో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నారు. దీని కోసం 100 ఎకరాల్లో మైదానాన్ని సిద్ధం చేశారు. సుమారు 4000 మంది పోలీసులు బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. వీరికి తోడుగా పదివేల మంది భారత రాష్ట్ర సమితి వాలంటీర్లు సిద్ధంగా ఉన్నారు.. మధ్యాహ్నం రెండు గంటలకు సభ ప్రారంభమవుతుంది. సభా వేదిక మీదకు కేరళ, పంజాబ్, ఢిల్లీ ముఖ్యమంత్రులు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కొంతమంది ముఖ్య నాయకులకు మాత్రమే ఆహ్వానం ఉంటుంది.. మిగతా నాయకులకు మాత్రం ముందు వరసలో అవకాశం కల్పిస్తారు. ఆంధ్రప్రదేశ్ భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ప్రారంభ ఉపన్యాసం చేస్తారు.. సభకు అధ్యక్షుడిగా భారత రాష్ట్ర సమితి జనరల్ సెక్రెటరీ కేశవరావు వ్యవహరిస్తారు..
కోట్లల్లో ఖర్చు
పార్టీ ఆవిర్భావ సభ నిర్వహిస్తుండటంతో భారత రాష్ట్ర సమితి నాయకులు కనివిని ఎరుగని స్థాయిలో ఖర్చు చేస్తున్నారు.. కేవలం ఫ్లెక్సీల కోసమే 6 కోట్ల దాకా ఖర్చు చేసినట్టు సమాచారం.. గతంలో చంద్రబాబు నాయుడు సభకు తెలుగుదేశం పార్టీ నాయకులు హోర్డింగులు ఏర్పాటు చేస్తే అపరాధ రుసుము విధించిన ఖమ్మం మున్సిపల్ అధికారులు… భారత రాష్ట్ర సమితి నాయకుల పట్ల మాత్రం ఉదారత చూపుతుండటం గమనార్హం.. ఈ ఫ్లెక్సీల విషయంలో కూడా ప్రోటోకాల్ పాటించినట్లు తెలుస్తోంది.. ఫ్లెక్సీలో ఎక్కడ కూడా కవిత ఫోటో కనిపించడం లేదు.

కేవలం కెసిఆర్, కేటీఆర్ ఫోటోలు మాత్రమే దర్శనమిస్తున్నాయి.. పువ్వాడ అజయ్ కుమార్ పేరిట భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా… మిగతా నాయకుల ఫ్లెక్సీలు అతి తక్కువ సంఖ్యలో కనిపిస్తున్నాయి.. ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావు పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు నగర శివారుకు మాత్రమే పరిమితమయ్యాయి.. వీటిని చూసి భారత రాష్ట్ర సమితిలో అంతర్గత కలహాలు ఫ్లెక్సీలను కూడా వదలడం లేదని నగర ప్రజలు చర్చించుకుంటున్నారు.. కాగా బుధవారం నాటి సభకు సంబంధించి బందోబస్తు నిర్వహించేందుకు పలు జిల్లాలకు చెందిన కమీషనర్ ఆఫ్ పోలీసులు వచ్చారు.. అయితే సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల నుంచి భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు ఖమ్మం చేరుకున్నారు. వీరికి నగర శివారు ప్రాంతాల్లో బస ఏర్పాటు చేశారు.