కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సామాన్యుల పరిస్థితి కొంత అగమ్యగోచరంగానే మారింది. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ వ్యవస్థలకే కాపు కాస్తున్నట్లుగా ప్రజల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. సామాన్యులను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంత పెద్ద కరోనా క్రైసిస్‌లో ఉద్దీపన ప్యాకేజీ అంటూ ప్రకటించినా.. దానివల్ల పేదలకు ఒరిగిందేమీ లేదు.
దీనికితోడు మూలిగే నక్క మీద తాటి కాయ పడ్డట్టుగా పేదలకు రోజురోజుకూ మరింత భారం మోపుతూనే ఉన్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి నడ్డి విరిచారు. అయితే.. ఎక్కడ ఎన్నికలు ఉంటున్నాయో అక్కడ మాత్రమే వచ్చిరాని హామీలిస్తూ కాలం వెల్లదీస్తూ వస్తున్నారు. అయితే.. ఇప్పుడిప్పుడే కొంత పెట్రోల్ ధరలు తగ్గుతున్నట్లు కనిపిస్తోంది.
పెట్రోల్ ధరలు తగ్గడానికి కారణాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే.. ఎప్పుడైతే ఐదు రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందో ఈ తగ్గుదల కనిపించింది. పెట్రోల్ ధరలు అలాగే ఉంటే.. ఈ ఐదు రాష్ట్రాల్లో గెలవడం కష్టమని భావించిన కేంద్రం.. కొంచెం కొంచెం తగ్గిస్తూ వస్తోంది. ఈ మేరకు ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదికతో కేంద్రం అలర్ట్ అయినట్లుగా తెలుస్తోంది. వెంటనే ఆయిల్ కంపెనీలతో చర్చించి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ ధరలు పెరగకుండా చూడాలని కోరినట్లుగా సమాచారం.
ఇక.. పెట్రోల్ ధరలు కాసింత ఊరట కలిగిస్తున్నా మరోవైపు నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ప్రజల్లో ఆ అసంతృప్తి ఎక్కువ కనిపిస్తోంది. వీటన్నింటికి తోడు ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించడం.. అంబానీ, అదానీలకు దోచిపెడుతున్నారంటూ సోషల్ మీడియాలో కేంద్రం నిర్ణయాలను తప్పుపడుతూనే ఉన్నారు. ఇక.. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత మోత మోగడం ఖాయంగా కనిపిస్తోంది. ఫలితాలు ఎలా వచ్చినా మోడీ తాను అనుకున్నదే చేస్తుంటారు. సో… ఎన్నికల ఫలితాల తర్వాత అంటే వచ్చే మే నెలలో ప్రజలపై మరింత భారం తప్పదన్నమాట.