Martyrs Memorial Telangana: తెలంగాణ కెసిఆర్ ఒక్కడు పోరాడితేనే రాలేదు. తెలంగాణ పోరాటం కెసిఆర్ ఒక్కడి వల్లే ప్రారంభం కాలేదు. రెండు దశల్లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది గిరి గీసి కొట్లాడారు. తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేశారు.. అలాంటి వారి స్మృత్యర్థం తెలంగాణ ప్రభుత్వం అమరవీరుల స్మారక చిహ్నం పేరుతో ఒక నిర్మాణం రూపొందించింది. వాస్తవానికి చూస్తే అది ఒక చిహ్నం మాత్రమే కాదని, అమరవీరుల త్యాగాలకు ప్రతిరూపమని, వారిని స్మృతి పథంలోకి తెప్పించి.. మనసును ఉద్వేగంతో బరువెక్కించి.. పేరుపేరునా నివాళులర్పించేలా ఒక ప్రత్యేకమైన చోటు అని సందర్శకులకు అనిపించాలి. అయితే గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించబోయే “తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం” అలాగే ఉందా? అని ప్రశ్న తలెత్తినప్పుడు దీనికి లేదు అనే సమాధానం వస్తుంది. నీళ్లు, నిధులు, నియామకాల పరంగా వివక్ష, అణచివేత నుంచి బయటపడి స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న తెలంగాణకు పునాదిరాళ్లు అమరవీరులే. వారు తృణప్రాయంగా త్యజించిన ప్రాణాలే. కానీ ఆ అమరుల పేర్లే తెలంగాణ స్మారక చిహ్నంలో కనిపించడం లేదు. తెలంగాణ కోసం వందల మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ ఎవరి పేర్లనూ ప్రభుత్వం ఆ స్మారకంలో రూపొందించలేదు.
3.29 ఎకరాలు, 26,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో, 45 మీటర్ల ఎత్తులో, 177 కోట్ల వ్యయంతో దీపం వెలుగుతున్నట్టు ప్రమిద ఆకారంలో దీనిని నిర్మించారు. ఇంతటి చిహ్నంలో తెలంగాణ అమరుల పేర్లు లేవు. కేవలం అమరవీరులకు జోహార్లు అని ఒక బోర్డుతో సరిపెట్టేశారు. అయితే తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించి అమరులైన వారందరు? తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమరవీరుల స్మారక చిహ్నం ఆవిష్కరించుకుంటున్న వేళ నిజానికి ఈ ప్రశ్న తలెత్తడం నిజంగా ఒకింత బాధాకరమే. అయితే ఈ విషయంలో భారత రాష్ట్ర సమితి అమరవీరులపై గారడి లెక్కలు చూపుతుండడం విశేషం.
తెలంగాణ రాష్ట్ర సాధనలో అప్పట్లో 1200 మంది చనిపోయారని తొలి శాసనసభ సమావేశంలో కెసిఆర్ ప్రకటించారు. ఆ కుటుంబాలకు అన్ని విధాలుగా న్యాయం చేస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించి ఒక తీర్మానం కూడా చేశారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు, ఇళ్ళు ఇస్తామని, వ్యవసాయానికి అనువైన భూమినీ ఇస్తామని మాట కూడా ఇచ్చారు. కానీ నేటికీ అమరుల కుటుంబాలకు ఈ సాయం పూర్తిస్థాయిలో అందలేదు. ఉద్యమ పార్టీ ఏలుబడిలో వారికి ప్రభుత్వ సాయం దక్కలేదు. ప్రత్యేక రాష్ట్రం కోసం అమలైంది మునుపు చెప్పినట్టు 1200 మంది మాత్రం కాదని, 650 మంది మాత్రమేనని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వపరంగా వీరిలో 528 కుటుంబాలకు మాత్రమే సహాయం అందింది. మిగతా వారిని గుర్తించడంలో ప్రభుత్వం అంత ఆసక్తిగా లేదు.. ఇక అమరులుగా 650 మందిని గుర్తించడంలోనూ ఒక ఫార్ములా అనుసరించింది. పోలీస్ రికార్డుల్లో నమోదైన వారిని గుర్తించి, ఫైనల్ చేయాలని సర్కారు మౌకిక ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా పోలీసు రికార్డుల్లో నమోదైన వారి జాబితా లెక్కిస్తే 650గా తీరింది. అమరులైన వారిలో చాలామంది వివరాలు పోలీసు రికార్డుల్లో నమోదు కాలేదు. అలా నమోదు కాని కుటుంబాలకు సాయం పొందేందుకు అర్హత లేదా? అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది.
తెలంగాణ కోసం అమరులైన మిగతా వారి వివరాల కోసం తీసుకున్న చర్యలు దాదాపు శూన్యం. దీనిపై ఎవరైనా సామాజికవేత్తలు ప్రశ్నిస్తే వారి చిరునామా దొరకడం లేదని చెబుతున్నారు.. డ్రెస్ నాట్ అవైలబుల్ అంటూ ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చారు.. అమరవీరులను గుర్తించాలంటే ఉద్యమ పార్టీగా ఆ వివరాలు భారత రాష్ట్ర సమితి వద్దే ఉంటాయి. కావాలి అంటే జేఏసీ సంఘాలను అడిగినా ఇస్తాయి… ఈ విషయంలో ప్రభుత్వం తీరుపై ఉద్యమకారులు మండిపడుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మహత్య చేసుకున్న వారి ఇళ్లకు వెళ్లి, ఫోటోలు దిగి, ఆ జాబితా మొత్తాన్ని పుస్తక రూపంలోకి తెచ్చి అప్పటి కేంద్ర ప్రభుత్వానికి పంపిన నేతలకు అవన్నీ గుర్తుకు రావడం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. కాగా ప్రత్యేక రాష్ట్రం కోసం 2009, 2010, 2011 లో ఎక్కువ ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి. వీరిలో ఎక్కువగా ఉమ్మడి వరంగల్, జిల్లా చెందిన యువత ఎక్కువగా ఉన్నారు. ఉద్యమ సమయంలోని గణాంకాల ప్రకారం రాష్ట్రం కోసం 1,318 మందికి పైగా ఆత్మహత్య చేసుకున్నారు.
ఇక రాష్ట్ర సాధనకు సంబంధించి తన బిడ్డలు తృణప్రాయంగా ప్రాణాలు వదిలినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆమరణ కుటుంబాలు చెబుతున్నాయి. వానికి అమరుల కుటుంబాలకు సహాయమూ పూర్తిస్థాయిలో అందలేదు. ఇది అంశంపై రాష్ట్ర ప్రభుత్వం జూన్ 3న యాదాద్రి జిల్లా భువనగిరి జిల్లాలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నప్పటికీ అమరుల కుటుంబాల్లో మాత్రం సంతోషం లేదన్నారు. అమరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలు మొత్తం ప్రభుత్వం అమలు చేయాలని కోరుతూ ఆమె కలెక్టర్ కు ఒక వినతిపత్రం ఇచ్చారు.. హైదరాబాదులో అమరవీరుల కాలనీ నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇక తెలంగాణ స్మారక చిహ్నం నిర్మాణానికి 2017 లో శంకుస్థాపన చేస్తే అది పూర్తయ్యేందుకు ఆరు సంవత్సరాలు పట్టింది. తెలంగాణ ఏర్పాటు అనంతరం రాష్ట్ర సాధన కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకోవాలని ఉద్దేశంతో అన్ని జిల్లాల్లో స్మృతి వనాలు నిర్మించాలని కేసీఆర్ అప్పట్లో నిర్ణయించారు. కానీ ఇప్పటికీ పూర్తిస్థాయిలో స్మృతి వనాల నిర్మాణాలు పూర్తి కాలేదు. ఇక దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్న తెలంగాణ ప్రభుత్వానికి సికింద్రాబాద్ లోని క్లాక్ టవర్ వద్ద ఉన్న 1969 నాటి అమరుల స్థూపం గుర్తుకు లేకపోవడం గమనార్హం. దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో నాటి క్లాక్ టవర్ అమరుడు స్తూపం కనీసం నివాలికి నోచుకోలేదు. దీంతోపాటు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ అమరుల స్థూపం పైనా సర్కార్ శీతకన్ను వేసింది.