TTD EO Son Passed Away: తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి ఇంట విషాదం. ఆయన కుమారుడు చంద్రమౌళి రెడ్డి మృతిచెందారు. మరో ఐదు రోజల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఈ నవ వరుడు అకాల మృతితో ధర్మారెడ్డి కుటుంబంలో అంతులేని విషాదాన్నినింపింది. తిరుమలలో చంద్రమౌళి రెడ్డి పెళ్లికి కుటుంబసభ్యులు గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నారు. వివాహ ఆహ్వాన పత్రికలు కూడా అందించారు. ఇంతలోనే చంద్రమౌళిరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటుతో చెన్నై ఆస్పత్రిలో చేరారు. గత మూడు రోజులుగా ఆయన్ను కాపాడేందుకు కావేరి ఆస్పత్రి వైద్యులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. హార్ట్ అటాక్ రావడంతో మల్లిఫుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అయినట్టు డాక్టర్లు ప్రకటించారు. చివరకు ఎక్మో ఆధారిత చికత్స అందించినా ఫలితం లేకపోయింది.

ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి వయసు 28 సంవత్సరాలు. ఆయన కొంతకాలంగా ముంబాయిలో ఉంటున్నారు. సివిల్స్ కు శిక్షణ పొందుతున్నారు. గత జూన్ లో నిశ్చితార్థ వేడుకలను తిరుమలలో ఘనంగా నిర్వహించారు. చెన్నైకు చెందిన వివాదాస్పద పారిశ్రామికవేత్త శేఖర్ రెడ్డి కుమార్తెను చంద్రమౌళి రెడ్డి వివాహం చేసుకోవాల్సి ఉంది. 26న వివాహానికి నిర్ణయించారు. వివాహానికి సంబంధించి ఆహ్వాన పత్రికలు అందిస్తున్న సమయంలోనే చంద్రమౌళి రెడ్డి హార్ట్ అటాక్ వచ్చినట్టు తెలుస్తోంది.

టీటీడీ ఈవో ధర్మారెడ్డి వైఎస్ కుటుంబానికి అత్యంత విధేయుడు. ఎక్కడో రక్షణ రంగంలో ఉన్న ధర్మారెడ్డిని పట్టుబట్టి మరీ జగన్ టీటీడీ ఈవోగా నియమించినట్టు ప్రచారం జరిగింది. నాటి వైఎస్ నుంచి నేడు జగన్ వరకూ ఎక్కడో రక్షణ రంగంలో ఉండే ధర్మారెడ్డిని డిప్యూటేషన్ పై తిరుమలకు తెచ్చి ఈవోగా బాధ్యతలు కట్టబెడుతుంటారు. ప్రస్తుతం ఆయనకు ఎటువంటి కేడర్ లేకపోయినా ఈవోగా మాత్రం కొనసాగుతున్నారు. కుమారుడి అకాల మరణాన్ని ధర్మారెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. సీఎం నుంచి మంత్రుల వరకూ, వైసీపీ కీలక నాయకులు ధర్మారెడ్డికి సంతాపం తెలుపుతున్నారు.