
Ramoji Rao -Undavalli Arun Kumar: రామోజీరావు మార్గదర్శి పై 17 ఏళ్ల పాటు పోరాటం కొనసాగిస్తున్న ఉండవల్లి అరుణ్ కుమార్.. సుప్రీంకోర్టు వేదికగా నట్లు మరింత గట్టిగా బిగించారు.. పదేపదే మేము డిపాజిటర్లను మోసం చేయలేదని చెప్తున్న రామోజీరావు అండ్ కో ను అదే రూట్ లో వచ్చి ఉండవల్లి దెబ్బ కొట్టారు. సుప్రీంకోర్టులో మంగళవారం మార్గదర్శి కేసు విచారణకు వచ్చిన సందర్భంగా ఉండవల్లి అరుణ్ కుమార్ పలు కీలక విషయాలు తెరపైకి తీసుకొచ్చారు.. దీంతో మార్గదర్శి యాజమాన్యం నీళ్లు నమలాల్సి వచ్చింది.
“ప్రజలనుంచి వసూలు చేసిన డిపాజిట్లను ఏం చేశారు? చందా దారులకు ఏ రూపంలో చెల్లించారు? ఒక చోట హెచ్ యూ ఎఫ్ అన్నారు, మరో చోట ప్రోప్రైటరీ అని రాశారు? ఇంకొక చోట చెక్ రూపంలో ఇచ్చాం అని పేర్కొన్నారు..ఇందులో ఏది సరైంది? చందాదారుల నుంచి డబ్బులు వసూలు చేసి రిస్క్ ఎక్కువగా ఉండే స్టాక్ మార్కెట్లో, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే అధికారం మీకు ఎవరిచ్చారు? సంస్థ లాభాలు ఉంది అనుకున్నప్పుడు బ్యాలెన్స్ షీట్ ఎందుకు చూపించడం లేదు? కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వేర్వేరు రాష్ట్రాలు అయినప్పుడు.. ఆ మూడు రాష్ట్రాల్లో వసూలు చేసిన డిపాజిట్లను తెలంగాణ ఖాతాకు ఎందుకు మళ్ళిస్తున్నారు” అనే విషయాలపై ఉండవల్లి మార్గదర్శి తరపు లాయర్ తో వాదించారు.. అయితే ఉండవల్లి వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది..
మార్గదర్శి కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లీడ్ కావడం, ఈ కేసు దర్యాప్తునకు సిఐడి బృందాన్ని నియమించడంతో అసలు విషయాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. సిఐడి విచారణ జరిపినప్పుడు రామోజీరావు, శైలజ మాట్లాడిన మాటలను కూడా సుప్రీంకోర్టు ముందు ఉంచినట్టు తెలుస్తోంది. అంతేకాదు సుప్రీంకోర్టు కూడా మార్గదర్శి యాజమాన్యాన్ని పలు ప్రశ్నలు అడిగింది.. చందాదారుల నుంచి మొత్తం ఎంత వసూలు చేశారు? వారికి ఏ రూపంలో నగదు తిరిగి ఇచ్చారు? సంస్థకు సంబంధించిన బ్యాలెన్స్ షీట్ ఏది? అని ప్రశ్నించింది. ఉండవల్లి చేసిన వాదనతో ఏకీభవించింది..

అయితే సుప్రీంకోర్టు ఒక్కసారిగా ప్రశ్నలు అడగడంతో మార్గదర్శి తరఫు లాయర్ నీళ్లు నమిలినట్టు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఇన్నాళ్లు తాము డిపాజిటర్లను మోసం చేయలేదని మార్గదర్శి యాజమాన్యం చెప్పుకుంటూ వస్తోంది. కానీ ఇక్కడ అసలు లేవనెత్తుతున్న ప్రశ్న అది కాదు. “డిపాజిటర్ల దగ్గర వసూలు చేసిన డబ్బును ఏం చేస్తున్నారని? రేపు ఒకవేళ జరగరానిది జరిగితే చందాదారుల సొమ్ముకు ఎవరు బాధ్యత వహిస్తారని, కేంద్ర ఫైనాన్స్ చట్టాన్ని ఎందుకు పాటించడం లేదని” ఈ ప్రశ్నలే ప్రభుత్వం అడుగుతోంది. వీటి మీదే గత 17 సంవత్సరాలుగా ఉండవల్లి అరుణ్ కుమార్ న్యాయపోరాటం చేస్తున్నారు. అయినప్పటికీ రామోజీరావు డొంకతీరుడు వ్యవహారాన్నే ఎంచుకుంటున్నారు..ఇదే ఇప్పుడు ఆయనకు పెద్ద తలనొప్పిగా మారింది.. ఈ కేసులో ఏమవుతుందో తెలియదు గానీ.. ప్రస్తుతానికి అయితే ఉండపల్లి అరుణ్ కుమార్ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించడం.. కొత్త పరిణామాలకు దారి తీస్తోంది.