
Margadarsi Case: బండి సంజయ్ జైలుకు వెళ్లడం వల్ల ఈ వార్తకు అంత ప్రాధాన్యం దక్కలేదు కానీ.. ఒక్క సాక్షి మాత్రమే బొంబాట్ చేసేసింది.. ఏంటయ్యా అంటే.. మార్గదర్శి చిట్ ఫండ్స్ లో అక్రమంగా డిపాజిట్లు వసూలు చేశారని, ఆ డిపాజిట్లను ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులుగా పెట్టారని, రిజర్వ్ బ్యాంక్ నిబంధనలను, చిట్ ఫండ్ చట్టాలను అతిక్రమించి డిపాజిట్లు వసూలు చేశారని ఏపీలోని జగన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. సిఐడి వింగ్ కూడా అలానే మాట్లాడుతోంది.
అంతేకాదు ఏపీ సిఐడి రామోజీరావును ఓ దఫా విచారించింది. నిన్న అంటే గురువారం మార్గదర్శి ఎండి శైలజను సిఐడి అధికారుల బృందం విచారించింది. సుమారు 6 నుంచి 8 గంటల పాటు ఈ విచారణ సాగింది అని అధికారులు చెబుతున్నారు.. అయితే అధికారులు ఏం అడిగారు? శైలజ ఏం చెప్పారు అనేది స్పష్టంగా తెలియడం లేదు. అయితే దీన్ని పచ్చ మీడియా సాధారణంగానే పట్టించుకోలేదు. ఒక మూలన చిన్న వార్తగా వేసింది. ఇక జగన్ మీడియా అయితే తాటికాయంత అక్షరాలతో బ్యానర్ స్టోరీ వేసేసింది. సరే ఎవరికి అనుకూలంగా వారు రాసుకున్నారు..

కానీ శైలజ విచారణ విషయంలో ఇంట్రెస్టింగ్ గా అనిపించిన పాయింట్ ఒకటి ఉంది. ఎందుకంటే శైలజ భారతికి క్లోజ్ ఫ్రెండ్. ఇద్దరిది కూడా రాయలసీమ ప్రాంతం. ఆమె ఒక విజయవంతమైన వ్యాపారవేత్త.. భారతి కూడా సాక్షి గ్రూప్, భారతి సిమెంట్స్ ను నిర్వహిస్తున్నారు. భారతి, శైలజ మధ్య స్నేహం ఉంది. ఇద్దరు కూడా తరచుగా కలుసుకుంటారు. ఆమధ్య శైలజ చిన్న కూతురు పెళ్లి అయితే జగన్ సతీసమేతంగా వచ్చాడు. అమ్మాయిని ఆశీర్వదించాడు. ఇక శైలజ తో భారతి చాలాసేపు మాట్లాడింది. ఆ మధ్య శైలజ తండ్రి కన్నుమూస్తే భారతి వెళ్లి పరామర్శించింది. కన్నీరు పెట్టుకుంది. భారతి తండ్రి కూడా మరణిస్తే శైలజ వెళ్లి పలకరించింది. బాధ పడకు అంటూ ఓదార్చింది.
మార్గదర్శి వ్యవహారంలో శైలజను సి ఐ డి విచారిస్తోంది. విచారిస్తోంది తన దోస్తును కాబట్టి, తన భర్తకు చెప్పి ఆ విచారణను నిలిపివేయాలని భారతి చెబుతుందని అందరూ భావించారు. కానీ అక్కడ ఉన్నది జగన్ కాబట్టి ఎవరి మాటా వినే పరిస్థితి ఉండదు. అన్నట్టు పెద్ద పెద్ద కుటుంబాల్లో పలకరింపులు అనేవి జస్ట్ స్టేజి వరకే పరిమితం. మిగతా విషయాల్లో ఎవరి పంతాలు, ఎవరి ఈగోలు వారికి ఉంటాయి. మనం చూసుకుంటూ వెళ్ళటమే. ఆ లెక్కకు వస్తే జగన్ మీద ఈనాడు రోజూ విపరీతమైన వార్తలు రాస్తోంది. మరి దాన్ని ఏమైనా నిలువరించే ప్రయత్నం శైలజ చేసిందా? ఇది కూడా వాల్యుబుల్ క్వశ్చనే.. కానీ సమాధానం ఎవరు చెప్పగలరు.. అసలు వారిని ఈ ప్రశ్న ఎవరు అడగగలరు.. పెద్దోళ్ళు కదా.. వాళ్ళు అలాగే ఉంటారు.