Homeఆంధ్రప్రదేశ్‌Margadarshi Chitfund : మార్గదర్శి చిట్స్ అరెస్ట్ లు: రామోజీరావుకు గట్టి షాక్

Margadarshi Chitfund : మార్గదర్శి చిట్స్ అరెస్ట్ లు: రామోజీరావుకు గట్టి షాక్

Margadarshi Chitfund  : మార్గదర్శి చిట్ ఫండ్స్ కు తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలింది. ఏపీ ప్రభుత్వం సాగిస్తున్న విచారణ విషయంలో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన మార్గదర్శి యాజమాన్యానికి టిఎస్ హైకోర్టు వేసిన ప్రశ్నతో ఈ కేసుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ పరిణామం మార్గదర్శి, ఈనాడు చైర్మన్ అయిన రామోజీరావుకు గట్టి ఎదురుదెబ్బగా చెప్పొచ్చు.

మార్గదర్శి చిట్ ఫండ్స్ చైర్మన్ రామోజీరావు పై ఇటీవల ఏపీ సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆ సంస్థ కార్యాలయాలపై గత కొద్ది రోజులుగా విస్తృత దాడులను నిర్వహించిన అనంతరం ఈ మేరకు కేసు పెట్టారు. చిట్ఫండ్ కార్యకలాపాల కోసం రూపొందించిన మార్గదర్శకాలను ఆ సంస్థ యాజమాన్యం ఉల్లంఘించినట్లు తేలడంతో ఈ కేసు నమోదు చేశారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ చైర్మన్ రామోజీరావు, మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్, ఇతర బ్రాంచ్ మేనేజర్ల పేర్లను ఈ కేసులో పొందుపరిచారు. ఈ కేసులో మార్గదర్శి మేనేజర్లను ఏపీ సిఐడి అధికారులు అరెస్టు చేశారు. వారిని న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. ఈనెల 24వ తేదీ వరకు రిమాండ్ కు పంపించింది కోర్టు. సుమారు 400 కోట్ల రూపాయలకు పైగా డిపాజిటర్ల సొమ్మును అక్రమంగా బదలాయించిందనేది మార్గదర్శి యాజమాన్యంపై ఉన్న ప్రధాన ఆరోపణ. రాష్ట్రవ్యాప్తంగా ఈ తనిఖీలు సాయంత్రం వరకు కొనసాగాయి. ఇది వరకు ఏపీ సిఐడి, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తనిఖీలను నిర్వహించారు. అప్పట్లో కేసులేవీ నమోదు కాలేదు. అయితే ఈసారి మాత్రం చైర్మన్ రామోజీరావు మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్, పలు బ్రాంచ్ మేనేజర్లపై కేసు నమోదు చేయడం చర్చినియాంశం అవుతోంది. ఐపీసీ సెక్షన్ 120 (బి), 409, 420, 477 (ఏ), రెడ్ విత్ 34 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, నరసరావుపేట, గుంటూరు, అనంతపురం బ్రాంచ్ ల్లో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ఏపీ సిఐడి అధికారులు నిర్ధారించినట్లు తెలుస్తోంది.

-2006లో కేసు వేసిన ఉండవల్లి..

మార్గదర్శి చిట్ ఫండ్స్ పై తొలిసారిగా 2006లో అప్పటి రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కేసు వేశారు. ఈ కేసును హైకోర్టు 2014లో కొట్టి వేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్ 2020లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ అయింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీడ్ అయిన తర్వాత కేసు విచారణ జోరుగా సాగుతోంది. సిఐడి అధికారులతో పాటు పలు శాఖలకు చెందిన అధికారులు చిట్ ఫండ్ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున తనిఖీలను నిర్వహించారు. అయితే ఈ తనిఖీలపై మార్గదర్శి యాజమాన్యం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఇది ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏపీ సిఐడి నమోదు చేసిన కేసుపై దర్యాప్తు నిలిపివేయాలని కోరుతూ హైకోర్టును మార్గదర్శి యాజమాన్యం ఆశ్రయించింది. రామోజీరావు, శైలజ పై చర్యలు తీసుకోకుండా ఏపీ సిఐడిని ఆదేశించాలంటూ ఈ పిటిషన్ లో పొందుపరిచింది. దీనిపై తెలంగాణ హైకోర్టు స్పందించింది. ఏపీలో సిఐడి అధికారులు తనిఖీలు చేస్తుంటే ఇక్కడ పిటిషన్ ఎందుకు వేశారు అంటూ మార్గదర్శి న్యాయవాదని హైకోర్టు ప్రశ్నించింది. ఏపీలో సోధాలు జరిగితే తెలంగాణ హైకోర్టు కు సంబంధం ఏమిటని ప్రశ్నించింది. తెలంగాణ హైకోర్టు తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఈ కేసు పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మీడియా మొఘల్ గా పేరుగాంచిన రామోజీరావు వ్యవహారం కావడంతో అన్ని వర్గాలు ఈ కేసు పైన ప్రత్యేకంగా దృష్టి సారించి ఎప్పటికప్పుడు వివరాలను తెలుసుకుంటున్నారు. బాగా తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఈ కేసు పై మరింత ఆసక్తి పెరిగింది.

RELATED ARTICLES

Most Popular