ఆఖరుకు ఇటీవల తెలంగాణలో చర్చనీయాంశమైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను కూడా మావోయిస్టులు వదిలిపెట్టలేదు. ఎక్కడో అడవుల్లో ఉండే వీరు సైతం తెలంగాణ రాజకీయాలను అవపోసన పట్టడం విశేషంగా మారింది. కమ్యూనిస్టు అయిన ఈటల బీజేపీలో చేరడంపై ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈటల బీజేపీలో చేరే క్రమంలో ఢిల్లీలో జరిగిన పరిణామాలు పేర్కొంటూ ఆయనకు అవమానం జరిగిందని చర్చ మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో టీఆర్ఎస్ భావాజాలంతో ఉన్న వారితో ఈ కోణంలో పెద్ద చర్చ జరుపుతున్నారు. ఇప్పటికే వస్తున్న ఈ విమర్శలకు తాజాగా మావోయిస్టుల కామెంట్లు తోడవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈటల రాజేందర్ కు తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో విడుదలైన లేఖ సంచలనమైంది. ఈటల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం తీవ్రంగా విరుచుకుపడ్డారు. తెలంగాణ మావోయిస్టు పార్టీ ఈటల నిర్ణయాన్ని ఖండించింది. తన ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేస్తూ కేసీఆర్ ఫ్యూడల్ పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడాతనని చెప్పి హిందుత్వ పార్టీ అయిన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారని ఫైర్ అయ్యారు.
ఈటల తీసుకున్న ఈ నిర్ణయాన్ని తెలంగాణలోని ప్రజలు ప్రజాస్వామిక వాదులు వ్యతిరేకిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు కేసీఆర్‌కు ఈటల రాజేందర్‌కు మధ్య జరుగుతున్న వ్యవహారం అని పేర్కొన్న మావోయిస్టు నేత జగన్ వారిద్దరూ ఒకే గూటి పక్షులు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ బర్రెలు తినేవాడు అయితే ఈటల గొర్రెలు తినే ఆచరణ కొనసాగించాడని పేర్కొన్నారు.
తెలంగాణ కేబినెట్ నుంచి ఈటల రాజేందర్ ను కేసీఆర్ తొలగించారు. అనంతరం ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చకచకా జరిగిపోయాయి. వివిధ పార్టీల నాయకులతో ఆంతరంగిక మంతనాలు నిర్వహించిన ఆయన చివరకు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.. ఈటల బీజేపీలో చేరడంపై విమర్శల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆయన సైద్దాంతిక సహచరులు అయిన మావోయిస్టులు కూడా ఈటల తీరుపై మండిపడడం విశేషంగా మారింది.