Homeజాతీయ వార్తలుMaoist Attack Chhattisgarh: మావోల మరో మారణహోమం.. 11 మంది మరణం వెనుక నిర్లక్ష్యం

Maoist Attack Chhattisgarh: మావోల మరో మారణహోమం.. 11 మంది మరణం వెనుక నిర్లక్ష్యం

Maoist Attack Chhattisgarh: చాలా రోజులుగా అదును కోసం చూస్తున్న మావోయిస్టులకు పోలీసుల నిర్లక్ష్యం తోడైంది. కూంబింగ్‌ కోసం అడవిలోకి వెళ్లిన పోలీసులు తిరుగు ప్రయాణంలో కాస్త అలక్ష్యంగా కార్యాలయానికి బయల్దేరారు. చిన్నపాటి ఏమరుపాటుకు 11 మంది ప్రాణాలను మూల్యంగా చెల్లించుకోవాల్సి వచ్చింది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు విసిరిన పంజాకు 11 మంది దుర్మరణం చెందారు. మినీ బస్సును పేల్చడంతో పది మంది పోలీసులు, ఒక డ్రైవర్‌ దుర్మరణం చెందారు. మృతులంతా డీఆర్‌జీ(డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌) విభాగానికి చెందిన పోలీసులుగా గుర్తించారు.

కూంబింగ్‌ నిర్వహించి వస్తుండగా..
దంతేవాడ జిల్లాలోని అరన్‌పూర్‌ సమీపంలో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు మినీ బస్సులో కూంబింగ్‌ కోసం వెళ్లారు. ఈ సందర్భంగా పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు కూడా జరిగినట్లు సమాచారం. అయితే ఉదయమే అడవిలోకి వెళ్లిన పోలీసులు తిరిగి వస్తుండగా, పక్కా సమాచారంతో (డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌) సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనం పేల్చేందుకు ఐఈడీ అమర్చినట్లు తెలుస్తోంది. వాహనం టార్గెట్‌కు రాగానే.. ఒక్కసారిగా పేల్చేశారు.

తునాతునకలైన బస్సు..
ఐఈడీ పేల్చడంతో దాని ధాటికి పోలీసులు ప్రయాణిస్తున్న మినీ బస్సు తునాతునకలైంది. వాహనం సుమారు 5 మీటర్ల ఎత్తుకు ఎగిరి పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న పది మంది పోలీసులతోపాటు, వాహనం డ్రైవర్‌ కూడా దుర్మరణం చెందాడు. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఘటన జరిగి ప్రాంతం దంతేవాడ జిల్లా అరన్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉంది.

అదును చూసి..
ఆంధ్రా, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న బీజాపూర్, జగదల్పూర్, దంతెవాడ, సుకుమా జిల్లాలు మావోయిస్టులకు పెట్టనికోటగా ఉంటున్నాయి. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో మావోయిస్టుల అలజడి తగ్గింది. అయితే అదును కోసం చూస్తున్న మావోయిస్టులుకు జీఆర్డీ పోలీసుల నిర్లక్ష్యం తోడైంది. ఇదే అవకాశంగా భావించిన మావోయిస్టులు పోలీసులను తప్పుదోవ పట్టించి పేలుడుకు ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది.

వదిలిపెట్టమన్న సీఎం..
ఈ ఘటనపై స్పందించిన ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌బఘేల్‌ స్పందించారు. దీనిపై తమకు సమాచారం అందిందని.. ఇది విచారకరమని వ్యాఖ్యానించారు. వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఘటనపై ఆరా తీశారు. మావోయిస్టులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని హెచ్చరించారు. నక్సలిజాన్ని రూపుమాపుతామన్నారు. ఈ పోరాటం చివరి దశలో ఉందని పేర్కొన్నారు.

అమిత్‌షా ఆరా..
మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కూడా ఛత్తీస్‌గఢ్‌ ఘటనపై ఆరా తీశారు. మావోయిస్టుల దాడిలో చనిపోయిన పోలీసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈమేరకు ముఖ్యమంత్రి భూపేష్‌ బఘేల్‌తో మాట్లాడారు. విధాలా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మృతిచెందిన పోలీసుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular