Karnataka Elections- Tollywood Heroes
Karnataka Elections- Tollywood Heroes: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఎన్నికల నగారా మోగింది. ప్రధాన పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తుంటే.. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా లోక్ సభ ఎన్నికలకు మార్గం సుగమం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను సాధించి కింగ్ మేకర్ గా అవతరించాలని జెడిఎస్ ఆశపడుతోంది. ఎవరి ఎన్నికల వ్యూహాల్లో వారు ఉండగా.. మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తున్న బిజెపి మాత్రం తెలుగు సినిమా స్టార్లపై భారీగా ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.
2024 లోక్ సభ ఎన్నికలకు సరిగ్గా ఏడాది సమయం ఉండగా.. కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఈ ఎన్నికల్లో విజయం ద్వారా వచ్చే లోక్ సభ ఎన్నికలకు రూట్ క్లియర్ చేసుకోవాలని బిజెపి, కాంగ్రెస్ పార్టీలు భావిస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల నాటికి దక్షిణాది రాష్ట్రాల్లో బలమైన శక్తిగా ఆవిర్భవించి ఎక్కువ సీట్లు సాధించాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఈ ఎన్నికల్లో వచ్చే విజయ ఉత్సాహంతో మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో భారీగా సీట్లు సాధించవచ్చని భావిస్తోంది బిజెపి. ఇందుకోసం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ హీరోల ఇమేజ్ ను ఈ ఎన్నికల్లో వాడుకోవాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది.
గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ వాతావరణం..
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గనుక విజయం సాధిస్తే వచ్చే లోక్ సభ ఎన్నికల సమయానికి కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా పాజిటివ్ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఉన్న అధికారాన్ని కోల్పోవడం అంటే పూర్తిగా భారతీయ జనతా పార్టీ వైఫల్యంగానే భావించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో బిజెపి అగ్రనాయకత్వం అడుగులు వేస్తుంది. ఇందుకోసం ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని భారతీయ జనతా పార్టీ విడిచిపెట్టడం లేదు. ఒకపక్క ప్రచారాన్ని ప్రారంభించిన బిజెపి.. మరోపక్క మరిన్ని ఎక్కువ ఓట్లు సాధించేందుకు ఉన్న అవకాశాల పైన ఎక్కువ దృష్టి సారించి ఆ దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే తెలుగు సినీ ఇండస్ట్రీలో దిగజ నటులుగా పేరుగాంచిన వారి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తుంది బిజెపి.
తెలుగు హీరోలకు ప్రణాళిక ప్రకారమే ప్రాధాన్యం..
గత కొద్ది నెలలుగా పరిశీలిస్తే భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం తెలుగు సినిమా హీరోలకు అత్యధిక ప్రాధాన్యాన్ని ఇస్తున్నారు. ఆ మధ్య తెలంగాణ పర్యటనకు వచ్చిన అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ తో సమావేశం అయ్యారు. అనంతరం కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక రత్న అవార్డును కర్ణాటక ప్రభుత్వం అందించింది. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం.. రాష్ట్ర అతిథిగా ఎన్టీఆర్ కి గౌరవం కల్పించింది. ఆ తర్వాత తారకరత్న బెంగళూరులో చికిత్స పొందుతున్న సమయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ వచ్చినప్పుడు నేరుగా ఆ రాష్ట్ర మంత్రి వెళ్లి ఆయనతో పాటు ఉండి ఆసుపత్రిలో పరిస్థితిని తెలుసుకొని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అలాగే ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ అవార్డు వచ్చిన సందర్భంగా హోం మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసింది. తాజాగా హోం మంత్రి అమిత్ షా చిరంజీవి, రామ్ చరణ్ తో సమావేశమై వారిని అభినందించారు. ఇవన్నీ ప్రణాళిక ప్రకారమే బిజెపి నాయకులు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, రామ్ చరణ్, ప్రభాస్, పవన్ కళ్యాణ్ వంటి హీరోలతో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి అనుకూలంగా ప్రచారం చేయించుకోవాలని బిజెపి అగ్రనాయకత్వం భావిస్తోంది. అందులో భాగంగానే వారికి గత కొన్నాళ్లుగా అధిక ప్రాధాన్యాన్ని ఇస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ప్రభాస్ తోను బిజెపి నాయకులు సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలిసింది. గతంలో ప్రభాస్ బాబాయ్ కృష్ణంరాజు బిజెపి నుంచి ఎంపీగా పనిచేశారు. బిజెపిలో ఎప్పటికీ అగ్ర నాయకులతో ప్రభాస్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీనిని పెట్టుకొని ఆయనతో ప్రచారాన్ని చేయించాలని బిజెపి నాయకులు భావిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో బిజెపి పొత్తులో ఉంది. ఈ పొత్తులో భాగంగానే కర్ణాటకలోనూ పవన్ కళ్యాణ్ తో ప్రచారాన్ని చేయించుకోవాలని బిజెపి నాయకులు భావిస్తున్నారు.
భారీగా అభిమాన గణం..
తెలుగు సినిమా టాప్ హీరోలకు భారీగా కర్ణాటకలో అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా బళ్లారి, మైసూర్ తో పాటు అనేక ప్రాంతాల్లో తెలుగు ప్రజలు ఇక్కడ భారీ సంఖ్యలో నివాసం ఉంటున్నారు. వీరంతా తెలుగు సినిమా హీరోలను ఆరాధిస్తుంటారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి హీరోలకు ఇక్కడ అధిక సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఆయా అగ్ర తారల అభిమానుల ఓటులను కొల్లగొట్టాలంటే వారితో ప్రచారం చేయించడం ద్వారా సాధ్యమవుతుందని బిజెపి భావిస్తోంది. ఇందుకోసమే బిజెపి అగ్రనాయకత్వం వారిని ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉంది. ఇప్పటికే రామ్ చరణ్, చిరంజీవి వద్ద బిజెపి అధిష్టానం ప్రచారం చేయాలన్న ప్రతిపాదనను పెట్టింది. అలాగే ప్రభాస్ తో బిజెపి ముఖ్య నాయకులు చర్చలు జరిపారు.
Karnataka Elections- Tollywood Heroes
60 నుంచి 65 నియోజకవర్గాల్లో ప్రభావం..
కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో 60 నుంచి 65 అసెంబ్లీ తెలుగు ప్రజలు గెలుపును ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. ముఖ్యంగా బళ్లారి, బీదర్ బరంపూర్, మైసూర్, బెంగళూరు సిటీ, బెంగళూరు రూరల్ పరిధిలోని అనేక నియోజకవర్గాల్లో తెలుగు ప్రజలు భారీ సంఖ్యలో ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లో ఎక్కువ సీట్లు సాధించాలంటే ఇక్కడ ప్రజలు ఆరాధించే సినీ తారలను ప్రచారంలోకి దించాలని బిజెపి భావిస్తోంది. అయితే బిజెపి అధిష్టానం ఆయా సినీ తారలను నేరుగా ప్రచారం చేయాలని కోరుతున్నప్పటికీ అది ఎంతవరకు సాధ్యపడుతుందన్నది తెలియడం లేదు. ఇందుకు ఆయా నటులు ఎంతవరకు అంగీకరిస్తారని చూడాల్సి ఉంది. నేరుగా వచ్చి ప్రచారం చేసేందుకు కాకపోయినా కనీసం ట్వీట్లు ద్వారా అయినా బిజెపికి సహకరించాలని ఆయా సినీ తారలు కోరేలా చేయాలన్నది బిజెపి నాయకులు వ్యూహం. అయితే దీనికి కూడా ఎంతవరకు ఆయా నటులు అంగీకరిస్తారని చూడాల్సి ఉంది. నేరుగా క్యాంపెయిన్ చేసి బిజెపి విజయానికి సహకరిస్తారా..? లేకపోతే ట్వీట్లు ద్వారా బిజెపికి అండగా ఉండాలని కోరుతారా..? సైలెంట్ గా ఉండిపోతారా అన్నది కొద్ది రోజుల్లోనే తేలనుంది.