
MLA Redya Naik: హిందీ ప్రశ్న పత్రం లీక్ కేసుకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా రగడ జరుగుతున్న నేపథ్యంలో.. ఈ విషయాన్ని పక్కన పెట్టి..మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కురవి మండలం అయ్యగారి పల్లి గ్రామంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం లో ఆయన భారత రాష్ట్ర సమితి నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో ఇంటి దొంగలు ఉన్నారని, వారితో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.” నేను ఎప్పుడు చస్తానా అని అనుకుంటున్నారు.. నా చావు కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో నా ఓటమి కోసం వాళ్లు పని చేశారు. ఇప్పుడు కూడా అదే పని చేస్తారు” అని రెడ్యా నాయక్ పైర్ అయ్యారు. కొందరు వ్యక్తులు పార్టీ పేరు చెప్పుకొని లక్షలకు లక్షల సంపాదిస్తున్నారు, అలాంటి వారిని కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలని రెడ్యా కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
వచ్చే ఎన్నికల్లో నా ఓటమి కోసం ఆమె వర్గీయులు కచ్చితంగా ప్రయత్నాలు చేస్తారని మంత్రి సత్యవతి రాథోడ్ ను ఉద్దేశించి రెడ్యా నాయక్ కీలక వ్యాఖ్యలు చేశారు.. గతంలో సత్యవతి రాథోడ్ మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయని రెడ్డి నాయక్.. ఈమధ్య ఆమె పేరు ప్రస్తావించకుండా ఆమె వర్గాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతున్న మాటలు భారత రాష్ట్ర సమితిలో ఉన్న వర్గ పోరును తెరపైకి తీసుకొస్తున్నాయి.. అయితే ఈసారి డోర్నకల్ టికెట్ సత్యవతి రాథోడ్ కు ఇస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రెడ్యానాయక్ ఈ వ్యాఖ్యలు చేస్తుండటం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.
ఇక గతంలో కూడా డోర్నకల్ నియోజకవర్గంలో రెడ్యానాయక్, మంత్రి సత్యవతి రాథోడ్ వర్గీయుల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ కేసులు పోలీస్ స్టేషన్ల దాకా కూడా వెళ్లాయి. ఇక ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపికలోనూ ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.. అయితే ఈసారి రెడ్యానాయక్ గెలవడం కష్టమని సర్వేలో తేలడంతో.. ఆయనను ముఖ్యమంత్రి దూరం పెడుతున్నారని తెలిసింది. అయితే ఇదే క్రమంలో సత్యవతి తనకున్న పరిచయాల ద్వారా వచ్చే ఎన్నికల్లో టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది..

అయితే ఈ సంకేతాలు రెడ్యానాయక్ అందాయో లేదా మరి ఏమిటో తెలియదు గానీ.. కొంతకాలంగా ఆయన నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని తిరుగుతున్నారు. కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. సమయం దొరికినప్పుడల్లా సత్యవతి రాథోడ్ మీద పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న గాక మొన్న వచ్చిన వారు ఏం చేయగలరు అని ప్రశ్నిస్తున్నారు. అయితే గతంలో 2009లో సత్యవతి రాథోడ్ తెలుగుదేశం పార్టీ తరఫున డోర్నకల్ నియోజకవర్గంలో రెడ్యానాయక్ మీద ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత 2014లో రెడ్యానాయక్ ఆమెను ఓడించారు. ఇక అప్పటినుంచి ఇరు వర్గాల మధ్య ఉప్పు నిప్పులాగా వ్యవహారం కొనసాగుతోంది. మరోవైపు రెడ్యానాయక్ భారత రాష్ట్ర సమితిలో చేరిన నేపథ్యంలో.. సత్యవతి రాథోడ్ కూడా అదే పార్టీలో చేరారు. తనకు ఉన్న పరిచయాల ద్వారా ఏకంగా ఎమ్మెల్సీగా గెలుపొంది.. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.