Gujarat: పులి అనే పేరు వినిపిస్తేనే మనకు వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది పులి అతడి ఎదురుగా వచ్చింది. చూస్తుండగానే అతడి కొడుకు మీద దాడి చేసింది. ఆ సమయంలో అతడి స్థానంలో మరొకరు గనుక ఉండి ఉంటే ఏం జరిగేదో తెలియదు గాని.. అతడు మాత్రం ధైర్యంగా ముందడుగు వేశాడు. ఏకంగా చిరుత పులితో పోరాడాడు.
మనదేశంలో దట్టమైన అడవులు ఉన్న రాష్ట్రాలలో గుజరాత్ ఒకటి. గుజరాత్ రాష్ట్రంలోని గిర్ సోమనాథ్ జిల్లా దట్టమైన అడవులకు ప్రసిద్ధి. ఇక్కడ క్రూరమైన జంతువులు అనేకం ఉంటాయి. ఈ జిల్లాలో బాబు భాయ్ అనే వ్యక్తి తన కుటుంబంతో నివసిస్తూ ఉంటాడు. ఇతడికి శార్దూల్ అనే 27 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. ఇటీవల బాబు భాయ్ ఇంట్లో ఉండగా ఒక్కసారిగా చిరుత పులి ప్రవేశించింది. అతడు చూస్తుండగానే శార్దూల్ మీద దాడికి ప్రయత్నించింది. 60 సంవత్సరాల వయసు అయినప్పటికీ బాబు భాయ్ ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. చిరుతపుడితో పోరాడాడు. తన పక్కనే ఉన్న ఈటె తో చిరుతపులిని కొట్టాడు. అప్పటికి అది ఆగకపోవడంతో పదునైన కొడవలితో దాడి చేశాడు. దీంతో చిరుత పులి అక్కడికక్కడే చనిపోయింది.
బాబు భాయ్ కుటుంబం వ్యవసాయం చేస్తూ జీవిస్తూ ఉంటుంది. అయితే గిర్ సోమనాథ్ జిల్లాలో అడవులు ఎక్కువగా ఉంటాయి. ఇటీవల కాలంలో క్రూర మృగాలు ఇళ్లల్లోకి ప్రవేశిస్తున్న ఉదంతాలు పెరిగిపోతున్నాయి. అందువల్ల ప్రాణ భయంతో ప్రజలు వాటిని ఎదుర్కోవడానికి వస్తువులు తమ ఇళ్లల్లో అందుబాటులో ఉంచుకుంటున్నారు. బాబు భాయ్ కుటుంబం కూడా అలానే వస్తువులను ఇంట్లో పెట్టుకుంది. అయితే వారు ఊహించని విధంగా చిరుత పులి ఇంటిలోకి ప్రవేశించడం.. శార్దూల్ పై దాడి చేయడంతో బాబు భాయ్ చిరుత పులి ని ఈటె, కొడవలితో కొట్టాడు. దీంతో ఆ చిరుత పులి చనిపోయింది.
వాస్తవానికి క్రూరమైన మృగాలు దారుణంగా దాడులు చేస్తుంటాయి. ముఖ్యంగా మనుషుల మీద తీవ్రమైన కోపాన్ని కలిగి ఉంటాయి. ఆ సమయంలో సాధ్యమైనంతవరకు ప్రాణ రక్షణ కోసం మనుషులు తాపత్రయపడుతుంటారు. అయితే మనుషులు ఆత్మరక్షణకు పాల్పడే అవకాశాన్ని క్రూర మృగాలు ఇవ్వవు. చూస్తుండగానే దాడి చేసి చంపేస్తాయి. అయితే బాబు భాయ్ మాత్రం అత్యంత చాకచక్యంగా చిరుత పులి మీద దాడి చేసి చంపేశాడు. ఫలితంగా తన కుమారుడిని కాపాడుకున్నాడు. చిరుత పులి దాడి చేయడంతో శార్దుల్ గాయపడ్డాడు. బాబు భాయ్ కూడా గాయాల బారిన పడ్డాడు. ప్రస్తుతం వీరిద్దరూ అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.