Homeజాతీయ వార్తలుViral News : పాములు ఇతన్ని పగ పట్టాయి.. 40 రోజుల వ్యవధిలో ఎన్నిసార్లు కాటు...

Viral News : పాములు ఇతన్ని పగ పట్టాయి.. 40 రోజుల వ్యవధిలో ఎన్నిసార్లు కాటు వేశాయంటే..

Viral News : ఈ భూమ్మీద విషపూరితమైన జంతువులలో పాములు ముందు వరుసలో ఉంటాయి. మాంసాహారులుగా పేరుపొందిన పాములు.. తమకు ఏమాత్రం హాని కలిగించినా పగపడతాయి. ప్రత్యర్థి మీద అదును చూసి దాడి చేస్తాయి. ఈ సమయంలో తమ కోరల్లోని విషాన్ని విడుదల చేస్తాయి. పాము విషంలో అత్యంత ప్రమాదకరమైన టాక్సిన్లు ఉంటాయి కాబట్టి.. ప్రత్యర్థి వెంటనే కన్నుమూస్తుంది. వెనుకటి రోజుల్లో పాము కాటు వేస్తే మంత్రాలు వేసేవాళ్ళు. వైద్య పరిజ్ఞానం పెరిగిన తర్వాత పాము కాటు వేస్తే వైద్య చికిత్స అందిస్తున్నారు. అయితే ఒక్కోసారి విషం తీవ్రత అధికమైతే ప్రాణాపాయం సంభవిస్తుంది..

సాధారణంగా పాములు పిరికి జంతువులు. ప్రత్యర్థులను చూడగానే పారిపోతాయి. అయితే ఇందులో కింగ్ కోబ్రా, నాగు పాము, తాచుపాము వంటి జాతులకు ఏదైనా అపాయం తల పెడితే.. లేకుంటే అనుకోకుండా ప్రత్యర్థి ద్వారా వాటికి ఏదైనా ప్రమాదం జరిగితే అవి పగను పెంచుకుంటాయి. సినిమాల్లో చూపినట్టుగానే ప్రత్యర్థిని వెంటాడుతాయి. కసి కొద్దీ కాటేస్తాయి. తమ కోరల్లో విషాన్ని మొత్తం ఒక్కసారిగా ప్రత్యర్థి శరీరంలోకి వదులుతాయి. ఆ సమయంలో ఆ విషం తీవ్రతకు ప్రత్యర్థి స్థానంలో ఉన్న వారు ఎవరైనా సరే ఇబ్బంది పడాల్సిందే. విషం తీవ్రత అధికంగా ఉంటే మాత్రం ప్రాణాలకే ముప్పు వాటిల్లవచ్చు. అయితే ఇప్పుడు మీరు చదవబోయే ఈ కథనంలో ఓ వ్యక్తిని పాములు పగపట్టాయి. సేమ్ సినిమాల్లో చూపించినట్టుగానే అతడిని వెంటాడాయి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆ యువకుడు ద్వారా ఆ పాములకు ఎటువంటి హానీ కలగలేదు.

ఉత్తర ప్రదేశ్ లోని ఫతేపూర్ ప్రాంతంలోని సౌరా అనే గ్రామంలో వికాస్ దూబే అనే యువకుడు ఉన్నాడు.. ఇటీవల వికాస్ కు ఒక కల వచ్చింది. ఆ కలలో ఒకే పాము అతడిని 9సార్లు కాటు వేసింది. పాము కాటు వేయడం వల్ల అతడు చనిపోయినట్టు కలగన్నాడు. అయితే ఆ కలలో జరిగినట్టుగానే అతడి నిజ జీవితంలోనూ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. 40 రోజుల వ్యవదిలో వేరువేరు పాములు అతడిని ఏడుసార్లు కాటు వేశాయి. వాస్తవానికి అన్నిసార్లు కాటు వేసినప్పటికీ అతడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఇటీవల ఏడవ సారి పాము కాటు వేసినప్పుడు, ఆ పాము విషం తీవ్రతకు అతడు ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

“నేను ఏ పాముకూ హాని తలపెట్టలేదు. కనీసం నాకు తెలియకుండా తొక్కను కూడా తొక్కలేదు. అయితే అవి ఎందుకు పగబడుతున్నాయో అర్థం కావడం లేదు. నన్నే లక్ష్యంగా చేసుకొని కాట్లు వేస్తున్నాయి. ఇప్పటివరకు ఏడుసార్లు పాములు నన్ను కాటు వేశాయి. ఇంకో రెండు సార్లు కాటు వేస్తే నా ప్రాణం పోతుంది. చివరిసారి పాము కాటు వేస్తే నాకు ఈ భూమ్మీద నూకలు చెల్లినట్టే.. నాకు కలలో కూడా అదే విధంగా వచ్చింది.. అసలు పాములను చూస్తేనే నాకు భయం వేస్తోంది. కలలో వచ్చినట్టుగానే నా జీవితంలో జరగడం ఆందోళన కలిగిస్తోంది. కలలో పాములు కరిస్తే.. నిజ జీవితంలో కూడా అలానే జరుగుతుందా? మిగతా వారికి ఏమోగానీ నాకైతే.. అది నిజంగా జరుగుతోంది. ఆసుపత్రుల చుట్టూ తిరిగి విసుగు వస్తోందని” వికాస్ వాపోతున్నాడు..

వికాస్ పరిస్థితి చూసి అతడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..”ఏం పాపం మేం ఎరుగం. మా అబ్బాయి కూడా పాములకు హాని తల పెట్టేవాడు కాదు. అయితే వాడిని ఇలా ఎందుకు కరుస్తున్నాయో అర్థం కావడం లేదు. ప్రతిసారి పాము కాటు వేయడం, ఆసుపత్రికి తీసుకెళ్లడం, కొద్దిరోజులపాటు చికిత్స పొందడం, ఆ తర్వాత మళ్లీ పాము కాటు వేయడం.. ఇలా షరా మామూలుగా మా పరిస్థితి మారిపోయింది. మా అబ్బాయికి ఈ పాము కాటు నుంచి ఉపశమనం ఎప్పుడు లభిస్తుందో అర్థం కావడంలేదని” వికాస్ తల్లిదండ్రులు వాపోతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version