Mamata Banerjee: దేశంలో ప్రత్యామ్నాయ కూటమికి అడుగులు పడుతున్నాయి. బీజేపీయేతర, కాంగ్రెసేతర కూటమి రాబోతుందన్న సంకేతాలు వస్తున్నాయి. ఈ కూటమికి వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వం వహిస్తున్నారు. ఈ ఫ్రంట్‌కు ఇప్పటికే బలమైన ప్రాంతీయ పార్టీ ఎస్పీ మద్దతు తెలిపింది. ఈ క్రమంలోనే దేశంలోని పలు పార్టీలతో భేటీ అయి ప్రత్యామ్నాయ కూటమికి మమతా బెనర్జీ చకచకా అడుగులు వేయబోతున్నట్లు తెలుస్తోంది. మూడేళ్ల తర్వాత అనగా 2024లో జరగబోయే పార్లమెంటు ఎన్నికలే టార్గెట్‌గా ఫిక్స్ చేసుకుని ఆ దిశగా మమతా బెనర్జీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ అంశాలపై స్పెషల్ గా ఫోకస్ చేస్తున్నారు.

వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫైర్ బ్రాండ్ లీడర్‌గా పేరుగాంచింది. బీజేపీ ఎన్ని రకాల వ్యూహాలు వేసి టీఎంసీని ఓడించాలని ప్రయత్నించినప్పటికీ మమత మళ్లీ అధికారంలోకి వచ్చి బీజేపీకి షాక్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఎన్డీయేకు వ్యతిరేకంగా ఉన్న యూపీఏను కాదని, ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయాలనుకుంది. ఇందుకుగాను మమతా బెనర్జీ ఇప్పటికే రెండు సార్లు ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో భేటీ అయింది. కూటమిలో చేరేందుకు పవార్ ఇంట్రెస్ట్ చూపారో లేదో తెలియదు. అయితే, శరద్ పవార్ రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన కూటమిపైన పెద్దగా కాన్సంట్రేట్ చేయడం లేదని తెలుస్తోంది.
ప్రత్యామ్నాయ కూటిమికి ఇప్పటి వరకు పెద్దగా సానుకూలత కనబడలేదని అందరు అనుకుంటున్న క్రమంలో దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన యూపీలోని బలమైన ప్రాంతీయ పార్టీ ఎస్పీ మమతకు మద్దతు తెలిపింది. మమతా బెనర్జీ ఆధ్వర్యంలో ఏర్పడబోయే కూటమిలో చేరడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్ తెలిపాడు. దాంతో కొత్త కూటమికి ఇక త్వరగా అడుగులు పడే సంకేతాలు కనబడుతున్నాయి. వచ్చే ఏడాది యూపీ స్టేట్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మమత నేతృత్వంలో టీఎంసీతో ఎస్పీ పొత్తు పెట్టుకునే చాన్సెస్ కనబడుతున్నాయి. ఇదే పొత్తు పార్లమెంటు ఎన్నికల వరకు దారి తీస్తుంది. మొత్తంగా ప్రత్యామ్నాయ కూటమికి మమతా బెనర్జీ చేస్తున్న ప్రయత్నాలు ఒక్కొక్కటిగా సఫలీకృతమవుతాయనే వాదన కూడా మొదలవుతున్నది.
Also Read: కేసీఆర్ కు చుక్కలు చూపిన మోడీ సర్కార్?
మమతా బెనర్జీ నేతృత్వంలో ఏర్పడబోయే ఈ ప్రత్యామ్నాయ కూటమికి దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల మద్దతు ఏ మేరకు ఉంటుందో చూడాలి. ఇప్పటికే పలు ప్రాంతీయ పార్టీలు బీజేపీ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నాయి. ఈ క్రమంలో వాటిని యూపీఏకు కాకుండా ప్రత్యామ్నాయ కూటమికి మద్దతిచ్చేలా చేయాల్సిన అవసరముంది. తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పలు విషయాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు మద్దతు ఇచ్చినప్పటికీ బీజేపీకి పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా మారింది. ఇలా ఈ ఒక్క ప్రాంతీయ పార్టీయే కాదు.. చాలా రాజకీయ పార్టీలున్నాయి. వాటన్నిటి మద్దతు కూడగట్టుకుని ప్రత్యామ్నాయ కూటమి ప్రజల వద్దకు వెళ్లాల్సి ఉంటుంది.