చంద్రబాబును మమత పక్కన పెట్టేశారా.. కారణం ఏమై ఉంటుంది..?

రాజకీయాల్లో తనది 40 ఏళ్ల అనుభవం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు మాటిమాటికీ చెబుతుంటారు. బాబుకు జాతీయ స్థాయిలోనూ ఎంతవరకు ఇమేజ్‌ ఉందో చెప్పుకొచ్చే ప్రయత్నమే చేస్తుంటారు. ఆయన అలాంటి ప్రయత్నాలు చేయకున్నా.. జాతీయ స్థాయిలో ఉన్న ఇమేజీ అందరికీ తెలిసిందే. ఆయన అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పగలిగారు. పలు ఉత్తరాతి తూర్పు ఈశాన్య రాష్ట్రాల్లోనూ తన హవాను కొనసాగించారు. ప్రధానిగా దేవెగౌడను ఈ సీట్లో కూర్చోబెట్టడంలోనూ తమ అనుభవాన్ని వాడారు. ఢిల్లీ […]

Written By: Srinivas, Updated On : April 3, 2021 1:49 pm
Follow us on


రాజకీయాల్లో తనది 40 ఏళ్ల అనుభవం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు మాటిమాటికీ చెబుతుంటారు. బాబుకు జాతీయ స్థాయిలోనూ ఎంతవరకు ఇమేజ్‌ ఉందో చెప్పుకొచ్చే ప్రయత్నమే చేస్తుంటారు. ఆయన అలాంటి ప్రయత్నాలు చేయకున్నా.. జాతీయ స్థాయిలో ఉన్న ఇమేజీ అందరికీ తెలిసిందే. ఆయన అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పగలిగారు. పలు ఉత్తరాతి తూర్పు ఈశాన్య రాష్ట్రాల్లోనూ తన హవాను కొనసాగించారు. ప్రధానిగా దేవెగౌడను ఈ సీట్లో కూర్చోబెట్టడంలోనూ తమ అనుభవాన్ని వాడారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి.. కొన్ని విషయాలపై దూకుడు పెంచారు.

ఆ సమయంలో చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో మెరుస్తున్నారనే ప్రచారం కూడా భారీగానే జరిగింది. మరోవైపు బెంగాల్‌ సీఎం మమతకు కూడా చంద్రబాబు చేరువయ్యారు. అయితే.. అది ఆయన అధికారంలో ఉన్నప్పటి మాట. ప్రస్తుతం అదంతా మరుగుపడింది. గతంలో అంత సాన్నిహిత్యంతో మెలిగిన మమత బెనర్జీ సైతం ఇప్పుడు బాబును పక్కన పెట్టేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇక అసలు విషయానికొస్తే.. పశ్చిమ బెంగాల్‌లో ఇప్పుడు ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. దీంతో బీజేపీపై మమత యుద్ధం ప్రకటించారు. మోడీని టార్గెట్ చేస్తూ.. మమత దూకుడుగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. ‘అందరం కలిసి మోడీపై యుద్ధం చేద్దాం’ అని పేర్కొంటూ.. దేశంలోని కొందరు కీలక నేతలను సెలక్ట్ చేసుకొని మమత లేఖలు పంపారు. ‘‘జాతీయ స్థాయిలో మనం అందరం కలిసి మోడీ ఇమేజ్‌ను డ్యామేజీ చేయాలి’’ అనే ఉద్దేశంతో మమత కీలక నాయకులకు లేఖలు రాశారు. రాష్ట్రాల హక్కులను మోడీ సర్కారు హరిస్తోందని.. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం ఎక్కువైందని’’ ఆమె పేర్కొన్నారు.

ఈ క్రమంలో ఈ లేఖలు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా చేరాయి. అయితే.. మమత ఉత్తరాలకు ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. ఇదిలావుంటే.. ఒకప్పటి ముఖ్యమంత్రి.. 40 సంవత్సరాల పొలిటికల్ ఇండస్ట్రీ అయిన చంద్రబాబుకు మాత్రం మమత ఎలాంటి లేఖను పంపకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో మమత ఎందుకు బాబుకు లేఖ రాయలేదనే విషయంపై సోషల్ మీడియాలో కొందరు చర్చ పెట్టారు. ఈ క్రమంలో వారు వెలిబుచ్చిన అభిప్రాయం ప్రకారం.. చంద్రబాబు రాజకీయంగా ఔట్ డేటెడ్ అయిపోయారని, ఏపీలోనే ఆయన పని అయిపోయిందని కొందరు చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లినా వెళ్లొచ్చని మరికొందరు పేర్కొనడం గమనార్హం. ఇదే విషయంపై టీడీపీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. మమత చేసిన పని బాబును అవమానించినట్టేనని ఆ పార్టీ సీనియర్లు అంటున్నారు పార్టీ సీనియర్లు.