కేంద్రం బృందాలపై వ్యూహాత్మకంగా మమతా వెనుకడుగు

కోవిడ్-19 పరిస్థితులను సమీక్షించేందుకు కేంద్ర బృందాలను పంపడం పట్ల మొదట్లో నిరసన వ్యక్తం చేయడంతో పాటు, అది ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించగలదని నిప్పులు చెరిగిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పుడు వ్యూహాత్మకంగా వెనుకడుగు వేసిన్నట్లు కనిపిస్తున్నది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులకు కట్టుబడి ఉంటామని ఆమె ప్రభుత్వం స్పష్టం చేయడం మారిన ఆమె వైఖరిని వెల్లడి చేస్తుంది. మొత్తం ప్రపంచం ఆందోళన చెందుతున్న కరోనా వంటి అంశంపై కేంద్రంతో పోరుకు దిగితే […]

Written By: Neelambaram, Updated On : April 22, 2020 5:52 pm
Follow us on


కోవిడ్-19 పరిస్థితులను సమీక్షించేందుకు కేంద్ర బృందాలను పంపడం పట్ల మొదట్లో నిరసన వ్యక్తం చేయడంతో పాటు, అది ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించగలదని నిప్పులు చెరిగిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పుడు వ్యూహాత్మకంగా వెనుకడుగు వేసిన్నట్లు కనిపిస్తున్నది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులకు కట్టుబడి ఉంటామని ఆమె ప్రభుత్వం స్పష్టం చేయడం మారిన ఆమె వైఖరిని వెల్లడి చేస్తుంది.

మొత్తం ప్రపంచం ఆందోళన చెందుతున్న కరోనా వంటి అంశంపై కేంద్రంతో పోరుకు దిగితే ప్రజాసానుభూతి ఉండకపోవచ్చని ఆమె మాట మార్చి ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు. అయితే ఈ బృందాలను రాజకీయ ప్రయోజనాలకోసమే కేంద్రం పంపినట్లు మాత్రం ఆమె పార్టీ నేతలు భావిస్తున్నారు.

కరోనా వైరస్ పరిస్థితులను అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర బృందాలకు మమతా బెనర్జీ ప్రభుత్వం ఆటంకాలు కలిగిస్తోందంటూ కేంద్రం మండిపడిన నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ప్రధాన కార్యదర్శి కేంద్రానికి తాజా వివరణ ఇస్తూ ఒక లేఖను పంపారు.

అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందాలకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదనే మాట ఎంతమాత్రం నిజం కాదని, ఒక బృందంతో తాను రెండుసార్లు సమావేశమయ్యాయని, ఇతరులతో కూడా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నానని పశ్చిమబెంగాల్ ప్రధాన కార్యదర్శి రాజీవ్ సిన్హా కేంద్ర హోం కార్యదర్శి అజయ్ భల్లాకు రాసిన లేఖలో స్పష్టం చేశారు.

‘విపత్తు యాజమాన్యం చట్టం కింద కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ఆదేశాల అమలులో అత్యంత జాగరూకతతో ఉంటామని మీకు తెలియజేస్తున్నాను’ అని రాజీవ్ సిన్హా పేర్కొన్నారు. అయితే కేంద్ర బృందాలు తమతో ముందస్తు సంప్రదింపులు జరపకుండా వచ్చినందున కేంద్ర ఉత్తర్వులో పేర్కొన్న లాజిస్టిక్ సపోర్ట్ అందించలేకపోయామని తెలిపారు.

పైగా కేంద్ర బృందం సైతం ఎలాంటి సాయం కోరలేదని రాజీవ్ సిన్హా ఆ లేఖలో పేర్కొన్నారు. ఏప్రిల్ 21న తాను భల్లాతో టెలిఫోన్ సంభాషణ జరిపి, కోవిడ్-19 నిరోధానికి తీసుకుంటున్న చర్యల గురించి తెలియజేశానని కూడా ఆయన గుర్తు చేశారు.

కాగా, పశ్చిమబెంగాల్‌లో పర్యటిస్తున్న రెండు కేంద్ర బృందాలకు సహకరిస్తామంటూ పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఇచ్చిన హామీని హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు స్వాగతించారు. లాక్‌డౌన్ చర్యలు అమలుపై సమీక్షించేందుకు కేంద్ర ఆరు బృందాలను మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్‌కు పంపింది. వీటిలో రెండు బృందాలు పశ్చిమబెంగాల్‌కు వెళ్లాయి.

కరోనా వైరస్ కట్టడిలో, లాక్ డౌన్ అమలులో బిజెపి నేతలే తీవ్ర ఆరోపణలు చేస్తున్న ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాలకు కాకుండా ఈ సంవత్సరంలో ఎన్నికలు జరుగనున్న పశ్చిమ బెంగాల్ కు పంపడం పట్ల టిఎంసి నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ఒక బృందం కోల్‌కతా, హౌరా, నార్త్ 24 పరగణాలు, ఈస్ట్ మిడ్నాపూర్‌లో పర్యటించగా, మరో బృందం జల్‌పాయ్‌గురి, డార్జిలింగ్, కలింపాంగ్‌లలో పర్యటించింది. అయితే, కేంద్ర బృందాల రాకను ‘సహస పర్యటన’గా పశ్చిమబెంగాల్ ప్రభుత్వం తొలుత అభివర్ణించింది.

ఇన్‌ఫెక్షన్లు, హాట్‌స్పాట్‌లు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు ఎందుకు కేంద్ర బృందాలను పంపడం లేదని నిలదీసింది. పైగా, కేంద్ర బృందాలు వచ్చిన మూడు గంటల తర్వాత ఆ సమాచారాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తెలియజేసారని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యమైన చర్య కాదని టీఎంసీ ఎంపీలు డెరిక్ ఒబ్రెయిన్, సుదీప్ బంధోపాధ్యాయ్ విమర్శించారు.

అదీ కాకుండా, సరిహద్దు భద్రతా దళాల రక్షణలో కేంద్ర బృందాలు ఒక యుద్ధ భూమికి వస్తున్నట్లు రావడం ఏమిటని కేంద్రాన్ని వారు నిలదీశారు. రాష్ట్ర పోలీసులకు తెలిపితే వారు తగిన భద్రతను ఏర్పాటు చేసి ఉండేవారు గదా అని చెబుతున్నారు.