https://oktelugu.com/

Mallikarjun Kharge: రాజ్యసభలో కాంగ్రెస్ సెల్ఫ్ గోల్.. మల్లికార్జున ఖర్గే సార్.. జర చూసుకోవాలి కదా.. వైరల్ వీడియో

రాజకీయ నాయకులకు విషయాలపై పట్టు ఉండాలి. సమయానికి అనుగుణంగా స్పందించే సామర్థ్యం ఉండాలి. అవసరమైతే విమర్శలు చేయాలి. వివరణ ఇచ్చే వాగ్దాటి కలిగి ఉండాలి. ఇవి లేకుంటే రాజకీయ నాయకుడిగా రాణించలేరు. చరిత్ర చెబుతున్న నిజం.. వర్తమానం చెబుతున్న పాఠం.. భవిష్యత్తు చెబుతున్న ఉపదేశం ఇదే. కాకపోతే కొంతమంది రాజకీయ నాయకులు దీనిని పట్టించుకోరు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 9, 2024 / 05:30 PM IST

    Mallikarjun Kharge

    Follow us on

    Mallikarjun Kharge: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సుదీర్ఘ రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్నారు. కర్ణాటక లో ఓ మారుమూల గ్రామంలో పుట్టిన ఆయన రాజకీయ నాయకుడిగా అంచలంచలుగా ఎదిగారు. ఏకంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడయ్యారు. సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో ఎన్నో పదవులను అలంకరించారు. మరెన్నో పురస్కారాలను సాధించారు. రాజకీయ కురవృద్ధుడిగా పేరుపొందిన అతను.. అజాతశత్రువుగా కీర్తి గడించారు. అందువల్లే కాంగ్రెస్ పార్టీలో విపరీతమైన పోటీ ఉన్నప్పటికీ.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అలాంటి వాళ్ళు ఉన్నప్పటికీ మల్లికార్జున ఖర్గేకు జాతీయ అధ్యక్ష పదవి దక్కింది. ఆయన ఆధ్వర్యంలోనే దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తమిళనాడులో అధికార పార్టీతో కలిసి ప్రయాణం చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 స్థానాలు దక్కించుకుంది. ఎన్డీఏ కు తిరుగులేని షాక్ ఇచ్చింది. రెండు పర్యాయాలు సింగిల్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బిజెపికి చుక్కలు చూపించింది. ఇటీవల హర్యానా, మహారాష్ట్రలో ఓటమి ఎదురైనప్పటికీ.. మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే అంతటి సుదీర్ఘ అనుభవం ఉన్న మల్లికార్జున ఖర్గే సోమవారం రాజ్యసభలో చేసిన చిన్నతప్పిదం కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. దీంతో బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శిస్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా దుయ్యబడుతున్నారు.

    ఇంతకీ ఏం జరిగిందంటే..

    అదాని కంపెనీల అక్రమాలపై గత కొంతకాలం నుంచి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంది. గౌతమ్ అదానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారాలు అందిస్తున్నారని.. అక్రమాలకు పాల్పడుతున్నప్పటికీ అండగా ఉంటున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల రాహుల్ గాంధీ ఏకంగా మోడీ అదాని కలిసి ఉన్న టి షర్టు ధరించి సంచలనం సృష్టించారు. పార్లమెంట్ లో కలకలం రేపారు. దీనికి కౌంటర్ గా బిజెపి కాంగ్రెస్ పై సరికొత్త విమర్శలు చేయడం మొదలుపెట్టింది. పాశ్చాత్య దేశాలలో నివాసం ఉండే జార్జ్ సొరోస్ అనే ఆగర్భ శ్రీమంతుడు.. కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ చేస్తున్నాడని.. ఎన్డీఏ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి రకరకాల ఉద్యమాలకు డబ్బులు ఇస్తున్నాడని ఆరోపించడం మొదలుపెట్టింది. సొరోస్ తో ఓ కాంగ్రెస్ నాయకుడికి సంబంధం ఉందని ఆరోపించింది. దీనికి సంబంధించి సొరోస్ పై రాజ్యసభలో సోమవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా సొరోస్ తో కాంగ్రెస్ సీనియర్ నాయకుడికి లింకులు ఉన్నాయని జేడీయూ ఎంపీ సంజయ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో మల్లికార్జున ఖర్గే లేచి “సభలో లేని మా నేతపై ఆరోపణలు చేయొద్దని” అన్నారు. దీనిపై రాజ్యసభ చైర్మన్ ధన్ ఖడ్ ప్రశ్నిస్తే ఆయన సమాధానం చెప్పలేదు..”మేం ఎవరి పేరూ చెప్పనప్పటికీ కాంగ్రెస్ తన పార్టీ ఓ సీనియర్ నేతకు అన్వయించుకుందని” బిజెపి ఎంపీ సుధాంశు ఆరోపించారు. దీంతో మల్లికార్జున సైలెంట్ అయిపోయారు. ఇక ఈ వీడియోను బిజెపి శ్రేణులు సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి.” ఇప్పటికైనా ప్రజలు గుర్తించాలి. కాంగ్రెస్ అసలు రూపాన్ని గమనించాలి. వీళ్లు దేశం కోసం ఏం చేస్తారు మీరు చూస్తున్నారు కదా.. ఇది మేం చేస్తున్న ఆరోపణలు కావు. రాజ్యసభలోనే బహిర్గతమయ్యాయని” పేర్కొంటున్నారు.