రాష్ట్ర ప్రభుత్వం జగనన్న అమ్మఒడి పథకానికి బ్రాహ్మణ సంక్షేమ కార్పోరేషన్ నిధులు మళ్లించడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ వ్యవహారంపై బీజేపీ పార్టీ తీవ్ర స్థాయిలో మండి పడుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్షీనారాయణ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి నిధులు మళ్లింపు వ్యవహారంపై లేఖ రాశారు. అదేవిధంగా పార్టీ ఉపాధ్యక్షులు విష్ణువర్థన్ రెడ్డి ఈ అంశంపై మీడియా సమావేశంలో ప్రభుత్వ వైఖరిని తప్పబట్టారు. బ్రహ్మణ కార్పోరేషన్ నిధులను బ్రహ్మణ సంక్షేమానికి వినియోగించకుండా ఇతర కార్యక్రమాలకు మళ్లించడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
బ్రహ్మణ కార్పోరేషన్ కు దేవాదాయశాఖ నుంచి మంజూరు చేసి నిధుల నుంచి ప్రభుత్వం జగనన్న అమ్మవడి పథకానికి రూ.26.41 కోట్లను మళ్లించింది. పెద్ద మొత్తంలో నిధులు మళ్లించడంతో పేద బ్రహ్మణులు సంక్షేమ పథకాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటారని బీజేపీ నాయకులు అంటున్నారు. బీజేపీ నాయకులతో పాటు కొద్ది రోజులుగా ప్రభుత్వం, పార్టీపై అసంతృప్తిలో ఉన్న వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సైతం ఈ అంశాన్ని లేవనెత్తారు. సంక్షేమ పథకాలకు నిధులు లేని ప్రభుత్వం కార్పోరేషన్ ల నిధులు మళ్లిస్తుందని, ఇదే క్రమంలో బ్రహ్మణ కార్పోరేషన్ నిధులు మళ్లించిందన్నారు.
Also Read: ‘నిమ్మగడ్డ’ వ్యవహారంలో ప్రభుత్వానికి షాక్..
బ్రహ్మణ కార్పోరేషన్ నిధుల మళ్లింపు విషయంపై ఆ సంస్థ ఛైర్మన్ మల్లాది విష్ణువర్ధన్ స్పందించారు. జగనన్న అమ్మఒడి పథకం కింద రాష్ట్రంలో 42.33 లక్షల మంది విద్యార్ధులకు ఏడాదికి రూ.15 వేలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఓసి కేటగిరిలో 8,89,113 మంది లబ్ధి పొందుతున్నారని వీరిలో బ్రహ్మణ వర్గానికి చెందిన వారు 17,611 మంది ఉన్నారని వీరికి లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం దేవాదాయ శాఖ నుంచి అదనపు బడ్జెట్ లో కేటాయించిన రూ.26.41 లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు. వీరంతా బ్రహ్మణ కార్పోరేషన్ సంక్షేమ పథకాలకు అర్హులైన వారు మాత్రమేనని చెప్పారు.
దేవాదాయ శాఖకు దేవాలయాల్లో భక్తులు విరాళాలు, కానుకలు రూపంలో సమర్పిస్తారని ఆ నిధులను దేవాలయాల అభివృద్ధికి కాకుండా ప్రభుత్వం తన అవసరాలకు వినియోగించుకోవడాన్ని బీజేపీ నేతలు ఎండగడుతున్నారు. ఈ వ్యవహారంపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను జగన్ ప్రభుత్వం లైట్ గా తీసుకుంది. పెద్దగా పట్టించుకోకుండా తనపని తాను చేసుకుపోతుంది.