Hyderabab Drugs Cannabis chocolates : ఒకప్పుడు మత్తు కోసం మద్యం తాగేవారు.. తర్వాత దాని స్థానాన్ని గంజాయి ఆక్రమించింది.. ఇప్పుడు అది కూడా సరిపోవడం లేదు. మరింత నిషా కోసం దేని కోసమైనా తెగిస్తున్నారు. ఎంత దాకా అయినా వెళ్తున్నారు. కొత్త కొత్త వాటిని కనిపెడుతున్నారు.. గంజాయి ఆయిల్ దీనిని సైన్స్ పరిభాషలో హాష్ అంటారు.. ఎండు గంజాయి కంటే ఆయిల్ లో ఎక్కువ మత్తు ఉంటుంది. దీనిని చాకెట్లలో కలిపి ఆన్లైన్లో విక్రయిస్తున్నారు.. ఈ దందాకు తెరలేపిన ఓ వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.. హైదరాబాద్ నగర పరిధిలోని నార్సింగ్ ప్రాంతానికి చెందిన రిషి సంజయ్ మెహతా ఎంబీఏ చదువుతున్నాడు. డ్రగ్స్, గంజాయి, హాష్ ఆయిల్ కు బానిస అయ్యాడు.. ఇంట్లోనే హాష్ ఆయిల్ తో చాక్లెట్లు తయారుచేసి ఆన్లైన్లో విక్రయిస్తుంటాడు.. విడిగా అయితే ఒక ముక్కకు 1000 రూపాయలు నుంచి 2000 వరకు వసూలు చేస్తూ ఉంటాడు.. ఇతడిపై హెచ్ న్యూ, ముషీరాబాద్ పోలీసులు నిఘా పెట్టారు. శనివారం అరెస్టు చేశారు. ఇతడు విక్రయించే ఒక చాక్లెట్ ముక్కను తింటే ఎనిమిది గంటల దాకా మత్తు ఉంటుంది. ఇతడి ఫోన్లో 100 మంది కస్టమర్ల పేర్లు ఉన్నాయి. వారిలో ఈ 50 శాతం మంది యువతులే ఉన్నారు. పైగా ఇతడి ఫోన్ పరిశీలించగా ఆ యువతులతో ఇతడు అసభ్యకరమైన స్థితిలో ఉన్న ఫోటోలు దర్శనమిచ్చాయి. ఇలా డ్రగ్స్ చాక్లెట్ కు బానిసైన వారిని గుర్తించి వారి తల్లిదండ్రుల సమక్షంలో పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు.

కోరలు చాస్తున్న మాదకద్రవ్యాలు.
మాదక ద్రవ్యాల దురలవాటు హైదరాబాద్ నగరానికి పెద్ద సమస్యగా మారింది. దేశాల సరిహద్దులు దాటుతూ అక్రమ రవాణ చేసే స్మగ్లర్లు, తీవ్రవాద గుంపులు తమ అక్రమ సామ్రాజ్యాలను విస్తరించడం, సప్లయి చైన్‌ను ఏర్పాటు చేసుకోవడం దర్జాగా జరుగుతున్నది. ‘ఐరాస ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్’ వరల్డ్ రిపోర్ట్ – వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 269 మిలియన్ల ప్రజలు మాదక ద్రవ్యాలను వాడుతున్నారని, వీరిలో 35మిలియన్లు మాదకద్రవ్యాల సంబంధ రుగ్మతలతో బాధ పడుతున్నారని తెలుస్తున్నది. ఇండియాలో దాదాపు 14.6కోట్ల ప్రజలు ఆల్కహాల్ దురలవాట్ల బారిన పడ్డారు. 3.1కోట్ల ప్రజలు కన్నాబిస్ డ్రగ్స్, దాదాపు 3కోట్లు ఓపియం, 8.5లక్షల మంది మాదకద్రవ్యాలను సూది మందు రూపంలో (ఐవి) వాడుతున్నారని తేలింది. ఇలాంటి సూది మందులను వాడటం వల్ల హెచ్‌ఐవి-ఏయిడ్స్ కూడా పెరిగిపోయే ప్రమాదం ఏర్పడుతున్నది. భారతదేశంలో మాదకద్రవ్యాల కేంద్రంగా సరిహద్దు రాష్ట్రం పంజాబ్ అగ్రభాగాన ఉన్నది. అంతర్జాతీయ సరిహద్దు రాష్ట్రాల్లో డ్రగ్స్ అక్రమ రవాణ, వాడకం ఎక్కువగా కనిపిస్తున్నది. అస్సాం, ఢిల్లీ, హర్యానా, మణిపూర్, మిజోరాం, సిక్కిం, మహారాష్ట్ర, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, యూపీ రాష్ట్రాల్లో మాదకద్రవ్యాల లభ్యత, వాడకం అధికంగా నమోదు అవుతున్నాయి. కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లోంచి అక్రమ రవాణాకు తోడుగా కన్నాబిస్, హెరాయిన్, కొకేయిన్ లాంటి మాదకద్రవ్యాల ఉత్పత్తి కూడా జరుగుతున్నది. బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ దేశ సరిహద్దుల గుండా డ్రగ్స్ దేశంలోకి అక్రమంగా చేరుతోంది.
మాదకద్రవ్యాలు లేదా డ్రగ్స్ దురలవాటుకు గురయిన వారు అనేక దుష్ప్రభావాలకు లోనవుతారు. మానసిక కల్లోలం, ఆందోళన, నిరాశ, చికాకు, సుఖభ్రాంతి, అతి చురుకుదనం, అతిగా కదలడం, మానవ సంబంధాలలో అసాధారణ ప్రవర్తన, ప్రేరణ కోల్పోవడం, బాధ్యతలను విస్మరించడం, చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించడం, శారీరకంగా బలహీన పడటం, నిద్రలేమి, సోమరితనం, అనవసరంగా ఆవేశ పడటం, భయం లేకపోవడం, ఉద్రేక పడటం, మానసిక ప్రవర్తనలో సమూల మార్పులు, సమాజంలో చిన్నచూపునకు గురికావడం, వ్యక్తిత్వ వినాశనం లాంటి పలు అనర్థాలు జరుగుతాయి. మాదకద్రవ్యాల దురలవాటు దుష్పరిణామాల్లో మెదడు క్రియాశీలతలో మార్పులు, అనవసరంగా గాయాల పాలుకావడం, రోగనిరోధకశక్తి పడిపోవడం, హృదయనాళ సమస్యలు, వికారం, వాంతులు, కాలేయ హాని, కడుపు నొప్పి, స్ట్రోక్స్, హార్ట్ అటాక్, నిర్ణయ శక్తి నశించడం, శాశ్వతంగా మెదడు ప్రభావితం కావడం, భావోద్వేగాల అస్థిరత్వం లాంటి అనేక ప్రతికూల ప్రభావాలు కలుగుతాయి. కాబట్టి మాదకద్రవ్యాల దురలవాటు ప్రాణాంతకమని హెచ్చరిస్తూ, యువతను సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత విస్మరించలేనిది. దేశ యువత మత్తులో తూలకుండా, బాధ్యతాయుత పౌరులుగా జాతి అభివృద్ధిలో భాగస్వాములు కావాలి.