తిరుపతి సభ హోరెత్తింది. కాషాయ జెండాల రెపరెపలతో అలరాలింది. కమలదళం కదం తొక్కింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తిరుపతి ఎన్నికల సభలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి ప్రజలపై వరాల వాన కురిపించారు.
తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీని గెలిపించడం ద్వారా పెనుమార్పునకు శ్రీకారం చుట్టాలని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఓటర్లను కోరారు. సుపరిపాలన, అవినీతిరహిత, ప్రజాసంక్షేమ పాలనతో మోదీ ప్రభుత్వం వేగవంతమైన అభివృద్ధిని సాధిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వ పాలన దీనికి పూర్తి విరుద్ధంగా ఉందన్నారు. ఆశ్రితపక్షపాతం, అవినీతి వనరుల దోపిడి, ప్రజావ్యతిరేక పాలన, అరాచకత్వంతో ప్రజలను వేధిస్తోందన్నారు. దొరికినంత అప్పులుచేసి తిరిగిరాని అంశాలకు ఖర్చుచేసి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. హిందూ ఆలయాలపై వరుసదాడులు జరుగుతుంటే కనీస స్పందన కూడా చూపించడం లేదన్నారు. ఒక మతానికి చెందిన ఆచార్యులకు జీతాలు, ప్రార్థనామందిరాలకు నిధులిచ్చి, మత మార్పిడులకు ప్రోత్సహించి మతవివక్షకు పాల్పడుతోందన్నారు. ప్రజాసేవలో విశేష అనుభవం గల భాజపా జనసేనల ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభను తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల్లో గెలిపించడం ద్వారా ఈ ప్రాంతం గొప్ప మార్పును తీసుకురావాలని ఓటర్లను కోరారు. భారతీయ జనతా పార్టీ – జనసేనల సంయుక్త ఆధ్వర్యంలో నాయుడుపేటలో ఎన్నికల బహిరంగసభ సోమవారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న జగత్ ప్రకాష్ నడ్డా ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ప్రసంగం ఇలా…..
‘‘అల్లూరి సీతారామరాజు, పింగళి వెంకయ్య వంటి దేశభక్తులు నడయాడిన, వెంకటేశ్వరుని పాదాల చెంత ఉన్న ఈ పుణ్యభూమిపై నిలుచుని మాట్లాడటం నా అదృష్టం. ప్రస్తుతం నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో అస్సాం, పుదుచ్చేరి, బెంగాలలో భాజపా ఘనవిజయం సాధిస్తుంది. కేరళ, తమిళనాడులో మంచి ఫలితాలు సాధిస్తాం. మహిళలు రైతులు, యువత, పేదలు ఇలా అన్నిరంగాల వారిన్ని అభివృద్ధిలోకి తీసుకురావడం వల్ల ఈ విజయాలు దక్కుతున్నాయి. ఏడేళ్లుగా ప్రధాని మోదీ అందిస్తున్న సుపరిపాలన, అవినీతిరహితపాలన, చిట్టచివరి వారికి సంక్షేమ ఫలాలు అందించడం వల్లే విజయాలు దక్కుతున్నాయి. తిరుపతి పార్లమెంటు అభ్యర్థిని రత్నప్రభను గెలిపిస్తే తిరుపతి అభివృద్ధి మరింత వేగవంతం అవుతుంది. ఆరేళ్లుగా రాష్ట్రానికి పెద్దఎత్తున మోదీ ప్రభుత్వం నిధులిచ్చింది. ప్రధాని ఆవాస్ యోజన ద్వారా 20 లక్షల ఇళ్ల నిర్మాణానికి రూ.30 వేల కోట్లు నిధులు కేటాయించాం. నాలుగు స్మార్ట్ సిటీలిచ్చాం. ఇలా అభివృద్ధికోసం ఇప్పటి వరకు మొత్తం రూ.5.56 లక్షల కోట్లు ఖర్చుచేస్తున్నాం. పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తిచేయడానికి కృషిచేస్తున్నాం. విభజన హామీల అమలుకు పదేళ్ల సమయం ఉన్నా ఏ రాష్ట్రంలోనూ ఏర్పాటుచేయనట్లుగా ఎయిమ్స్, ఐఐటీ, ఐసర్, నిట్, ఐఐఎం, త్రిపుల్ ఐటీ, సెంట్రల్ వర్శిటీ, గిరిజన వర్శిటీ వంటివి రెండేళ్లలోనే ఏర్పాటుచేశాం. లాభసాటికాకున్నా రైల్వేజోన్ ఏర్పాటుచేశాం. శ్రీకాళహస్తి-నడికుడి రైల్వేలైన్ ను రూ.450 కోట్లతో సాకారం చేస్తున్నాం. 32 జాతీయ రహదారుల నిర్మాణం పూర్తిచేశాం రహదారుల నిర్మాణం జరుగుతోంది. సాగరమాల కింద 92 ప్రాజెక్టులు జరుగుతున్నాయి. స్వచ్ఛభారత్, ఉజాలా, ఉజ్వల, సౌభాగ్య, ఆయుష్మాన్ భారత్, కిసాన్ సమ్మాన్ నిధి, జనధన్ వంటి పథకాలు రాష్ట్ర ప్రజల్లో మెరుగైన మార్పును తెచ్చాయి. మోదీ చేస్తున్న కృషికి మీరు భాజపా అభ్యర్థిని గెలిపిస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి సాధిస్తుంది.’’
-పీకలలోతు అవినీతిలో రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం పీకలలోతు అవినీతిలో కూరుకుపోయింది. ప్రకృతి వనరుల దోపిడి, ప్రజావ్యతిరేకపాలన, మతవివక్ష, స్వప్రయోజనాలతో అరాచకప్రభుత్వంగా మారింది. 150కి పైగా హిందూ ఆలయాలపై దాడులుచేసి నేరస్తులను ఇంతవరకు పట్టుకోని ఈ ప్రభుత్వం లౌకికత్వాన్ని దెబ్బతీసింది. మతాచార్యులకు జీతాలిచ్చి, ప్రార్ధనా మందిరాలు నిర్మించి, మతమార్పిడులను ఏకపక్షంగా ప్రోత్సహిస్తూ, మతవివక్షకు పాల్పడుతోంది. భాజపా మత రాజకీయాలు చేయదు. పేదల అభివృద్దే మా లక్ష్యం. ఆలయాలను ఈ చెరనుంచి విడదీసి ప్రత్యేక బోర్డు పరిధిలోకి తీసుకురావాలనేది మా ప్రయత్నం. నేడు రాష్ట్రంలో అన్ని రకాల వ్యవస్థల్లోకి అవినీతి చేరింది. రూ. 4 లక్షల అప్పుల ఊబిలో కూరుకుపోయింది అభివృద్ధి కోసం కాకుండా ఓట్ల రాజకీయం కోసం రాబడిలేని విషయాలకు ఖర్చు చేయడం శోచనీయం. శ్రీకృష్ణదేవరాయలు వంటి మహనీయుల పాలనలో రతనాలు అమ్మిన రాయలసీమను రాళ్లపాలుచేశారు.
ఎందరో ముఖ్యమంత్రులు వచ్చినా ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారు. భాజపాను గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాం. ఇప్పటి ఈ ప్రాంతాన్నేలిన తెదేపా, వైకాపాల అభివృద్ధి రహిత పాలన చూశారు. తిరుపతి పార్లమెంటు ఎన్నికల్లో భాజపా అభ్యర్థి రత్నప్రభను గెలిపించండి పెద్ద మార్పును తెస్తాం. రత్నప్రభ ప్రజాసేవలో అనుభవశాలి. మోదీ ఆశీర్వచనాలతో ఆమె పోటీచేస్తున్నారు. భాజపా- జనసేన భాగస్వామ్యంతో ముందుకు వెళ్తున్నాం. మీ ఆశీర్వచనాలు మాకు ఇవ్వాలి. తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు
– రాయలసీమపై వివక్ష
భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మాట్లాడుతూ రాయలసీమకు ఇక్కడి నుంచి ఎంపికైన ఇతర పార్టీ సిఎంలంతా అన్యాయం చేశారన్నారు. తెలుగుగంగా, హంద్రీనీవా, గాలేరునగరి పథకాలు ప్రారంభించినా ఇప్పటికీ పూర్తిచేయలేదని, రాయలసీమకు నీరందించడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఇంకా ఆయన ఇలా అన్నారు. 2017లో పోలవరాన్ని ప్రారంభిస్తే ప్రధాని మోదీ రూ.13 వేల కోట్టిచ్చిదానికి రేపురేఖలిచ్చారు. హంద్రీనీవా, తెలుగుగంగ, గాలేరు నగరికి, రాయలసీమకు నికరజలాలు లేకుండా దగా చేసింది రాయలసీమ నాయకత్వం కాదా? రాయలసీమకు నికరజలాలిచ్చారా? పోలవరం శరవేగంగా నిర్మిస్తుంటే రాయలసీమ ప్రాజెక్టులు ఎందుకు నత్తనడక నడుస్తున్నాయో చంద్రబాబు జగన్ సమాధానం చెప్పాలి? రాజధానికి రూ. 2,500 కోట్ల నిధులు, 4వేల కోట్ల అప్పులిస్తే చంద్రబాబు జగన్ రాజధానిని నిర్మించక చేతులెత్తేశారు. రాష్ట్రంలో జరిగే అభివృద్ధి పనులన్నీ మోదీ ఇచ్చిన నిధులతో కొనసాగుతున్నవే. మేం వరదలా నిధులిస్తుంటే మీరు దోచుకుంటున్నారు. తిరుపతిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధమా? భాజపా అధ్యర్థికి ఓటేయడం ద్వారా తిరుపతి అభివృద్ధిని మరింత వేగవంతం చేయండి. రాష్ట్రంలో భాజపా- జనసేన అధికారంలోకి వచ్చి అవినీతిరహిత పాలన అందిస్తాయి.
-ప్రజాసేవ చేస్తా
తిరుపతి పార్లమెంటు అభ్యర్థి రత్నప్రభ మాట్లాడుతూ, తన సర్వీసులో ఎలాంటి వత్తిడి, ప్రలోభాలకు గురికాకుండా ప్రజాసేవ చేశానని అన్నారు. ఇప్పుడు ప్రజల కోసం జీవితాంతం సేవ చేస్తానన్నారు. తిరుపతికి సంబంధించిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నానని, తనను గెలిపిస్తే వాటిని పరిష్కరించేలా కృషి చేస్తానన్నారు. వైకాపా అభ్యర్థి గురుమూర్తికి ఓటేస్తే జగన్ కు ఓటేసినట్లేనని, తనకు ఓటేస్తే ప్రధాని మోదీకి ఓటేసినట్లుగా భావించాలని కోరారు
కార్యక్రమంలో కేంద్ర మంత్రి, రాష్ట్ర ఇన్ ఛార్జి మురళీధరన్, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, పూర్వ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ చిలకం రామచంద్రారెడ్డి, రాజ్యసభ సభ్యులు జీవిఎల్ నరసింహారావు, టీజీ వెంకటేష్, సిఎం.రమేష్, ఉ పాధ్యక్షులు ఎమ్మెల్సీ, వాకాటి నారాయణరెడ్డి, విష్ణుకుమారరాజు, సురేంద్రరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు విష్ణువర్ధన్ రెడ్డి, సూర్యనారాయణరాజు, మాజీ మంత్రులు ఆదినారాయణరెడ్డి, రావెల కిషోర్ బాబు నాయకులు బైరెడ్డి రాజశేఖరరెడ్డి, ఒబీసీ మోర్చా అధ్యక్షులు బిట్రి వెంకట శివన్నారాయణ, మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ, ఎస్సీ మోర్చా అధ్యక్షులు గుడిసె దేవానంద్, ఎస్టీ మోర్చా అధ్యక్షులు ఉ మామహేశ్వరరావు, యువమోర్చా అధ్యక్షులు సురేంద్రమోహన్, పార్టీ తమిళనాడు అధ్యక్షులు మురుగన్ పార్లమెంటు అధ్యక్షులు దయాకర్ రెడ్డి పాల్గొన్నారు. సినీనటి హేమను భాజపాలో చేరారు. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, నాయకులు మనుక్రాంతరెడ్డి, హరిప్రసాద్, ప్రసంగించారు. చంద్రశేఖర్ ప్రసాద్, ప్రవీణ్, వెంకటేశ్వర్లు, కిరణ్ రాయులు, వీనుత, లావణ్య కుమార్ వేదికను అలంకరించారు
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Major change in tirupati with bjp victory jp nadda
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com