
MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంటోంది. సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ప్యానెళ్లు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. దీంతో పోలింగ్ సమయంలోనూ గొడవలు చోటుచేసుకోవడం గమనార్హం. విష్ణు, ప్రకాశ్ రాజ్ గ్రూపుల్లో వాగ్వాదాలు జరుగుతున్నాయి. మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో మా సభ్యుల్లో ఆందోళన నెలకొంది.
విష్ణు ప్యానెల్ కు చెందిన శివబాలాజీ, ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు చెందిన హేమ మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ప్రకాశ్ రాజ్ వర్గానికి చెందిన అభ్యర్థులపై మోహన్ బాబు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. మా సంఘంతో సంబంధం లేని వ్యక్తులు పోలింగ్ కేంద్రంలోకి వస్తున్నారని విష్ణు మండిపడ్డారు. దీంతో వివాదం కాస్త ముదిరింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది.
ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులు విష్ణు ప్యానల్ సభ్యులపై ఆరోపణలు చేయడంతో ఇరు వర్గాల్లో అలజడి రేగుతోంది. పోలీసులు రంగ ప్రవేశం చేసినా వారిలో గొడవ సద్దుమణగలేదు. చివరికి శాంతించినా ఇరు వర్గాల్లో పరస్పరం అభిప్రాయ భేదాలు పెరిగిపోయాయి. ఇప్పటికే పలువురు సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మా లో 26 మంది సభ్యుల కోసం ఎన్నికలు నిర్వహిస్తుండగా పోటీలో 54 మంది ఉన్నారు. మొత్తం 925 మంది సభ్యులున్నారు. 883 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కానీ ఈసారి పోలింగ్ శాతం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందులో 60 ఏళ్లు పైబడిన వారు 125 మంది వరకు ఉన్నారు. వీరు పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ కో ఆపరేటివ్ సొసైటీ విశ్రాంత ఉద్యోగులతో ఎన్నికలు నిర్వహిస్తున్నారు.