ప్రేమ ఎంతటి పనైనా చేయిస్తుందని చెప్పడానికి మరో ఉదాహరణ. అచ్చం సినిమాల్లో మాదిరిగా ప్రేమికురాలిని కలుసుకోవడానికి కాలినడకన బయలుదేరాడో వ్యక్తి! అది కూడా ఎక్కడికో కాదు. పాకిస్థాన్ కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అక్కడి నుంచి మరో దేశానికి వెళ్లాలనేది అతడి ప్లాన్. కానీ.. బెడిసికొట్టింది. సీన్ కట్ చేస్తే ఏకంగా నాలుగు సంవత్సరాలు పాకిస్తాన్ జైల్లో ఖైదీగా మిగిలిపోయాడు. భారత ప్రభుత్వం, హైదరాబాద్ పోలీసుల చొరవతో తాజాగా నగరానికి చేరకున్నాడు. ఇంతకీ అతను ఎవరు? అతని ప్రేమ కథ వ్యవహారం ఏంటన్నది చూద్దాం.
హైదరాబాద్ కూకట్ పల్లికి చెందిన ప్రశాంత్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి 2010లో బెంగళూరులో ఉద్యోగంలో చేరాడు. ఈ క్రమంలో అక్కడే ఉద్యోగం చేస్తున్న స్వప్నిక అనే యువతి పరిచయం అయ్యింది. ఆమెది మధ్యప్రదేశ్. ప్రశాంత్ ఆమెనుప్రేమించాడు. అలా మూడేళ్లు కాలం గడిపాడు. కానీ.. తన ప్రేమను మాత్రం ఆమెకు చెప్పలేకపోయాడు. ఆ తర్వాత 2013లో ఉద్యోగరీత్యా హైదరాబాద్ రావాల్సి వచ్చింది. కానీ.. మనసు మాత్రం ఆమెతోనే ఉండిపోయింది. ఈ క్రమంలో ఎంతో మదనపడిన ప్రశాంత్.. ఆమెను కలుసుకోవడానికి సిద్ధమయ్యాడు. అయితే.. అప్పటికే స్వప్నిక సైతం అక్కడి నుంచి వెళ్లిపోయింది.
తీవ్రంగా ఆవేదనకు గురైన ప్రశాంత్.. ఆమె ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఫ్రెండ్స్ ద్వారా అడ్రస్ తెలుసుకొని మధ్యప్రదేశ్ లో వాలిపోయాడు. కానీ.. నిరాశే ఎదురైంది. ఆమె అక్కడలేదు. ఇక, తప్పదనుకొని అమ్మాయికి చెప్పలేకపోయిన ప్రేమ విషయం.. తల్లిదండ్రులకు చెప్పాడు. కానీ.. వారు అంగీకరించలేదు. కానీ.. ప్రశాంత్ ప్రశాంతంగా ఉండలేకపోయాడు. స్వప్నిక ఎక్కడ ఉందని తెలుసుకోవడానికి ప్రయత్నించి, చివరకు సక్సెస్ అయ్యాడు. ఆమె మనదేశంలో లేదు. స్విట్జర్లాండ్ లో ఉంది. అక్కడే జాబ్ చేస్తోంది.
ఎలాగైనా స్విట్జర్లాండ్ వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. 2017 ఏప్రిల్ 11న ఆఫీసుకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పిన ప్శాంత్.. స్విట్జర్లాండ్ బయలుదేరాడు. అయితే.. విమానంలో కాదు. రైలు బండిలో! అదేంటీ.. స్విట్జర్లాండ్ కు రైలు బండి ఎలా వెళ్తుందంటారేమో..? షార్ట్ కట్ ద్వారా వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ప్రశాంత్ ప్లాన్ ప్రకారం ముందుగా పాకిస్థాన్ వెళ్లాలి. హైదరాబాద్ నుంచి స్విట్జర్లాండ్ ఎంత దూరం అని గూగుల్ మ్యాప్ ను అడిగితే.. జస్ట్ 8,400 కిలోమీటర్స్ అని చెప్పిందట. అది పాకిస్తాన్ మీదుగా వెళ్లాలని సూచించిందట. దీంతో.. అదే మార్గాన్ని ఎంచుకున్నాడు ప్రశాంత్.
తనను ట్రేస్ చేయొద్దని అనుకున్నాడేమో.. ఫోన్, పర్సు వగైరా అన్నీ ఇంట్లోనే వదిలేసి బయలుదేరాడు. ముందుగా రైలు బండి ఎక్కేసి రాజస్థాన్ వెళ్లిపోయాడు. రాజస్థాన్ లోని బికనీర్ లో దిగాడు. అక్కడి నుంచి కాలినడక మొదలు పెట్టాడు. ఏప్రిల్ 13 అంటే.. రెండు రోజుల తర్వాత భారత్పాక్ సరిహద్దు కంచె వద్దకు చేరుకున్నాడు. మన చేను చెలకలకు అడ్డుగా వేసే ఇనుప ముళ్ల కంచెల మాదిరిగానే ఉంటాయక్కడ. వాటిలోంచి దూరి పాక్ లో అడుగు పెట్టాడు. ఇప్పుడు అతను పాకిస్థాన్ లోకి అక్రమంగా ప్రవేశించిన విదేశీయుడు. ఉగ్రవాది కూడా కావొచ్చు పాక్ దృష్టిలో!
అతన్ని పాకిస్తాన్ సైన్యం సినిమాల్లో మాదిరిగానే గుర్తించడం విశేషం. రక్షణ కంచె దాటుతున్నప్పుడు అతని షర్ట్ కాస్త చినిగి, కంచెలో చిక్కకుంది. మర్నాడు అంటే ఏప్రిల్ 14న పాక్ సైన్యం ఇది గుర్తించింది. ఎవరో చొరబడ్డారని అర్థమైపోయింది. వెంటనే అలర్ట్ అయ్యారు. వేట మొదలు పెట్టారు. అయితే.. ప్రశాంత్ ను ఈజీగానే పట్టుకున్నారు. కారణం.. అప్పటి వరకు తిండీ తిప్పలు లేకుండా రైల్లో ప్రయాణించి, ఆ తర్వాత కిలోమీటర్ల దూరం నడిచీ నడిచీ అలసిపోయాడు. సమీపంలోని ఓ గుడిసెలోనే కుప్పకూలిపోయాడు.
అతన్ని జాగిలాల సాయంతో పట్టేసుకున్న సైన్యం.. ప్రశాంత్ వివరాలు ఆరాతీసి, అతను ఉగ్రవాది కాదని, సాధారణ పౌరుడేనని గుర్తించాయి. అయినప్పటికీ.. దేశంలో అక్రమంగా చొరబడినట్టే కాబట్టి.. నేరం చేసినట్టే లెక్క. రెండేళ్లు సైన్యం ఆధీనంలోనే ఉంచుకున్న తర్వాత అక్కడి నిబంధనల ప్రకారం స్థానిక కోర్టులో హాజరు పరిచింది. ఆ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. దీంతో.. కోట్ లాక్ పాట్ జైలుకు తరలించారు.
ఇక, భారత్ లో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. కొడుకు ఎక్కడికి వెళ్లాడో తెలియక భయపడసాగారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 29న హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాక్ సైన్యం ఆధీనంలో ఉన్నంత కాలం ప్రశాంత్ గురించి ప్రపంచానికి తెలియలేదు. కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. అప్పుడు మీడియాతో మాట్లాడిన ప్రశాంత్ తన పరిస్థితిని వివరించాడు. కోర్టుకు తీసుకొస్తున్నప్పుడల్లా తల్లిదండ్రులకు ఫోన్ చేసుకునే అవకాశం కల్పించేవారు. ఆ విధంగా కొడుకు ప్రాణాలతోనే ఉన్నాడని సంతోష పడిన తల్లిదండ్రులు.. అతడిని భారత్ కు తీసుకొచ్చే పని మొదలు పెట్టారు.
హైదరాబాద్ సీపీ సజ్జనార్ ను కలిసి పరిస్థితి వివరించారు. ప్రత్యేక కేసుగా పరిగణించిన సీపీ.. స్వయంగా ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంశాఖకు విషయం తెలిపారు. ఆ విధఃగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసులు చేసిన ప్రయత్నం ఫలించి పాక్ జైలు నుంచి విడుదలయ్యాడు ప్రశాంత్. మే 31న పాక్ సరిహద్దు రాష్ట్రంగా ఉన్న పంజాబ్ పరిధఙలోని అట్టారీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడి నుంచి మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరాడు ప్రశాంత్.
ఈ ఘటనపై ప్రశాంత్ మాట్లాడుతూ.. స్విట్జర్లాండ్ వెళ్లే స్థోమత లేక కాలినడకన బయలుదేరినట్టు చెప్పాడు. వెళ్లే టప్పుడు చాలా ఇబ్బందులు పడినట్టు చెప్పాడు. పాక్ సైనికుల ఆధీనంలో ఉన్నప్పుడు వాళ్లు తినే ఆహారం తనకు కడుపు నిండా పెట్టేవాళ్లని చెప్పాడు. కోర్టుకు హాజరుపరిచిన తర్వాత కాస్త స్వేచ్ఛ దొరికినట్టు ఫీలయ్యానని అన్నాడు ప్రశాంత్. మొత్తానికి అతడు స్వదేశానికి చేరడంతో అందరూ ఆనందం వ్యక్తంచేశారు.