Chandrababu: క్వాష్ పిటిషన్.. చంద్రబాబు అరెస్టు నుంచి వినిపిస్తున్న బలమైన మాట ఇది. ఏసీబీ కోర్టు నుంచి ప్రారంభమైన ఈ పిటిషన్ ప్రస్థానం.. ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరుకుంది. ఇక్కడ సానుకూలంగా తీర్పు వస్తుందని చంద్రబాబు ఆశిస్తున్నారు. కేసుల నుంచి బయటపడవచ్చు అని భావిస్తున్నారు. కానీ సుదీర్ఘ వాదనలు, విచారణ వాయిదాలు చూస్తుంటే అనుమానాలు రేకెత్తుతున్నాయి. సుప్రీం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
వాస్తవానికి క్వాష్ పిటిషన్ అంటే లోతైన విచారణ లేకుండా.. అసలు కేసులు పెట్టడమే నిబంధనలకు విరుద్ధమని న్యాయస్థానం తేల్చేయడమే. తనపై నమోదైన కేసులకు సంబంధించి, తన అరెస్టుకు గవర్నర్ అనుమతి తీసుకోలేదు కాబట్టి.. ఈ కేసులను క్వాష్ చేయాలని చంద్రబాబు కోరుతూ వచ్చారు. అటు ఏసీబీ కోర్టు, ఇటు హైకోర్టులో సైతం ఇదే రకంగా వాదించారు. ఆ రెండు కోర్టులో చుక్కెదురు కావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ఇప్పుడు అక్కడ సుదీర్ఘమైన వాదనలు కొనసాగుతున్నాయి. విచారణలు సైతం వాయిదా పడుతూ వస్తున్నాయి.
అయితే క్వాష్ పిటిషన్ అంటే మామూలు విషయం కాదని.. గంటల తరబడి వాదించేది ఏమీ ఉండదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. సాంకేతికగా కేసులు చెల్లవు అనే పాయింట్ పై మాత్రమే వాదించడానికి ఆస్కారం ఉంటుంది. అసలు కోర్టులు కూడా ఎక్కువ సమయం తీసుకోవు. సుదీర్ఘ విచారణ, సాక్షాధారాల పరిశీలన ఉండదని తెలుస్తోంది. అయితే చంద్రబాబు దాఖలు చేసుకున్న క్వాష్ పై గంటలకు వాదనలు జరిగాయి అంటే… పిటిషనర్ కు సానుకూలత లేనట్టేనని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్ పై బలమైన వాదనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు తరపు న్యాయవాదులు ఒకపూట వాదనలు వినిపించారు. అటు సిఐడి తరఫున న్యాయవాదులు సైతం తమ బలమైన వాదనలు వినిపించ గలిగారు. ఈనెల 13 కు కేసు వాయిదా పడింది. ఆరోజు సైతం విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఆరోజు తీర్పు వస్తుందా? లేదా? లేకుంటే తీర్పు రిజర్వ్ అవుతుందా? అనే అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు. క్వాష్ పిటిషన్లపై సుదీర్ఘ వాదనలు, వాయిదాల పర్వం చూస్తుంటే ఇక్కడ కూడా చంద్రబాబుకు స్వాంతన దక్కదు అన్న టాక్ అయితే మాత్రం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.