Chandrababu Jail: ఢిల్లీకి లోకేష్ ఎందుకు వెళ్లారు? అక్కడ ఏం సాధించారు? రోజుకు కోట్లాది రూపాయలకు తీసుకునే ఖరీదైన లాయర్లు, నిత్యం న్యాయ నిపుణులు సలహాలతో ముందుకు సాగుతున్నట్లు కనిపించారు. కానీ చంద్రబాబును మాత్రం బయటకు తీసుకురాలేకపోయారు. విషయంలో లోకేష్ ది స్వయం కృతాపం అన్న టాక్ నడుస్తోంది.
తన తండ్రి చంద్రబాబు అరెస్ట్‌తో యువగళం పాదయాత్రను కూడా తాత్కాలికంగా వాయిదా వేసిన లోకేష్ కేవలం రెండు రోజులు మాత్రమే రాజమండ్రిలో ఉన్నారు. పవన్ కల్యాణ్, బాలకృష్ణతో కలసి ఆయన చంద్రబాబుతో ములాఖత్ అయిన తర్వాత రాజమండ్రి నుంచి హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. న్యాయ నిపుణులు, కోవిదులతో ఎప్పటికప్పుడు చర్చలు జరిపారు. అయితే బెయిల్ విషయంలో వేగంగా పావులు కదపడంలో వెనుకబడ్డారు. సరైన సమయంలో.. సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయారు.అందుకే చంద్రబాబు నెల రోజులు పాటు జైల్లో ఉండిపోవాల్సి వచ్చిందని విమర్శలు ఎదురవుతున్నాయి.
కనీసం తండ్రికి రాజకీయంగా లోకేష్ వెన్నుదన్నుగా నిలవలేకపోయారు. ఆయన కేసులు విషయంలో సైతం సరైన నిర్ణయాలు తీసుకోలేక తండ్రి జైలు జీవితానికి కారణమయ్యారన్న అపవాదును మూటగట్టుకుంటున్నారు. కేవలం స్పెషల్ లీవ్ పిటిషన్ తో కాలం వెల్లదీశారని… సరైన నిర్ణయాలు, కోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేసి ఉంటే ఈపాటికే చంద్రబాబు బయటకి వచ్చి ఉండేవారని న్యాయ కోవిదులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు జైలు జీవితానికి ఎవరో కారణం కాదు.. ముమ్మాటికీ లోకేష్ కారణమని సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. ఇవి నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి.