Nara Lokesh: నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. ఇప్పటికే మూడు జిల్లాలను పూర్తిచేసుకుంది. జగన్ అడ్డాలో కూల్ గా సాగిపోతోంది. ఎన్నో అవాంతరాలను అధిగమిస్తూ లోకేష్ తన పాదయాత్రను పట్టుదలగా కొనసాగిస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభమైన యాత్ర సక్సెస్ ఫుల్ గా రన్నవుతోంది. కొద్దిరోజుల్లో కడప జిల్లాలో ముగిసి కోస్తాలో అడుగుపెట్టనుంది. రాయలసమీలో యాత్ర ముగియనుండడంతో వారి ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికను లోకేష్ ప్రకటించనున్నారు. ఈ నెల 7న రాయలసీమ డిక్లరేషన్ ను వెల్లడించనున్నారు. రాయలసీమ అభివృద్ధి కోసం ప్రత్యేకమైన విజన్ తో ముందుకు వెళుతున్నట్టు టీడీపీ ఇప్పటికే ప్రకటించింది. రాయలసీమలో పాదయాత్ర పూర్తయ్యే సమయానికి డిక్లరేషన్ ప్రకటిస్తానని లోకేష్ చెప్పారు. అందుకు అనుగుణంగా ప్రకటించనున్నారు.
యువగళం పాదయాత్రలో సమస్యలు తెలుసుకునేందుకే లోకేష్ ప్రాధాన్యమిచ్చారు. వాటితోనే ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నారు. సీమలో ఉపాధి లేక వలసలు పోతున్న కూలీల కన్నీరును, ఉద్యోగ అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు తరలివెళ్తున్న యువత సమస్యలను యువగళం పాదయాత్రలో లోకేశ్ నేరుగా తెలుసుకున్నారు. అలాగే సీమలో సాగునీరు లేక, సాయం అందక రైతన్నలు పడుతున్న ఇబ్బందులను, అక్కచెల్లెమ్మలు పడుతున్న కష్టాలనూ స్వయంగా చూశారు. వీటన్నింటినీ క్రోడీకరించి.. రాయలసీమ డిక్లరేషన్ రూపొందించారు. దానినే తన యువగళం సభా వేదికపై ప్రకటించనున్నారు. ఇందుకు సంబంధించి టీడీపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి.
రాజకీయంగా రాయలసీమ టీడీపీకి సానుకూలంగా మారుతుందన్న సంకేతాలు వస్తున్నాయి. ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందడంతో ఈ నమ్మకం నిజమైంది. వైసీపీ ఆవిర్భావం నుంచి రాయలసీమ ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తోంది. గత ఎన్నికల్లో అయితే టీడీపీకి కనీస ప్రాతినిధ్యం దక్కకుండా చేసింది. వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. చాలా జిల్లాల్లో కనీసం టీడీపీకి అవకాశం లేకుండా పోయింది. కేవలం జగన్ ఏదో చేస్తాడని భావించే రాయలసీమ ప్రజలు ఏకపక్ష విజయాన్ని అందించారు. కానీ వారి అంచనాలు, ఆలోచనలకు తగ్గట్టు పాలన సాగలేదు. దీంతో ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. అందుకే టీడీపీ రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించి వారి అభిమానాన్ని చూరగొనాలని ప్రయత్నిస్తోంది.
జగన్ కుటుంబానికి రాయలసీమ పెట్టని కోట. కానీ అభివృద్ధిపరంగా ఆ కుటుంబం రాయలసీమకు అనుకున్న స్థాయిలో అభివృద్ధి చేయలేదన్న అపవాదు. రాయలసీమను సొంత ఆస్తిలాగా వాడుకుంటూ దశాబ్దాలుగా పెత్తనం చేస్తున్న వైఎస్ ఫ్యామిలీ.. చేసిన అభివృద్ధి శూన్యం. ప్రజలు ఆర్థికంగా బలవంతులైతే తమ మాట వినరన్న ఉద్దేశంతో పరిశ్రమల్ని రాకుండా చేసేవారు. వారి ప్రభుత్వాలు లేనప్పుడు… వచ్చే ఇతర ప్రభుత్వాలు సీమలో పరిశ్రమల్ని ప్రోత్సహించేవి. ఇలాంటి పరిస్థితుల్నిప్రజలకు వివరించడంలో ముందు ఉన్న లోకేష్… తన ప్రణాళికనుప్రకటించి… రాయలసీమ వాసుల నమ్మకాన్ని చూరగొనాలని అనుకుంటున్నారు. రాయలసీమ డిక్లరేషన్ తో టీడీపీ ఫేవర్ పెరుగుతుందని ఆశాభావంతో ఉన్నారు.