
జగన్ సర్కార్ మూడు రాజధానుల నిర్ణయం వల్ల నష్టపోయిన వాళ్లు ఎవరైనా ఉన్నారా అంటే వాళ్లు టీడీపీ నేతలు మాత్రమేనని చెప్పాలి. టీడీపీ అమరావతిని రాజధానిగా ప్రకటించక మునుపే చాలామంది టీడీపీ నేతలు రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో తక్కువ ధరకే భూములను కొనుగోలు చేశారు. రాజధాని అభివృద్ధి చెందిన తరువాత ఆ భూములను విక్రయించి కోట్ల రూపాయల లాభాలు పొందాలని భావించారు.
కట్ చేస్తే జగన్ మూడు రాజధానుల ప్రకటనతో టీడీపీ నేతల ప్లాన్ మొత్తం రివర్స్ అయింది. 2019 ఎన్నికలకు ముందు కోట్ల రూపాయలు పలికిన అమరావతి భూములు ప్రస్తుతం లక్షల రూపాయలే పలుకుతున్నాయి. జగన్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖను ప్రకటించడంతో కొందరు టీడీపీ నేతలు కోట్ల రూపాయలు నష్టపోయారని తెలుస్తోంది. అందువల్లే చంద్రబాబు, లోకేశ్ విశాఖలో పలు ప్రమాదాలు చోటు చేసుకున్నా ఆ జిల్లాకు వెళ్లడానికి ఇష్టపడటం లేదు.
లోకేశ్ కు విశాఖలో అడుగు పెట్టాలంటే భయమో ఇంకేమైనా కారణాలున్నాయో తెలియదు కానీ విశాఖపై విషం కక్కే చినబాబు ఆ ప్రాంతంపై బురద జల్లటానికి వెనుకాడటం లేదు. గత ఎన్నికల్లో టీడీపీకి పరవాలేదనిపించే స్థాయిలో స్థానాలు దక్కిన జిల్లాల్లో విశాఖ ఒకటి. అయితే ఆ విశ్వాసం కూడా లేకుండా లోకేశ్ విశాఖపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. పైకి విశాఖపై ప్రేమ ఉన్నట్టు వైసీపీ విశాఖలో అరాచకాలు సృష్టిస్తున్నట్టు లోకేశ్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
గత కొన్ని నెలలుగా విశాఖవాసులు భయానక పరిస్థితుల్లో ఉన్నట్టు లోకేశ్ చేస్తున్న వ్యాఖ్యలు ఆ జిల్లా ప్రజలకే నవ్వు తెప్పిస్తున్నాయి. విశాఖలో ఏదో జరగబోతుందని లోకేశ్ ఎన్ని విమర్శలు చేసినా అసలు నిజం ఏమిటో రాష్ట్ర ప్రజానీకం మొత్తానికి తెలుసు.