Nara Lokesh Padayatra: సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ మరో రికార్డును అధిగమించారు. తండ్రి చంద్రబాబు పేరుతో ఉన్న రికార్డును బ్రేక్ చేశారు. గతంలో పాదయాత్ర చేసిన చంద్రబాబు నడకను లోకేష్ అధిగమించగలిగారు.ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. గురువారం నాటికి 2,817 కిలోమీటర్ల మైలురాయిని లోకేష్ దాటారు. మరో 90 రోజుల్లో నాలుగు వేల కిలోమీటర్ల లక్ష్యానికి లోకేష్ చేరుకోనున్నారు.
2012లో ఉమ్మడి ఏపీలో చంద్రబాబు పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో 208 రోజులపాటు పాదయాత్ర చేసి చంద్రబాబు 2,817 కిలోమీటర్లు నడవగలిగారు. అయితే నారా లోకేష్ మాత్రం 206 రోజుల్లోనే ఆ లక్ష్యానికి చేరువ కావడం గమనార్హం.2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు టిడిపిని అధికారంలోకి తెచ్చేందుకు పాదయాత్రకు పూనుకున్నారు. విశాఖ జిల్లా వరకు పాదయాత్ర చేయగలిగారు. చంద్రబాబుతో పోల్చుకుంటే లోకేష్ పాదయాత్ర షెడ్యూల్ ఎక్కువ. 300 రోజుల్లో నాలుగు వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకోవాలన్నది లోకేష్ లక్ష్యం. ఇప్పటికే 206 రోజులు పూర్తి చేశారు. మరో 90 రోజులపాటు నడకను కొనసాగించనున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పాదయాత్రను ముగించనున్నారు.
వాస్తవానికి చంద్రబాబు ఆరుపదుల వయసులో సైతం సుదీర్ఘకాలం నడిచారు. కానీ లోకేష్ విషయానికి వచ్చేసరికి అంత దూరం నడవగలరా అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. చివరకు పార్టీ శ్రేణులు సైతం పెద్దగా నమ్మలేదు. కానీ అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ లోకేష్ పాదయాత్ర ముందుకు సాగింది. వందలు, వేల కిలోమీటర్ల మైలురాయి దాటింది. అనుకున్న లక్ష్యానికి చేరువవుతోంది. లోకేష్ ను భావి నాయకుడిగా ప్రమోట్ చేస్తోంది.