Lok Sabha elections 2024: బీజేపీ ఫస్ట్‌ లిస్ట్‌ రెడీ.. తెలంగాణలో సగం సీట్లకు అభ్యర్థులు ఖరారు?

బీజేపీ దేశంలో చాలా రాష్ట్రాల్లో బలంగా ఉంది. ముఖ్యంగా ఉత్తరభారత దేశంలో చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. దక్షిణాదిన అధికారంలో ఉన్న ఒక్క రాష్ట్రం కర్ణాటకను కూడా ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో కోల్పోయింది.

Written By: Raj Shekar, Updated On : March 1, 2024 10:52 am
Follow us on

Lok Sabha elections 2024: దేశంలో పార్లమెంట్‌ ఎన్నికల హీట్‌ రోజురోజుకూ పెరుగుతోంది. మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ(BJP) వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో అందరికంటే ముందుగానే ప్రచారం ప్రారంభించింది. మరోవైపు అభ్యర్థుల జాబితాను కూడా ముందే ప్రకటించాలని భావిస్తోంది. ఈ క్రమంలో పార్టీ జాతీయ ఎన్నికల కమిటీ సమావేశం గురువారం(ఫిబ్రవరి 29న) నిర్వహించారు. ఈ మీటింగ్‌లో తొలి జాబితా రెడీ చేసినట్లు తెలుస్తోంది. మార్చి 1న ఫస్ట్‌ లిస్ట్‌ రిలీజ్‌ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

బలమైన స్థానాలకు అభ్యర్థులు..
బీజేపీ దేశంలో చాలా రాష్ట్రాల్లో బలంగా ఉంది. ముఖ్యంగా ఉత్తరభారత దేశంలో చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. దక్షిణాదిన అధికారంలో ఉన్న ఒక్క రాష్ట్రం కర్ణాటకను కూడా ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో కోల్పోయింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీ బలం అంతంత మాత్రమే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో ఓట్లు, సీట్లు పెంచుకుంది. అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నా.. కొన్ని తప్పుడు నిర్ణయాలతో చేజార్చుకుంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో మాత్రం అలాంటి పొరపాటు జరుగకుండా జాగ్రత్త పడుతోంది. మోదీ వేవ్‌తో మెజారిటీ సీట్లు గెలవాలని ప్లాన్‌ వేస్తోంది. ఇందులో భాగంగా బలమైన అభ్యర్థులు, పార్టీకి బలం ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

9 రాష్ట్రాల్లో అభ్యర్థులు రెడీ
ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యలయంలో గురువారం(ఫిబ్రవరి 29న) నిర్వహించిన సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ మీటింగ్‌లో 9 రాష్ట్రాల్లో పార్టీ లోక్‌సభ అభ్యర్థుల జాబితా రెడీ చేసింది. తెలంగాణ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, గోవా రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ఉన్నట్లు తెలుస్తోంది. తొలి జాబితాలో 125 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నట్లు సమాచారం.

తెలంగాణలో ఖాయమైన సీట్లు ఇవే..
ఇక తొలి జాబితాలో తెలంగాణలో ముగ్గురు సిట్టింగులకు టికట్‌ దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్‌కు మళ్లీ ఛాన్స్‌ ఇస్తారని సమాచారం. ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావుకి ఈసారి అవకాశం లేనట్లు ప్రచారం జరుగుతోంది. అక్కడ రాథోడ్‌ రమేశ్‌ లేదా గొడం నగేష్‌కు టికెట్‌ ఇవ్వొచ్చనే చర్చ జరుగుతోంది. ఇక డీకే.అరుణ, ఈటల రాజేందర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాములు, బూర నర్సయ్యగౌడ్‌ తదితరుల పేర్లు తొలి జాబితాలో ఉంటాయని తెలుస్తోంది.

10 రోజుల్లో 300 స్థానాలకు అభ్యర్థులు..
ఫస్ట్‌ లిస్ట్‌ను విడుదల చేసి.. మరో పది రోజుల్లో మరో జాబితా రిలీజ్‌ చేయాలని బీజేపీ భావిస్తోంది. మార్చి 10వ తేదీలోపు 300 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాలని కమలనాథులు భావిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే నాటికే మెజారిటీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూకుడు పెంచాలని భావిస్తోంది. కాంగ్రెస్‌కు అభ్యర్థులు దొరకని పరిస్థితి. మరోవైపు ఇండియా కూటమిలో ఇంకా సీట్ల పంపకాలు కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ దూకుడు పెంచుతోంది. ఈ ఏడాది జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే వ్యూహం అమలు చేసింది. మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో పార్లమెంటు ఎన్నికల్లోనూ అదే వ్యూహం అమలుకు కసరత్తు చేస్తోంది.

సిట్టింగ్‌లకు షాక్‌..
ఇదిలా ఉంటే 2019 ఎన్నికల్లో గెలిచిన ఎంపీల్లో మూడోవంతు నేతలకు ఈసారి బీజేపీ షాక్‌ ఇస్తుందని సమాచారం. వీరిలో 70 ఏళ్లు దాటినవారు. మూడుసార్లు పోటీచేసిన వారు ఉంటారని తెలుస్తోంది. వారి స్థానంలో యువతకు అవకాశం ఇవ్వాలని కమలం పార్టీ భావిస్తోంది. మరి ఈ ప్లాన్‌ వర్కవుట్‌ అవుతుందో లేదో చూడాలి.