కరోనా మహమ్మారితో సంబంధం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ లో ఎప్పుడైనా మధ్యలో ఆగిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల పక్రియను చేపట్టే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా గత శనివారం నాటకీయంగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ కనకరాజ్ నేడు స్పష్టమైన సంకేతం ఇచ్చారు.
ఏపీ ప్రభుత్వం హడావుడిగా ఆర్డినెన్సు ద్వారా ఎన్నికలను కరోనా కారణంగా వారల పాటు వాయిదా వేసిన ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ పదవీకాలాన్ని కుదించి, ఆ స్థానంలో రహస్య జీవోతో కనగరాజ్ ను ఎన్నికల కమీషనర్ గా నియమించడం చెలిసిందే.
తొలిసారి కమీషన్ లోని అధికారులతో నేడు సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాల్సి వచ్చినా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. కరోనా ప్రభావం కారణంగా అసాధారణ పరిస్థితి నెలకొందని చెబుతో సమాయనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవాలని పేర్కొంటూ ఈ ఉపద్రవంతో సంబంధం లేకుండా ఎన్నికలు జరిపే అవకాశం ఉన్నట్లు సంకేతం ఇచ్చారు.
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనలో పంచాయతీ రాజ్ వ్యవస్థ కీలకపాత్ర పోషిస్తుందని చెబుతూ చివరి వ్యక్తి వరకూ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు చేరువ కావాలని, అందుకోసం స్థానిక సంస్థల ఏర్పాటు ఇందులో చాలా కీలకమని కనగరాజ్ పేర్కొన్నారు. తద్వారా ఎన్నికలను మరింకా వాయిదా వేయడం తగదని సహితం కూడా పరోక్షంగా సందేశం ఇచ్చారు.
జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాల్సి వచ్చినా సర్వం సమాయత్తంగా ఉండాలని సూచించారు. స్థానిక ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళి అతికీలకమని కూడా కనగరాజ్ పేర్కొన్నారు.